రామేశ్వరం కేఫ్‌ బ్లాస్ట్‌ కేసులో కీలకంగా AI | Sakshi
Sakshi News home page

రామేశ్వరం కేఫ్‌ బ్లాస్ట్‌ కేసులో కీలకంగా ఏఐ! మాస్క్‌ తొలగించి..

Published Sat, Mar 2 2024 4:47 PM

Bengaluru Rameshwaram Cafe blast: How AI Play Crucial Role - Sakshi

బెంగళూరు: రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) తన పరిశీలనాంతరం ఇది ఉగ్రదాడిగా భావిస్తుండగా.. నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ సైతం పేలుడు ఘటనాస్థలాన్ని పరిశీలించింది. తాజాగా ఈ కేసు దర్యాప్తు కోసం సిటీ క్రైమ్‌ బ్రాంచ్‌ రంగంలోకి దిగింది.  ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీనే ఈ కేసు మొత్తానికి కీలకంగా మారింది. 

బాంబ్‌ పేలుడు ఘటనకు సంబంధించి.. ప్రధాన అనుమానితుడి ఫుటేజీ ఒకటి బయటకు వచ్చింది. ఆ నిందితుడి కదలికలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఐఈడీ(Intensive Explosive Device)ను బ్యాగ్‌లో తీసుకెళ్లిన ఆ వ్యక్తి.. ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతన్ని పట్టుకునేందుకు ఎనిమిది బృందాలు రంగంలోకి దిగాయి. అయితే.. 

ముసుగు తొలగించి..
ఇందుకోసం భద్రతా సంస్థలు ఏఐ(Artificial Intelligence) సాయం తీసుకుంటున్నాయి.  ఏఐ ఆధారిత ఫేషీయల్‌ రికగ్నిషన్‌ సాంకేతిక సాయంతో.. బ్యాగ్‌ను వదిలి వెళ్లిన వ్యక్తి ఆచూకీ కనిపెట్టబోతున్నారు. అనుమానితుడెవరో తెలిసిపోయిందని.. ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్స్‌ను ఉపయోగించి ఆ వ్యక్తిని వీలైనంత త్వరలోనే పట్టుకుంటామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ చెబుతున్నారు. మరోవైపు ఏఐ టెక్నాలజీ సాయంతో అతని ముఖానికి ఉన్న ముసుగును తొలగించారు. అతని ఫొటోల్ని సేకరించుకుని ఆచూకీ కనిపెట్టే పనిలో ఉంది బెంగళూరు నగర నేర పరిశోధన విభాగం.  

బెంగుళూరులో.. అదీ టెక్నాలజీ కారిడార్‌లోనే ఈ పేలుడు జరగడం ఆందోళనలను రేకెత్తిస్తోంది. భద్రతాపరంగా మరింత నిఘా, చర్యలు పెంచాల్సిన అవసరాన్ని ఈ పేలుడు ఘటన తెలియజేస్తోందని నిపుణలు అంటున్నారు. అలాగే.. అనుమానిత వ్యక్తులను పట్టుకునేందుకు AI లాంటి అత్యాధునిక సాంకేతికతను అధికారికంగా వినియోగించడం ఎంత అవసరమో కూడా చెబుతోందంటున్నారు. 

రెండేళ్ల కిందటి.. 
రామేశ్వరం కేఫ్‌ పేలుడు ఘటనలో..  మొత్తం 10 మంది గాయపడ్డారు. అయితే అదృష్టవశాత్తూ అందరూ ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. 2022 నవంబర్‌లో మంగళూరులో ఇదే తరహాలో కుక్కర్‌ బాంబు పేలింది. దీంతో.. ఈ రెండు ఘటనల మధ్య ఏదైనా సంబంధం ఉందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  ఈ క్రమంలో.. బృందం ధార్వాడ్‌, హుబ్లీ, బెంగళూరుకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

 విచారణకు పూర్తి సహకారం: కేఫ్‌ యాజమాన్యం
తమ ప్రాంగణంలో బాంబు దాడి జరగడంపై రామేశ్వరం కేఫ్‌ యాజమాన్యం స్పందించింది. విచారణలో దర్యాప్తు సంస్థలకు పూర్తి సహాకారం అందిస్తామని.. అలాగే పేలుడులో గాయపడిన వాళ్లకు తాము అండగా నిలుస్తామని కేఫ్‌ ఎండీ దివ్య రాఘవేంద్ర రావు ప్రకటించారు. 

ఏం జరిగిందంటే.. 
శుక్రవారం ఉదయం.. బ్రూక్‌ఫీల్డ్‌ ఐటీపీఎల్‌ రోడ్‌లో ఉన్న రామేశ్వరం కేఫ్‌. నెత్తిన క్యాప్‌.. ముఖానికి ముసుగు.. భుజాన బ్యాగ్‌తో ఆ ఆగంతకుడు కేఫ్‌కు వచ్చాడు. అతని వయసు 25-30 ఏళ్ల మధ్య ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 11గం.30.ని. ప్రాంతంలో బస్సు దిగి నేరుగా కేఫ్‌లోకి వెళ్లిన ఆ వ్యక్తి ఇడ్లీ ఆర్డర్‌ చేశాడు. పావు గంట తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఈ మధ్యలో తన భుజానికి ఉన్న బ్యాగ్‌ను కేఫ్‌లోని సింక్‌ వద్ద  ఉన్న డస్ట్‌బిన్‌ పక్కన పెట్టి వెళ్లిపోయాడు. సరిగ్గా అతను వెళ్లిపోయిన గంటకు ఆ బ్యాగ్‌లో ఉన్న ఆ బాంబు పేలింది. 

ఫొటోలు వచ్చాయి: సీఎం సిద్ధరామయ్య
ఈ ఘటనలో నిందితుడు ప్రెజర్ కుక్కర్‌ బాంబు వాడాడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. మాస్క్, క్యాప్‌ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్‌కు వచ్చాడు. రవ్వఇడ్లీని ఆర్డర్ చేసుకొని ఒక దగ్గర కూర్చున్నాడు. తర్వాత బాంబుకు టైమర్ సెట్‌ చేసి, వెళ్లిపోయాడు. అతడు ఎవరో తెలీదు.  ఫొటోలు వచ్చాయి. సాధ్యమైనంత త్వరగా నిందితుడిని అదుపులోకి తీసుకుంటాం అని అన్నారాయన. 

అలాగే.. రామేశ్వరం కేఫ్‌ పేలుడు ఘటనపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు.‘‘ఈ విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తోంది. వారి హయాంలో కూడా బాంబు పేలుళ్లు జరిగాయి. అప్పుడు వారు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డారా..? నేను ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనిపై రాజకీయాలు చేయకూడదు’’ అని అన్నారు. అలాగే ఘటనాస్థలానికి వెళ్లిన సీఎం సిద్ధరామయ్య.. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రుల్ని పరామర్శించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారాయన. 

Advertisement
Advertisement