ప్రజలను వెధవలు అంటారా? | Sakshi
Sakshi News home page

ప్రజలను వెధవలు అంటారా?

Published Wed, Apr 24 2024 5:47 AM

Jogi Ramesh comments on TDP NRI wing - Sakshi

తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన టీడీపీ ఎన్‌ఆర్‌ఐలు 

పెత్తందారి ఆలోచనలకు ఇది నిదర్శనం  

ఎన్నికల కమిషన్‌ సుమోటోగా కేసు నమోదు చేయాలి 

మంత్రి జోగి రమేష్‌ 

పెనమలూరు: ‘రాష్ట్ర ప్రజలను వెధవలు అని కించపరుస్తారా... ఇది మీ పెత్తందారి ఆలోచనలకు నిదర్శనం...’ అని టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నేతలపై మంత్రి జోగి రమేష్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. కృష్ణాజిల్లా గంగూరులోని తన కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం దెబ్బతీసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు అందరూ సీఎం వైఎస్‌ జగన్‌ వైపే ఉన్నారని, రాష్ట్రానికి మళ్లీ జగనన్న సీఎం అవుతారని అనేక సర్వేలు స్పష్టంచేశాయని చెప్పారు. దీంతో టీడీపీ దిక్కుతోచక అధికారం కోసం అడ్డదారులు తొక్కుతోందన్నారు.

ఇందులో భాగంగా టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం రంగంలోకి వచ్చిందని, ప్రజలను డబ్బులతో ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నిస్తోందన్నారు. ఈ ప్రయత్నంలో ‘డబ్బుతో ఓట్లు కొనవచ్చు... తెలుగు ప్రజలు వెధవలు...’ అంటూ టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నేత కోమటి జయరాం చేసిన ప్రసంగాన్ని జోగి రమేష్‌ మీడియాకు చూపించారు. ఇక్కడే పుట్టి, ఇక్కడే చదివి, విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించుకున్న తరువాత తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ మాట్లాడటం దారుణమని, ఇది పెత్తందారుల మనస్తత్వానికి నిదర్శమని మండిపడ్డారు.

కోమటి జయరాం, టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నేతలపై ఎన్నికల కమిషన్‌ సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఎన్‌ఆర్‌ఐలు చంద్రబాబును నమ్మి రాజకీయాల్లో తలదూర్చి అక్రమాలకు పాల్పడితే నట్టేట ముంచుతాడని జోగి రమేష్‌ హెచ్చరించారు. ఎన్‌ఆర్‌ఐలు డబ్బు సంచులతో గ్రామాల్లోకి వచ్చి ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తే జనం తరిమికొడతారని, దొంగ ఓట్లు వేయటానికి ప్రయత్నిస్తే జైలుకు వెళతారని స్పష్టంచేశారు.

ఈ ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో ఓడిపోయి హైదరాబాద్‌కు పలాయనం చిత్తగిస్తారని, ఇక ఆయన ఎన్‌ఆర్‌ఐలను ఎలా కాపాడుతారో ఆలోచించుకోవాలని సూచించారు. ఎన్‌ఆర్‌ఐలు తాము పుట్టి, పెరిగి, చదువుకున్న ప్రాంతానికి నిస్వార్థంగా సేవ చేయాలని, స్వార్థ రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరారు. పేదలకు మేలు చేస్తున్న సీఎం జగన్‌కు ఎన్‌ఆర్‌ఐలు మద్దతు తెలిపితే ప్రజలందరికి మరింత మంచి జరుగుతుందని చెప్పారు.

Advertisement
Advertisement