తుమ్మల చేరిక.. కాంగ్రెస్‌ అంచనా ఇది | Sakshi
Sakshi News home page

తుమ్మల విషయంలో కాంగ్రెస్‌ అంచనా ఇది

Published Sat, Sep 16 2023 7:10 PM

Ex Minister Thummala Joined Congress Party Expectations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం హైదరాబాద్‌ వచ్చిన కాంగ్రెస్‌ కీలక నేతల సమక్షంలో.. కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఈ పరిణామానికి కొన్ని గంటల ముందే.. ఆయన బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. 

ఇదిలా ఉంటే.. ఖమ్మం కీలక నేత అయిన తుమ్మల అధికార పార్టీ నుంచి పాలేరు టికెట్‌ ఆశించి భంగపడ్డారు. బీఆర్ఎస్‌లో టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో కారు దిగి హస్తం గూటికి చేరారు.

తుమ్మల నాగేశ్వరరావు  రాజకీయ ప్రస్థానం టీడీపీతో ప్రారంభమైంది. 1983 ఎన్నికల్లో ఓడారాయన.  ఆపై సత్తుపల్లి నుంచి 1985, 1994, 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గారు. 2009లో ఖమ్మం నుంచి నెగ్గారు. 2014 విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో 6 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.  ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారాయన. ఎమ్మెల్సీగా మంత్రి బాధ్యతలు చేపట్టారు కూడా.  అప్పటి నుంచి పాలేరు కేంద్రంగా రాజకీయం నడిపిస్తున్నారు. 2016లో పాలేరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక జరగ్గా..  తుమ్మల నాగేశ్వరరావు  విజయం సాధించారు. అయితే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి  బీఆర్ఎస్ అభ్యర్ధిగా  పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తుమ్మల కాంగ్రెస్‌ చేరికతో ఖమ్మం రాజకీయాలు ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మూడున్నర దశాబ్దాల రాజకీయానుభవం. ఖమ్మం రాజకీయాలను చక్రం తిప్పడంలో సిద్ధహస్తుడు. ఖమ్మం జిల్లా రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపించే వ్యక్తి. టీడీపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలతోనూ పని చేసిన నేత.  అక్కడి అభివృద్ధి విషయంలోనూ ఆయనకు మంచి పేరుంది. పైగా సొంతంగా.. బలమైన క్యాడర్ కూడా ఉంది. అందుకే తుమ్మల ప్రభావంతో కాంగ్రెస్‌ మరిన్ని సీట్లు పెంచుకోవచ్చని ఆశిస్తోంది. ప్రత్యేకించి.. కమ్మ సామాజిక వర్గం నుంచి ఓట్లు రాబట్టే అవకాశం ఉందని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది. గతంలో లాగానే ఈసారి కూడా ఖమ్మంను కంచుకోటగా నిలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement