మీ డ్రీమ్సే.. నా స్కీమ్స్‌: సీఎం వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

మీ డ్రీమ్సే.. నా స్కీమ్స్‌: సీఎం వైఎస్‌ జగన్‌

Published Wed, Apr 24 2024 4:26 AM

CM YS Jagan Comments At Chelluru Memantha Siddham Sabha - Sakshi

ప్రజలందరి కలలు మన సంక్షేమ పథకాలతో సాకారం 

విజయనగరం జిల్లా చెల్లూరు మేమంతా సిద్ధం సభలో సీఎం వైఎస్‌ జగన్‌ 

మీ బిడ్డ తెచ్చిన పథకాలు ఏకంగా దాదాపు 40 

మన రాష్ట్రం, గ్రామాల కలలనూ నెరవేర్చాం 

ప్రతి ఊరిలో ఏడు వ్యవస్థలు తెచ్చి అవస్థలు తొలగించాం 

జనానికి మంచి చేసిన మీ జగన్‌పై తోడేళ్ల దాడి 

మన పాలనలో జరిగిన మేలుపై మీ కుటుంబమంతా చర్చించుకోవాలి 

పిల్లలు, సంక్షేమ పథకాల భవిష్యత్తు గురించి ఆలోచించాలి 

చంద్రబాబు పాలనలో స్కీముల్లేవు.. అన్నీ స్కాములే 

మళ్లీ ప్రజల రక్తం తాగడానికి చంద్రముఖిలా మారాడు 

కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్లు నడపటం మినహా బాబు చేసిందేమిటి? 

పొలాల్లో దిష్టిబొమ్మనైనా నమ్మొచ్చుగానీ ఆయన్ను మాత్రం నమ్మలేం  

ఊరు కలలనూ నెరవేర్చాం..ఊరికి కూడా కలలుంటాయి. గ్రామంలో అందే సేవలు బాగుంటేనే తమ ఊరు బాగుంటుందని.. ఆ గ్రామాన్ని విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో వెళ్లిపోరని.. గ్రామానికి కూడా కల ఉంటుంది. ఆ గ్రామం డ్రీమ్‌ కోసం మీ జగన్‌ ఎన్ని స్కీమ్‌లు తెచ్చాడో తెలుసా? ఏకంగా ఏడు స్కీమ్‌లు తెచ్చాడు. ఆ గ్రామంలోనే కనిపిస్తాయి సచివాలయాలు, 60–70 ఇళ్లకో వలంటీర్‌ వ్యవస్థ,  ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, నాడు–నేడుతో మారిన ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు, మహిళా పోలీసు వ్యవస్థ కనిపిస్తాయి. వీటితోపాటు నిర్మాణంలో ఉన్న డిజిటల్‌ లైబ్రరీలు కూడా కనిపిస్తాయి. గ్రామానికే వచ్చిన ఫైబర్‌ గ్రిడ్‌.. ఇవన్నీ మీ గ్రామాల్లోనే కనిపించే జగన్‌ మార్కు విప్లవాత్మక మార్పులు. గ్రామాలే కాకుండా రాష్ట్రం కలలను కూడా సాకారం చేస్తూ విప్లవాత్మక చర్యలు చేపట్టాం.   

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘‘డ్రీమ్స్‌ మీవి.. స్కీమ్స్‌ మీ బిడ్డ జగన్‌వి! ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం కలలను నెరవేరుస్తూ విప్లవాత్మక పథకాలు, వ్యవస్థలు తీసుకొచ్చాం. 58 నెలల పాలనలో మీ అందరి కల­లను నెరవేర్చిన ప్రజా ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వ­దించి 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాల్లో ఫ్యాన్‌ గుర్తుపై రెండు బటన్లు నొక్కాలి’’ అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. మంగళవారం సా­యంత్రం విజయనగరం జిల్లా చెల్లూరు వద్ద నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. 

 ‘చెల్లూరు సభ జనసముద్రాన్ని తలపిస్తోంది. ఒక్కసారిగా లక్షల మంది తాండ్ర పాపారాయుళ్లు శత్రుసైనాన్ని చిత్తుగా ఓడించేందుకు సిద్ధమైతే, ఆ యుద్ధం ఎలా ఉంటుందో పేదల వ్యతిరేకులకు రు­చి చూపించడానికి నా ఉత్తరాంధ్ర, నా విజయ­నగ­రం సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తోంది. ఈ ఎన్ని­కలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. ఇంటింటి భవిష్య­త్తును, తమకు అందుతున్న పథకాలను, ఇంటికే వచ్చే పౌర సేవ­లను, తమ పిల్లల భవిష్యత్తును రా­బో­యే ఐదేళ్లు కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రజ­లంతా గుర్తించారు.

