Bhargavi Swami Is The Author Of P For Podcast - Sakshi
Sakshi News home page

పీ ఫర్‌ పాడ్‌కాస్ట్‌.. బీ ఫర్‌ భార్గవి

Published Wed, Jun 28 2023 9:57 AM

Bhargavi Is The Author Of P For Podcast  - Sakshi

లాక్‌డౌన్‌ లైఫ్‌స్టైల్లో మెరిసిన ఒక ట్రెండ్‌.... పాడ్‌కాస్ట్‌. ‘పాడ్‌కాస్ట్‌’ పాపులారిటీ గురించి వినడమేగానీ దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడానికి, సక్సెస్‌ఫుల్‌ పాడ్‌కాస్టర్‌గా రాణించాలనుకునే వారికి సాధికారికమైన సమాచారం కరువైంది. ఈ లోటును పూరించడానికి మంచి పుస్తకాన్ని తీసుకువచ్చి ఔత్సాహికులకు మేలు చేసింది భార్గవి.. లీడింగ్‌ హెచ్‌ఆర్‌ కన్సల్టింగ్‌ కంపెనీ ‘ఎక్సెల్‌ కార్పోరేషన్‌’కు సీయీవోగా ఉన్న బెంగళూరుకు చెందిన భార్గవి స్వామి మన దేశంలోని లీడింగ్‌ పాడ్‌కాస్టర్‌లలో ఒకరు. కంటెంట్‌ ప్రొడ్యూసర్‌గా కూడా తన సత్తా చాటుతుంది. మన దేశంలో పాడ్‌కాస్ట్‌పై వచ్చిన తొలిపుస్తకం ‘పీ ఫర్‌ పాడ్‌కాస్ట్‌’ రచయిత్రిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

తన అనుభవాలను క్రోడీకరించి ఫస్ట్‌–పర్సన్‌లో రాసిన ఈ పుస్తకం పాడ్‌కాస్ట్‌ గురించి ప్రాథమిక విషయాలను తెలుసుకోవాలనుకునేవారికి దిక్సూచిలా నిలిచింది. ‘ఆర్ట్‌ ఆఫ్‌ పాడ్‌కాస్టింగ్‌’ను అక్షరాల్లోకి తెచ్చింది. బిజినెస్‌ పాడ్‌కాస్ట్‌ షో ‘పీపుల్‌ హూ మ్యాటర్‌’తో సక్సెస్‌ఫుల్‌ పాడ్‌కాస్టర్‌గా పేరు తెచ్చుకుంది భార్గవి. పాడ్‌కాస్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టే ముందు దాని లోతుపాతులు ఏమిటో తెలుసుకోవడానికి చిన్నపాటి రీసెర్చ్‌ లాంటిది చేసింది. అయితే పాడ్‌కాస్టర్‌గా తొలి అడుగులు వేయడానికి అవసరమైన సమాచారం దొరకడం గగనం అయింది. ‘జీరో ఇన్‌ఫర్‌మేషన్‌’ అనేది వెక్కిరిస్తున్నా తన పరిశోధనలో ఎక్కడా తగ్గింది లేదు. మాస్‌కమ్యూనికేషన్‌లో మాస్టర్స్‌ చేసిన భార్గవి తనదైన పద్ధతిలో పరిశోధన చేస్తూ సమాచారాన్ని సంపాదించింది.

‘తెలుసుకోవడానికి ఇన్ని విషయాలు ఉన్నాయా!’ అనిపించింది. తాను సక్సెస్‌ఫుల్‌ పాడ్‌కాస్టర్‌గా రాణించడానికి అవి మంచి మార్గాన్ని చూపాయి. తన సక్సెస్‌తోనే ఆగిపోకుండా పాడ్‌కాస్టింగ్‌లో సక్సెస్‌ కావాలనుకునేవారి కోసం ‘పీ ఫర్‌ పాడ్‌కాస్టింగ్‌’ అనే పుస్తకం రాసింది. వెబ్‌సీరీస్‌ల కోసం స్క్రిప్ట్‌ రాసినప్పుడు ఫస్ట్‌ డ్రాఫ్ట్‌లోనే ఓకే అయిపోయేది. ‘పీ ఫర్‌ పాడ్‌కాస్టింగ్‌’ విషయంలో మాత్రం పలుసార్లు పుస్తకాన్ని తిరగరాసింది. ఏదో ఒక విషయాన్ని కొత్తగా చేరుస్తూ వచ్చింది. ఈ పుస్తకానికి భార్గవి తల్లి ఎడిటర్‌లా వ్యవహరించింది. సూచనలు ఇచ్చింది. తల్లితో కలిసి ఈ ప్రాజెక్ట్‌ మీద పనిచేయడం భార్గవికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.

