‘శాంతి లైఫ్‌’ ఎన్నో గ్రామాల ముఖచిత్రాన్ని మార్చింది! | Sakshi
Sakshi News home page

Canadian Charity Shanti Life: ‘శాంతి లైఫ్‌’ ఎన్నో గ్రామాల ముఖచిత్రాన్ని మార్చింది!

Published Tue, Aug 29 2023 9:20 AM

Sheetal Is Founder Of Canadian Charity Shanti Life - Sakshi

‘ఎవరైనా సరే నిద్రలేస్తూనే నేను ఉద్యోగం కోసం ఎదురు చూడడం లేదు. పదిమందికి ఉపాధి కల్పించడం కోసం ఎదురుచూస్తున్నాను’ అనుకోవాలి. ‘ఆశాపూరిత ప్రపంచాన్ని ఊహించుకున్నప్పుడే, దాన్ని నిజంగా సృష్టించగలం. నీ మార్గం ఏమిటి అనే విషయంలో స్పష్టత ఉంటేనే అక్కడికి చేరుకుంటావు. అలా చేరుకోవడానికి నీలోని ఉత్సాహం, అంకితభావం ఇంధనంలా ఉపయోగపడతాయి’...‘మైక్రోఫైనాన్స్‌ దారిదీపం’గా ప్రసిద్ధుడైన మహ్మద్‌ యూనస్‌ చెప్పిన ఇలాంటి మాటలెన్నో శాన్‌ఫ్రాన్సిస్కోలోని షీతల్‌ మెహతా వాల్ష్‌కు ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను యూనస్‌ బాటలో నడిపించి ‘శాంతి లైఫ్‌’కు శ్రీకారం చుట్టేలా చేసింది. సూక్ష్మారుణ సంస్థగా మొదలైన ‘శాంతి లైఫ్‌’ ఎన్నో గ్రామాల ముఖచిత్రాన్ని మార్చింది.. 

శాంతి లైఫ్‌ కెనడాలో పెరిగిన షీతల్‌ అక్కడి గుజరాతీ అసోసియేషన్‌లో భాగం కావడంతో ఎన్నోకుటుంబాలతో పరిచయం ఏర్పడింది. కమ్యూనిటీ లైఫ్‌లో భాగం కావడం ద్వారా పాశ్చాత్యజీవన విధానానికి భిన్నమైన భారతీయ జీవన విధానాన్ని చూసింది. ఎన్నో విలువలు నేర్చుకుంది. వెంచర్‌–క్యాపిటల్‌ ఫండింగ్‌ సెక్ట్చ్డర్‌లో రెండు దశాబ్దాల అనుభవాన్ని సంపాదించిన షీతల్‌ బంగ్లాదేశ్‌ సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ మహ్మద్‌ యూనస్‌ స్ఫూర్తితో అహ్మదాబాద్‌ కేంద్రంగా ‘శాంతి లైఫ్‌’ అనే సూక్ష్మారుణ సంస్థను ప్రారంభించింది. ఇది పేద మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది.

గతంలో ఎలా ఉండేదంటే...
పేద మహిళలకు రుణాలు లభించడం కష్టం. ఒకవేళ లభించినా బారెడు వడ్డీ కట్టలేక అష్టకష్టాలు పడేవాళ్లు. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ వడ్డీతో ‘శాంతి లైఫ్‌’ రుణాలు ఇవ్వడం మొదలు పెట్టింది. ఎన్నో గ్రామాల్లో ఎంతోమంది మహిళలు రుణాలు తీసుకొని వ్యాపారాలు చేస్తూ సొంతకాళ్ల మీద నిలబడ్డారు. కేవలం రుణాలు ఇవ్వడమే కాకుండా గ్రామీణప్రాంత మహిళలకు స్కిల్స్‌ ట్రైనింగ్, ఫైనాన్షియల్‌ లిటరసీ... మొదలైన వాటిలో శిక్షణ ఇస్తోంది శాంతి లైఫ్‌. క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారా అక్కడి పరిస్థితులపై స్పష్టమైన అవగాహన రావడానికి షీతల్‌కు అవకాశం ఏర్పడింది. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాటిని దూరం చేయాలంటే ఏంచేయాలి... మొదలైన విషయాలను తెలుసుకుంది షీతల్‌. ‘శాంతి లైఫ్‌’ ఎన్నో గ్రామాలను దత్తత తీసుకుంది.

పారిశుద్ధ్య లోపం వల్ల గ్రామీణ ప్రాంతాలలో మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘సేఫ్‌ శానిటేషన్‌’ నినాదంతో గ్రామీణప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ అవగాహనతో వారు డబ్బు పొదుపు చేసి మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. ‘రుణం తీసుకోవడం అనేది ఆర్థిక వ్యవహారమే కాదు. ఒక బాధ్యతను నిరంతరం గుర్తు చేస్తుంది. శాంతి లైఫ్‌ ద్వారా రుణం తీసుకున్న ఒక మహిళ రిక్షా కొనుగోలు చేసింది. ఈ రిక్షాను ఆమె భర్త నడిపేవాడు. గతంలో అతడి ప్రవర్తన ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం క్రమశిక్షణతో నడుచుకుంటున్నాడు.

ఏరోజు డబ్బును ఆరోజే భార్యకు ఇస్తుంటాడు. భార్య పేరు మీద లోన్‌ ఉంది కాబట్టి ఆమెకు చెడ్డ పేరు రావద్దని అనుకునేవాడు భర్త. ఇలాంటి భర్తలు ఎందరో! రుణసహాయం మాత్రమే కాదు క్రమశిక్షణ పాదుకొల్పడంలో ‘శాంతి లైఫ్‌’  తనదైన పాత్ర నిర్వహిస్తోంది. గ్రామీణ వృత్తికళాకారులు తయారు చేసిన యోగా బ్యాగులు, చీరెలు, దుప్పట్లను ఆన్‌లైన్‌ ద్వారా అమ్మడం మొదలుపెట్టింది. ‘ప్రతి ఒక్కరికీ తమదైన నైపుణ్యం ఉంటుంది. అది ఇతరుల కంటే ఏ రకంగా భిన్నమైనది, ఆ నైపుణ్యం సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది ఆలోచించాలి.

నైపుణ్యాలను ఉపయోగించి క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారానే పేదరికాన్ని దూరం చేయవచ్చు’ అంటుంది షీతల్‌. లాభాలు గడించాలనే దృష్టితో కాకుండా సమాజానికి తిరిగి ఇవ్వాలి అనే అవహగానతో ‘శాంతి లైఫ్‌’కు శ్రీకారం చుట్టింది షీతల్‌. సామాజిక నిబద్ధతతో మొదలైన ‘శాంతి లైఫ్‌’ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుందా అని ప్రశ్నించుకుంటే ‘అంతకంటే ఎక్కువే’ అని జవాబు చెప్పుకోవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫైనాన్స్, టెక్నాలజీలకు సంబంధించి నైపుణ్యాల శిక్షణ ద్వారా గుజరాత్‌లోని ఎన్నోగ్రామాల ముఖచిత్రాన్ని‘శాంతి లైఫ్‌’ మార్చింది.    

(చదవండి:  తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిం‍దే! హైకోర్టు జస్టిస్‌ ఆదేశం! )
  

Advertisement
Advertisement