వారికి అడ్డుతగులుతున్న ఆ పెత్తం­దార్లకు, ఆ కౌరవ సైన్యానికి, ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తున్న ప్రజాసై­న్యం ఈ రోజు నా కళ్ల ఎదుట కనిపిస్తోంది. చంద్రబాబుకు కాంగ్రెస్, బీజేపీ పరోక్షంగా, ప్రత్య­క్షంగా మద్దతిస్తున్నాయి. ఇదే బాబుకు తోడు­గా దత్తపుత్రు­డున్నా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉన్నాయి. వాళ్లు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, అబద్ధాలు కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. ఒక్క జగన్‌ మీదకు ఇంతమంది ఏకమవుతున్నారు.

జగన్‌ కనుక ఇంటింటికీ మంచి చేయకపోయి ఉంటే, జగన్‌ను ప్రతీ ఇంట్లోనూ తమ బిడ్డగా, తమ అన్నగా, తమ్ముడిగా భావించకపోతే ఇన్ని తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరం ఏముంది? జగన్‌ ఒకే ఒక్కడు కాదు. నాకున్న ధైర్యం మీరే అని సగర్వంగా చెబు­తున్నా. 58 నెలల పాలనలో ఇంటింటికీ చేసిన మంచి నా నమ్మకం. ప్రతీ వర్గాన్ని మోసం చేసిన వారితో ఈరోజు ఎన్నికల కురుక్షేత్రంలో తలపడుతు­న్నాం.

జగన్‌ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించి ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయ­బో­తున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజ­యాన్ని సొంతం చేసుకునేదానికి మీరంతా సిద్ధమే­నా? ప్రజల కలల్ని తన మోసాలతో వంచించడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుకు, ఆ బాబు కూట­మి­కి బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? 

420.. చంద్రముఖి బృందం
వస్తువులు ఎత్తుకుపోయేవారని దొంగల ముఠా అంటాం. బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠా అంటాం. మరి ఎన్నికలప్పుడు నమ్మించి ఆ ప్రజలు ఇచ్చిన అధికారంతో ఐదేళ్లూ మోసం చేసిన చరిత్ర ఉన్న కూటమిని ఏమనాలి? తియ్యటి మాటలు మే­ని­ఫెస్టోలో చెప్పి ఎన్నికలు అయిపోయిన తరువాత ప్రజల్ని మోసం చేసేవారిని ఏమంటాం? 420 అనే కదా అంటారు. పేదల కల­ల్ని, బతుకుల్ని బలిపెట్టి దోచుకునేందుకు వచ్చిన ఈ రాజకీయ కూటమిని చంద్రముఖి బృందం అని కూడా అంటాం. 

చంద్రబాబు అంటే చంద్రముఖి...
తల్లుల కలలు, బాధల గురించి 14 ఏళ్లు పాలించానని చెప్పుకునే చంద్రబాబు ఏరోజైనా ఆలోచన చేశాడా? ఆయనకు ఆ ఆలోచన ఎందుకు రాలేదంటే కారణం.. చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి. పేదలకు మంచి చేయడం కోసం కాకుండా పేదల రక్తం తాగేందుకు లకలకా అని తపిస్తాడు.

కలలను నెరవేర్చిన స్కీములు...
ఏ అక్కచెల్లెమ్మ అయినా ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంటుంది. పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని, కుటుంబం మరింత బాగుండేలా రెండు మె­ట్లు ఎదగాలని కలగంటుంది. చంద్రబాబు మాట­లు నమ్మి 2014 నుంచి 2019 మధ్య కుదేల­యిపోయిన పొదుపు సంఘాల అక్కచెల్లె­మ్మల సాధికారత, మళ్లీ వాళ్లను తమ కాళ్ల మీద తమను నిలబెట్టేందుకు వారి డ్రీమ్స్‌ను సాకారం చేస్తూ వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాలు పుట్టాయి.

45 – 60 సంవత్సరాల వయసున్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై­నార్టీ అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఆత్మ­గౌరవంతో జీవించేలా చేసేందుకు పుట్టింది వైఎ­స్సార్‌ చేయూత పథకం. నా కాపు అక్కచెల్లెమ్మల కోసం తెచ్చిన మరో పథకం వైఎస్సార్‌ కాపు నేస్తం. ఈబీసీ అక్కచెల్లెమ్మల కోసం వైఎస్సార్‌ ఈబీసీ నే­స్తం అనే పథకం. తెచ్చాం. చంద్రబాబు హయాంలో ఏరోజూ ఇలాంటి స్కీములు ఎందుకు లేవు? నాడు ఉన్నదల్లా అక్కచెల్లెమ్మలను మోసం చేయడం, రక్తాన్ని పీల్చే ఒక చంద్రముఖి పాలన మాత్రమే.

