No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, Jan 13 2024 5:58 AM

-

మొయినాబాద్‌: మండల పరిధిలోని బాకారం శివారు డ్రీమ్‌ వ్యాలీ రోడ్డు పక్కన ఈ నెల 8న కాలుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలు ఆర్పారు. అప్పటికే మృతదేహం గుర్తు పట్టలేనంతగా కాలిపోయింది. దీంతో క్లూస్‌టీం, డాగ్‌స్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.

ఆరు బృందాలుతో దర్యాప్తు...

రాజేంద్రనగర్‌ అడిషనల్‌ డీసీపీ రేష్మి పెరుమాళ్‌, చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, మొయినాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ పవన్‌కుమార్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సమీపంలోని రైతులతో మాట్లాడినా వారికి ఎలాంటి క్లూస్‌ లభించలేదు. దీంతో రాజేంద్రనగర్‌ సీసీఎస్‌, మొయినాబాద్‌, శివరాంపల్లి, మైలార్‌దేవ్‌పల్లి పీఎస్‌ల నుంచి ఆరు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

సీసీ పుటేజీ ఆధారంగా

ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం 1:43 గంటలకు టీఎస్‌ 13 యూసీ 1565 నంబరు ఆటో ఎనికేపల్లి నుంచి బాకారం వైపు వెళ్లి తిరిగి వచ్చినట్లు, సోలార్‌ విల్లాస్‌ వద్ద ఉన్న సీసీ ఫుటేజీల్లో పోలీసులు గుర్తించారు. అదే ఆటో వెంటనే డ్రీమ్‌వ్యాలీ రిసార్ట్స్‌ గేటు ముందు నుంచి యూటర్న్‌ తీసుకుని వెళ్లినట్లు సీసీ ఫుటేజీల్లో గుర్తించారు. ఆటో నంబర్‌ ఆధారంగా మెహిదీపట్నంలో ఆటో డ్రైవర్‌ సయ్యద్‌ వాసిమ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

పథకం ప్రకారమే..

నగరంలోని మల్లేపల్లికి చెందిన తహసీన్‌ బేగం (22) ఈ నెల 8న ఉదయం 11.30 గంటలకు మొయినాబాద్‌లోని డ్రీమ్‌వ్యాలీ రిస్టార్ట్‌కు వెళ్లేందుకు.. మల్లేపల్లిలో రూ.1,100కు సయ్యద్‌ వాసిమ్‌ ఆటోను మాట్లాడుకుంది. ఆటో ఎక్కి మురాద్‌నగర్‌లోని తన స్నేహితురాలు రాహిల్‌ ఇంటికి వెళ్లింది. మధ్యాహ్నం 12.10 గంటలకు మరో స్నేహితురాలు ఇంటికి వెళ్లి.. అంతకు ముందురోజే అక్కడ తెచ్చిపెట్టుకున్న 5 లీటర్ల పెట్రోల్‌ డబ్బాను ఓ బ్యాగులో పట్టుకుని ఆటో ఎక్కింది. మధ్యాహ్నం 1.43 గంటలకు రిసార్ట్‌ గేటు వద్దకు వెళ్లగానే.. యూటర్న్‌ తీసుకోవాలని చెప్పి.. కొద్ది దూరం వెళ్లగానే ఆటో దిగి డ్రైవర్‌కు డబ్బులిచ్చి పంపించింది. మధ్యాహ్నం 1.53 నిమిషాలకు రాహిల్‌కు ఫోన్‌ చేసి మాట్లాడి ఆ తర్వాత స్విచ్ఛాఫ్‌ చేసింది. అనంతరం డబ్బాలో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది.

విషయం తెలిసిందిలా..

ఘటనా స్థలంలో సగం కాలిన స్థితిలో దొరికిన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తహసీన్‌ చివరి కాల్‌ రాహిల్‌తో మాట్లాడినట్లు గుర్తించారు. ఆమెను విచారించగా విషయాలన్నీ బయటపడ్డాయి. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని రాజేంద్రనగర్‌ అడిషనల్‌ డీసీపీ రేష్మి పెరుమాళ్‌, చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి అభినందించారు.

ఆత్మహత్యకు కారణమిదే..

మృతురాలు తహసీన్‌ బేగం మెహిదీపట్నంలోని మదీనా కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఈ సమయంలో స్నేహితురాలు రాహిల్‌తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఇది ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. విషయం ఇంట్లో తెలియడంతో ఇరు కుటుంబాల వారు మందలించి ఇరువురినీ దూరం చేశారు. స్నేహితురాలి ఎడబాటును తట్టుకోలేని తహసీన్‌ ఆరు నెలల క్రితం బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇటీవల రాహిల్‌కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆత్మహత్యకు ఒకరోజు ముందే పెట్రోల్‌ తీసుకుని తన స్నేహితురాలు గదిలో పెట్టింది. ఎందుకని అడగగా బంకులు బంద్‌ చేస్తున్నారని, బండిలో పోసుకునేందుకని నమ్మించింది.

Advertisement
Advertisement