నాలుగు నెలలు కాకుండానే.. మార్కెటింగ్ టీమ్‌ మొత్తానికి మంగళం! | Sakshi
Sakshi News home page

నాలుగు నెలలు కాకుండానే.. మార్కెటింగ్ టీమ్‌ మొత్తానికి మంగళం!

Published Thu, Apr 25 2024 3:20 PM

Tesla slashed Entire US Growth Team Built Just 4 Months Ago - Sakshi

ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన సంస్థ టెస్లా కంపెనీ వ్యాప్త తొలగింపులలో భాగంగా కొత్తగా ఏర్పడిన మార్కెటింగ్ బృందం మొత్తాన్ని తొలగించింది. సాంప్రదాయ ప్రకటనలకు భిన్నంగా కొన్ని నెలల కిందటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలాన్ మస్క్ ఈ టీమ్‌ను ఏర్పాటు చేశారు. 

సీనియర్ మేనేజర్ అలెక్స్ ఇంగ్రామ్ పర్యవేక్షణలో యూఎస్‌లో 40 మంది ఉద్యోగులతో ఏర్పాటు చేసిన "గ్రోత్ కంటెంట్" టీమ్‌ అంతటినీ తొలగించిట్లు తెలిసింది. గ్లోబల్ టీమ్‌కు నాయకత్వం వహించిన ఇంగ్రామ్, జార్జ్ మిల్‌బర్న్‌లను తొలగించినట్లు వారు తెలిపారు. అయితే ఐరోపాలో కంపెనీకి ఇప్పటికీ తక్కువ సంఖ్యలో మార్కెటింగ్ సిబ్బంది ఉన్నట్లు ఒకరు చెప్పారు.

అలాగే కాలిఫోర్నియాలోని హౌథ్రోన్‌లో ఉన్న టెస్లా డిజైన్ స్టూడియో సిబ్బందిలో కూడా గణనీయమైన తొలగింపులు జరినట్లుగా తెలిసింది. కాగా బ్లూమ్‌బెర్గ్ నివేదికకు ఎలాన్‌ మస్క్‌ ప్రతిస్పందిస్తూ కంటెంట్ బృందం పని గురించి ‘ఎక్స్‌’ పోస్ట్‌లో "ప్రకటనలు చాలా సాధారణంగా ఉంటున్నాయి.. ఏదైనా కారుకైనా సరిపోవచ్చు" అంటూ రాసుకొచ్చారు. తొలగింపులకు గురైన గ్రోత్‌ టీమ్‌ను ఇంగ్రామ్ నాలుగు నెలల క్రితం నుంచే నిర్మించడం ప్రారంభించారు.

టెస్లా గ్రోత్ టీమ్‌ తొలగింపు సంస్థలో అతిపెద్ద ఉద్యోగాల కోతను సూచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సిబ్బందిలో 10 శాతం మందిని తొలగించనున్నట్లు ఎలాన్‌ మస్క్‌ గతవారం తెలిపారు. అయితే కంపెనీ సీఈవో 20 శాతం ఉద్యోగులను తొలగింపులకు ఆదేశించినట్లుగా బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. దీని ప్రకారం.. 20,000 మందిపైగా ఉద్యోగులను కంపెనీ తొలగించవచ్చు.

Advertisement
Advertisement