మొదటిసారిగా అంతరిక్షంలోకి పౌర వ్యోమగామిని పంపిన చైనా  | Sakshi
Sakshi News home page

మొదటిసారిగా అంతరిక్షంలోకి పౌర వ్యోమగామిని పంపిన చైనా 

Published Wed, May 31 2023 3:26 AM

China was the first to send a civilian astronaut into space - Sakshi

బీజింగ్‌/జియుక్వాన్‌: చైనా మంగళవారం మొదటిసారిగా ఒక పౌర వ్యోమగామి సహా ముగ్గురు వ్యోమగాములను సొంత అంతరిక్ష కేంద్రం టియాంగాంగ్‌కు పంపించింది. జియుక్వాన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాములతో కూడిన షెంజౌ–16ను లాంగ్‌ మార్చ్‌–2ఎఫ్‌ రాకెట్‌ అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. పది నిమిషాల తర్వాత రాకెట్‌ నుంచి విడిపోయిన షెంజౌ–16 నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించిందని చైనా మానవసహిత అంతరిక్ష సంస్థ(సీఎంఎస్‌ఏ) తెలిపింది.

ఈ మిషన్‌ పూర్తిగా విజయవంతంగా పూర్తయిందని పేర్కొంది. ‘షెంజౌ–16 అనంతరం టియాంగాంగ్‌ కోర్‌ మాడ్యూల్‌తో అనుసంధానమైంది. షెంజౌ–16లోని ముగ్గురు వ్యోమగాములు కోర్‌మాడ్యూల్‌ తియాన్హెలో ఉన్న ఇప్పటికే ఉన్న ముగ్గురు వ్యోమగాములను కలుసుకున్నారు. ఆ ముగ్గురు త్వరలోనే భూమికి తిరిగి వస్తారు’అని తెలిపింది.

మంగళవారం పంపిన ముగ్గురిలో ఒకరు పేలోడ్‌ స్పెషలిస్ట్‌గా పేరున్న గుయి హయిచావో. ఈయన బీజింగ్‌లోని బీయిహంగ్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. మిగతా ఇద్దరు పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మికి చెందిన వారు. 2030కల్లా చంద్రునిపైకి మనుషులను పంపే మానవ సహిత యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎంఎస్‌ఏ సోమవారం ప్రకటించింది.   

Advertisement
Advertisement