‘పుస్తకాలు ఎక్కువగా చదవడం వల్ల రచనల ద్వారా ఒక విషయాన్ని సులభంగా కమ్యూనికేట్‌ చేయగలిగే విద్య పట్టుబడింది. నాలోని భావాలను ఆవిష్కరించడానికి రచనలను ఒక మాధ్యమంలా చేసుకుంటాను. అయితే పీ ఫర్‌ పాడ్‌కాస్ట్‌ అనేది నాలోని భావాల ఆవిష్కరణకు మాత్రమే పరిమితమైపోలేదు. ఎంతోమందికి దారి చూపించింది’ అంటుంది భార్గవి. అరవింద్‌ అడిగ, కిరణ్‌ దేశాయ్, అశ్విని సంఘీ.. మొదలైన వారి రచనలపై ఆసక్తి చూపించే భార్గవి  కార్పొరేట్‌ దిగ్గజాల ఆలోచనలను, లీడర్‌షిప్, కోచింగ్‌లకు సంబంధించి పుస్తకాలను ఇష్టపడుతుంది. సంతోషం వెనక ఉండే శాస్త్రీయతను తెలుసుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తుంది. ‘పాడ్‌కాస్టర్‌గా నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మరింతగా ప్రయత్నిస్తున్నాను’ అంటున్న భార్గవి స్వామి వెబ్‌సీరీస్‌ కోసం స్క్రిప్ట్‌లు రాయడానికి, ఒక యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ గురించి ఫిక్షన్‌ బుక్‌ రాయడానికి సన్నాహాలు చేస్తోంది.

సక్సెస్‌ మంత్ర
లాక్‌డౌన్‌ లైఫ్‌స్టైల్‌ వల్ల రీడింగ్, రైటింగ్‌ అనేవి మనకు బాగా చేరువయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పాడ్‌కాస్ట్‌ సెగ్మెంట్‌ దూసుకుపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాడ్‌కాస్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టాను. ‘పాడ్‌కాస్టర్‌గా సక్సెస్‌ కావాలి’ అనుకోగానే సరిపోదు. అందుకు తగిన కసరత్తులు చేయాలి. మనదైన ప్రత్యేకత కోసం ప్రయత్నించాలి. స్కూల్‌రోజుల్లో నేను చదువుల్లో ముందు ఉండడంతో పాటు పాటలు పాడేదాన్ని. నృత్యాలు చేసేదాన్ని. ఉపన్యాస పోటీల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. అయితే ఇవేమీ స్కూలు దగ్గరే ఆగిపోలేదు. సృజనాత్మక విషయాలలో నాకు నిరంతరం తోడుగా నిలుస్తున్నాయి. 

‘మీ సక్సెస్‌ మంత్ర ఏమిటి?’ అని చాలామంది నన్ను అడుగుతుంటారు. సక్సెస్‌కు షార్ట్‌కట్‌లు ఉండవు. మనల్ని సక్సెస్‌ఫుల్‌గా మార్చడానికి గాడ్‌ఫాదర్‌లు ఉండరు. వృత్తిపై మనం చూపే ఆసక్తి, పడే కష్టం, మన పరిచయాలు విజయపథంలో దూసుకుపోవడానికి కారణం అవుతాయి. సక్సెస్‌ కోసం ఒకరిని అనుసరించాలనే రూల్‌ ఏమీలేదు. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమిటో కనుక్కుంటే చాలు.
– భార్గవి స్వామి, స్టార్‌ పాడ్‌కాస్టర్, ఎంటర్‌ప్రెన్యూర్‌ 

(చదవండి: పట్టుదారంతో జీవితాన్ని అల్లుకుంది )

Advertisement
Advertisement