NCP Internal Clash Ajit Pawar, Sharad Pawar Cryptic Comments - Sakshi
Sakshi News home page

మాటల్లో మార్పు.. వెన్నుపోటుకి అజిత్‌ పవార్‌ రెడీనా?

Published Fri, Apr 28 2023 9:14 AM

NCP Internal Clash Ajit Pawar Sharad Pawar Cryptic Comments - Sakshi

పుణే: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(NCP) నేత, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయంలో ఆసక్తికర చర్చకు దారితీశాయి. బాల్‌ థాక్రే విషయంలో  రాజ్‌ థాక్రే ఎలాంటి దృష్టి పెట్టాడో.. తానూ తన బాబాయ్‌ శరద్‌ పవార్‌ విషయంలో అలాంటి దృష్టే సారిస్తానంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల సంగతి పక్కనపెట్టినా.. బాబాయ్‌, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌-అబ్బాయి అజిత్‌ పవార్‌ల మధ్య అగాధం తారాస్థాయికి చేరుకుంటోందని వాళ్ల మాటల్లో మార్పుని బట్టి తెలుస్తోంది!.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ సతీమణి అమృత, ఎన్సీపీ ఎంపీ అమోల్‌ ఖోల్హే,  ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ థాక్రేలు తాజాగా ఒక వేదికపై చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. అయితే ఆ ఇంటర్వ్యూలో రాజ్‌ థాక్రే మాట్లాడుతూ.. అజిత్‌ పవార్‌ బయట ఎలాగైతే తన బాబాయ్‌(శరద్‌ పవార్‌)ను గౌరవిస్తాడో, పార్టీలో అంతర్గతంగానూ అలాగే గౌరవించాలని సలహా ఇచ్చాడు. అయితే ఆ సలహాపై మీడియా అజిత్‌ పవార్‌ను స్పందించాలని కోరింది. దానికి ఆయన అంతే తేడాగా స్పందించారు. 

రాజ్‌ థాక్రే ఇచ్చిన సలహా గురించి తెలిసింది. తన పెద్దనాన్న అయిన బాల్‌ థాక్రే విషయంలో రాజ్‌ థాక్రే ఎలాంటి వైఖరి అవలంభించారో, ఎంతగా దృష్టిసారించారో.. తాను తన బాబాయ్‌ శరద్‌ పవార్‌ విషయంలో అలాంటి దృష్టిసారిస్తానంటూ వ్యాఖ్యానించారు. 

బాల్‌ థాక్రే చిన్న సోదరుడు శ్రీకాంత్‌ థాక్రే తనయుడు రాజ్‌ థాక్రే. అయితే.. తన పెదనాన్నతో విబేధాలు రావడంతో.. 2006లో శివసేన నుంచి బయటకు వచ్చేసి మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన పార్టీని నెలకొల్పారు రాజ్‌థాక్రే. 

అజిత్‌ పవార్‌, రాజ్‌ థాక్రే వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూనే.. తన మనసులోని మాట బయటపెట్టారా?. ఎన్సీపీలో తనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు, కీలక నేతలతో అజిత్‌ పవార్‌ బయటకు వస్తారని, బీజేపీతో కలిసి జట్టు కడతాడంటూ గత కొంతకాలంగా మహా రాజకీయాల్లో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఒకవేళ అదే గనుక జరిగితే.. తాము ప్రభుత్వ కూటమి నుంచి వైదొలుగుతామంటూ బీజేపీకి అల్టిమేటం జారీ చేసింది షిండే శివసేన వర్గం. కానీ, తాను జీవితాంతం ఎన్సీపీ, బాబాయ్‌ శరద్‌ పవార్‌ వెంటనే నడుస్తానని ఆ ప్రచారాన్ని అజిత్‌ పవార్‌ ఖండించారు. అయినప్పటికీ మహారాష్ట్ర రాజీకీయాల్లో రాబోయే రోజుల్లో రాజకీయ కుదుపు ఉండొచ్చని, అజిత్‌ పవార్‌ వెన్నుపోటు అస్త్రం ప్రయోగించొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  

పవార్‌ రోటీ వ్యాఖ్యల దుమారం
అజిత్‌ పవార్‌ తర్వాత రాజకీయ అడుగుల గురించి చర్చ నడుస్తున్న వేళ.. ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. పార్టీ యూత్‌ వింగ్‌ సమావేశంలో పాల్గొన్న శరద్‌ పవార్‌ మాట్లాడుతూ.. రోటీలను సమాయానికి పెనం మీద తిప్పి వేయాలి. లేకుంటే అవి తినడానికి పనికి రాకుండా పోతాయని నాకు కొందరు చెప్పారు. అలాగే పార్టీలో కూడా సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాం అని వ్యాఖ్యానించారు. 

దీంతో.. బీజేపీకి మళ్లీ అజిత్‌ పవార్‌ చేరువవుతున్న కమ్రంలో ఎన్సీపీని నుంచి ఆయన్ని దూరం చేయాలని శరద్‌ పవార్‌ భావిస్తున్నారా? అనే చర్చ జోరందుకుంది. అయితే ఈ రోటీ వ్యాఖ్యలపైనా అజిత్‌ పవార్‌ స్పందించారు. 

పవార్‌ సాబ్‌ తన 55, 60 ఏళ్ల కెరీర్‌లో ఎన్నోసార్లు పార్టీని పునరుద్ధరించారు. ఎన్నో కొత్త ముఖాలు పార్టీలోకి వచ​ఆచయి. మరెందరికో ప్రమోషన్లు లభించాయి. నాతో పాటు ఆర్‌ఆర్‌ పాటిల్‌, దిలీప్‌ వాల్‌సే పాటిల్‌, చగ్గన్‌ భుజ్‌బల్‌, సునీల్‌ తాట్కరే.. లాంటి నేతలం అలా పైకి వచ్చినవాళ్లమే. మీ వృత్తిలో కూడా రాణిస్తే ప్రమోషన్లు, ఉన్నత పదవులు ఇస్తారు కదా అని అజిత్‌ పవార్‌ మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

అలాగే.. ఎన్సీపీలోనూ కొత్త వాళ్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రావడం సాధారణం. అదే సమయంలో పాత ముఖాలను పక్కనపెట్టడమూ సాధారణమే అని వ్యాఖ్యానించారాయన. 

షిండే వర్గం స్పందన.. 
అయితే.. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం ‘పవార్‌ రోటీ’ కామెంట్లపై స్పందించింది. అజిత్‌ పవార్‌ను పక్కనపెట్టే క్రమంలోనే శరద్‌ పవార్‌ ఆ వ్యాఖ్యలు చేశాడన్నది స్పష్టంగా తెలుస్తోందని వ్యాఖ్యానించింది.

ఇదీ చదవండి: మోదీపై ఖర్గే వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం

Advertisement
 
Advertisement
 
Advertisement