అక్కచెల్లెమ్మల సొంతింటి కల...
తమకు సొంత ఇల్లు ఉండాలని ప్రతి అక్కచెల్లెమ్మ క­ల కంటుంది. కొన్ని కుటుంబాలకు ఇది జీవితకాల కల లాంటిది. వారి డ్రీమ్‌ను నెరవేరుస్తూ 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేసి మీ బిడ్డ జగన్‌ ఇచ్చాడు. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం.

భావోద్వేగానికి గురైన మంత్రి బొత్స...
చీపురుపల్లి అభ్యర్ధిగా మంత్రి బొత్స సత్యనారాయణను సీఎం జగన్‌ పరిచయం చేసిన సందర్భంలో ఉద్వేగ వాతావరణం నెలకొంది. బొత్స తనకు తండ్రి లాంటివారని, ఆయన్ను ఆప్యాయంగా అన్నా అని పిలుస్తానని సీఎం జగన్‌ చెప్పడంతో బొత్స భావోద్వేగానికి గురయ్యారు. 

అవ్వాతాతలు.. రైతుల కలలు నెరవేర్చాం
► అవ్వా తాతల డ్రీమ్‌ ఏమిటో తెలుసా? బాబు హయాంలో మాదిరిగా పెన్షన్ల కోసం క్యూలో నిలబడి తమ ప్రాణాలు అక్కడికక్కడే పోయే పరిస్థితి రాకూడదన్నది వారి డ్రీమ్‌. ఆ పెన్షన్‌ సొమ్ము కాస్తంత పెంచి ఇస్తే బాగుంటుందన్నది డ్రీమ్‌. వారి మనవడు జగన్‌ తెచ్చిన స్కీమ్‌ ఏమిటంటే అవ్వాతాతల ఆత్మ గౌరవాన్ని నిలబెడుతూ వలంటీర్లు నేరుగా ఇంటికి వచ్చి రూ.3 వేల పెన్షన్‌ ఇవ్వడం. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. నాడు చంద్రబాబు ముష్టి వేసినట్లు రూ.వెయ్యి రాష్ట్రంలో 39 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. 

► మీ బిడ్డ వచ్చాక ఇంటివద్దే నాణ్యమైన బియ్యాన్ని అందిస్తున్నాడు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 58 నెలల కాలంలో 2.31 లక్షల ఉద్యోగాలు యువతకు ఇచ్చి వారి కలను సాకారం చేశాం. రైతన్నలు కోరుకున్నట్లుగా పంట వేసే సమయానికి పెట్టుబడి సాయం, సమయానికి నాణ్యమైన విత్తనాలు,  ఎరువులు, పురుగు మందులు గ్రామంలోనే అందచేస్తున్నాం. అమూల్‌ను తెచ్చి పాడి రైతులకు అండగా నిలిచాం. ఏకంగా 35 లక్షల ఎకరాల భూముల మీద రైతులకు పూర్తి హక్కులు ఇచ్చిందీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే.

మరి రైతుల గురించి చంద్రబాబు ఏరోజైనా ఆలోచించాడా? నాడూ నేడూ ఇదే రాష్ట్రం.. ఇదే బడ్జెట్‌. కానీ చంద్రబాబు హయాంలో డీబీటీలు, బటన్లు నొక్కడం లేవు. మీ పొలాలలో పెట్టే దిష్టిబొమ్మనైనా నమ్మొచ్చేమో గానీ చంద్రబాబును మాత్రం నమ్మలేమని గుర్తు పెట్టుకోండి. విజయవాడలో కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్లు నడపటం మినహా బాబు చేసిందేమిటి? మళ్లీ ప్రజల రక్తం తాగడానికి చంద్రముఖిలా మారాడు. జనానికి మంచి చేసిన మీ జగన్‌పై తోడేళ్లలా దాడి చేస్తున్నారు. మన 58 నెలల పాలనలో జరిగిన మేలుపై మీ కుటుంబమంతా చర్చించుకోవాలి. పిల్లలు, సంక్షేమ పథకాల భవిష్యత్తు గురించి ఆలోచించాలి

ఏకంగా 40 పథకాలు..
ఏ మనిషికైనా, ఏ కుటుంబానికైనా కొన్ని కలలు, లక్ష్యాలు ఉంటాయి. వాటిని నిజం చేసే మార్గాలు ఉంటే ఆ కుటుంబం ఒక్కో మెట్టు ఎదుగుతూ పోతుంది. అలాంటి పేదల కలల్ని అర్ధం చేసుకుని నెరవేర్చేందుకు మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్‌  ఎన్నో తెలుసా? దాదాపుగా 40. ఈ 58 నెలల కాలంలో వాటిని నెరవేర్చేందుకు మీ బిడ్డ ఏకంగా 130 సార్లు బటన్లు నొక్కాడు. ఏకంగా రూ. 2.70 లక్షల కోట్లు నేరుగా అందజేశాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లాయి. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. దీనికి తోడు నాన్‌ డీబీటీ అంటే ఇళ్లస్థలాలు, విద్యాకానుక, టాబ్స్‌... ఇవన్నీ కలిపి మరో రూ.లక్ష కోట్లకుపైగా ప్రయోజనాన్ని చేకూర్చాం. ఇలా వాళ్ల డ్రీమ్స్‌.. మీ బిడ్డ స్కీమ్స్‌ ద్వారా ఏకంగా రూ. 3.75 లక్షల కోట్లు పై చిలుకు లబ్ధి చేకూర్చాడని చెప్పడానికి గర్వపడుతున్నా.

విద్యా విప్లవం..
ప్రతి నిరుపేద తల్లి కలను నిజం చేయడానికే పుట్టింది జగనన్న అమ్మఒడి పథకం. పేద తల్లులు తన పిల్లల భవిష్యత్తు కోసం కనే కలలు గురించి అర్థం చేసుకున్నాను. తమ పిల్లల్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్‌లుగా, ఐపీఎస్‌లుగా, పెద్ద కంపెనీల్లో  ఉద్యోగస్తులుగా చూడాలని,  ఉన్నత చదువులు చదివించాలన్న కలల నుంచి పుట్టిన స్కీములతో నాడు – నేడు, ఇంగ్లిష్‌ మీడియం బడులు, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం చేశాం.

3వ తరగతి నుంచి గవర్నమెంట్‌ బడుల్లో టోఫెల్‌ శిక్షణ, సబ్జెక్టు టీచర్లు, బైజూస్‌ కంటెంట్, 6వ తరగతి నుంచి డిజిటల్‌ బోధన, క్లాస్‌ రూముల్లో ఐఎఫ్‌పీ ప్యానళ్లతో డిజిటల్‌ బోధన, 8వ తరగతికి పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టాం. పెద్ద చదువులు చదువుతున్న 93 శాతం మందికి ఈ రోజు విద్యాదీవెనతో లబ్ధి చేకూరుతోంది. డిగ్రీ కరిక్యులమ్‌లో మార్పులు తీసుకొస్తూ, విదేశీ విశ్వవిద్యాలయాల్లో సర్టిఫైడ్‌ ఆన్‌ లైన్‌ వర్టికల్స్‌ను మన డిగ్రీలతో అనుసంధానం చేయడం, డిగ్రీలో తప్పనిసరి ఇంటర్న్‌షిప్‌ తెచ్చాం. ఇవన్నీ నా అక్కచెల్లెమ్మలు, ఆ పిల్లల డ్రీమ్స్‌ నుంచి వచ్చిన మీ జగనన్న స్కీమ్స్‌. 

అత్యధిక మెజార్టీతో గెలిపించండి...
విజయనగరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలకు పరిచయం చేశారు. ఎంపీ అభ్యర్థిగా బెల్లాన 
చంద్రశేఖర్, విజయనగరం అసెంబ్లీ అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి, బొబ్బిలి అసెంబ్లీ అభ్యర్థిగా శంబంగి చిన అప్పలనాయుడు,.  నెల్లిమర్ల అసెంబ్లీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు, రాజాం నుంచి పోటీచేస్తున్న డాక్టరు తలే రాజేష్, గజపతినగరం నుంచి పోటీచేస్తున్న బొత్స అప్పలనరసయ్య, ఎచ్చెర్ల నుంచి పోటీచేస్తున్న గొర్లె కిరణ్‌ను గొప్ప మెజార్టీతో ఆశీర్వదించాలని కోరారు. 

2014లో ‘చంద్రముఖి’ మోసాలివీ..
► రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? 
► పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రూ.14,205 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా?
► ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు చొప్పున బ్యాంకులో డిపాజిట్‌ చేస్తామన్నాడు. ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్‌ చేశారా?
► ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లలో అంటే 60 నెలల పాటు నెలకు రూ.రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు ఇచ్చాడా?
► అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తామన్నారు. ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా?
► రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ అన్నాడు. చేనేత, పవర్‌లూమ్స్‌ రుణాలు మాఫీ అన్నాడు. మరి అయ్యాయా?
► మహిళా ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మరి చేశాడా? 
►  సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. చేశాడా? 
► ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తామ­న్నాడు. మరి నిర్మించాడా? విజయనగరంలో ఏమైనా కనిపిస్తోందా? 
► పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా అంటే అదీ లేదు.
► ఇప్పుడు సూపర్‌ సిక్స్, సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కార్‌ అంటూ మళ్లీ మోసాలకు తయారయ్యారు.  

Advertisement
Advertisement