D Y Chandrachud: మాట వినే లక్షణమేదీ? | Sakshi
Sakshi News home page

D Y Chandrachud: మాట వినే లక్షణమేదీ?

Published Sun, Dec 10 2023 6:15 AM

Symbiosis university: Break down echo chambers, reach newer understanding of world - Sakshi

ముంబై: నేటి సమాజంలో ఇతరులు చెప్పేది వినే లక్షణం లోపిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ఆవేదన వెలిబుచ్చారు. ఎవరికి వారు తమ వైఖరే గొప్ప అనుకుంటూ ఒక చట్రానికి పరిమితమై బతుకుతున్నారన్నారు. ‘‘ఈ ధోరణిని బద్దలు కొట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఇతరులు చెప్పేది వినడం గొప్ప కళ. దాని ద్వారా అవగాహన పరిధి ఎంతగానో పెరుగుతుంది. ప్రపంచాన్ని సరికొత్తగా అర్థం చేసుకోగలం’’అని హితవు పలికారు.

శనివారం ఆయన పుణెలోని సింబయాసిస్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. వ్యక్తిగత వృత్తిగత జీవితంలో ఆగ్రహావేశాలు, హింస, ఇతరులను అగౌరవపరడం వంటివాటితో నష్టాలే తప్ప సాధించేదేమీ ఉండదని విద్యార్థులు అర్థం చేసుకోవాలన్నారు. వినయ విధేయతలు, ధైర్యం, సమగ్రతలే ఆయుధంగా ముందుకు సాగాలని హితవు పలికారు. నేటి యువత ప్రశ్నించేందుకు అస్సలు వెనకాడకపోవడం మంచి పరిణామమన్నారు. సమాజంలో విభజనవాదం నానాటికీ పెరిగిపోతోందని ముంబైలో జమునాలాల్‌ బజాజ్‌ అవార్డుల ప్రదానోత్సవంలో సీజేఐ ఆందోళన వెలిబుచ్చారు. ‘‘సోషల్‌ మీడియాలో కన్పిస్తున్న ధోరణులు, అసహనం దీనికి సంకేతాలే. భారత్‌ కూడా ఇందుకు అతీతం కాదు’’ అని అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement