ఆ సింగర్‌ డ్రెస్‌తో గూగుల్‌కు లక్షల కోట్ల ఆదాయం? | Sakshi
Sakshi News home page

ఆ సింగర్‌ డ్రెస్‌తో గూగుల్‌కు లక్షల కోట్ల ఆదాయం?

Published Sun, Dec 17 2023 9:33 AM

Google Images Was Created Because Of Jennifer Lopez - Sakshi

గూగుల్‌.. ఈ పేరు లేకుండా రోజు గడవని కాలమిది! ప్రపంచంలో ఏ మూలనైనా సెర్చ్‌ ఇంజిన్‌, జీమెయిల్‌, గూగుల్‌ ఫొటోస్‌, మ్యాప్స్‌లాంటి వాటి ద్వారా మన జీవితాల్లో గూగులమ్మ భాగమైపోయింది. ఏ సందేహం వచ్చినా గూగులమ్మను అడగటం పరిపాటైంది. అలాంటి గూగులమ్మ సిలికాన్‌ వ్యాలీకి చెందిన ఓ చిన్న గ్యారేజీలో ప్రారంభమై నేడు 200లక్షల కోట్ల కంపెనీగా అవతరించేందుకు అడుగు దూరంలో ఉంది. 50 దేశాల్లో 70 కార్యాలయాల్లో 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

1998లో ప్రారంభమైన గూగుల్‌..ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఆ సంస్థ ఎదిగిన తీరు అనిర్వచనీయం. అలాంటి టెక్‌ దిగ్గజం పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి , ఆర్ధికంగా ఎదిగేందుకు పరోక్షంగా ఓ  సింగర్‌ ధరించిన డ్రెస్సేనంటే మీరు నమ్ముతారా?


ఇద్దరు విద్యార్ధుల ఆలోచనే గూగుల్‌
1995లో అమెరికా స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ చదివే సమయంలో విద్యార్ధులు లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌లు గూగుల్‌కు ప్రాణం పోశారు. కానీ వారి ఆలోచనని ఆచరణలోకి పెట్టేందుకు మూడేళ్లు పట్టింది. సెప్టెంబర్‌ 4, 1998లో దాని (గూగుల్‌) కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మొదట గూగుల్‌ సెర్చిఇంజిన్‌లో స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ విద్యార్ధులకు కావాల్సిన యూనివర్సిటీలు, కాలేజీ  వివరాలు లభ్యమయ్యేవి. ఆ తర్వాత మెల్లగా ఇతర రంగాలకు సంబంధించిన సమాచారాన్ని యూజర్లు పొందే అవకాశాన్ని కల్పించింది.

ఆశించిన స్థాయిలో లేక
రోజులు గడుస్తున్నాయి. గూగుల్‌కు వచ్చే యూజర్లు, పనిచేసే ఉద్యోగులు పెరుగుతూ వస్తున్నారు. కానీ గూగుల్‌ స్థాపించిన లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌లకు మాత్రం వాళ్లు ఆశించిన స్థాయిలో గూగుల్‌కు అనుకున‍్నంత పేరు రావడం లేదని నమ్ముతుండేవారు. అప్పుడే గూగుల్‌పై వాళ్లకున్న నమ్మకాన్ని పటాపంచలు చేసేలా ఓ ఈవెంట్‌ జరిగింది. ఆ ఈవెంట్‌లో సింగర్‌ డ్రెస్‌ ధరించిన డ్రెస్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలవడంతో ఆమె పేరు మారు మ్రోగింది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆమె ధరించిన డ్రెస్‌ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అదే విషయాన్ని అడిగి తెలుసుకునేందుకు గూగుల్‌ సెర్చింజిన్‌కు పోటెత్తారు. చివరికి ఏమైందంటే?

జెన్నిఫర్‌ లోపెజ్‌
అందంగా ఉన్న అమ్మాయిని చాలామంది జెన్నిఫర్‌ లోపెజ్‌తో పోల్చుతుంటారు. అంతెందుకు.. ‘జెన్నిఫర్‌ లోపెజ్‌ స్కెచ్‌ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరీ...’ అంటూ టాలీవుడ్‌లో ఓ సాంగ్‌ కూడా పాడేసుకున్నారు. ఔను మరి.. జెలో మామూలు అందగత్తె కాదుగా! ఆ మాటకొస్తే పాప్‌ ప్రపంచంలో తనని నేచురల్‌ బ్యూటీ, కాంతివంతమైన చర్మం ఉన్న సింగర్‌గా చెబుతుంటారు. అందుకే ఆమె పాట, ఆట, నటనకంటే అందానికే ఫ్యాన్స్‌ ఎక్కువ.

రెడ్‌ కార్పెట్‌ మీద హొయలొలుకుతూ
సంగీత ప్రపంచాన్ని తమ మ్యూజిక్‌తో ఉర్రూతలూగించిన కళాకారులకు ది రికార్డింగ్‌ అకాడమీ ప్రతి ఏడాది గ్రామీ అవార్డ్‌లను ప్రధానం చేస్తుంది. అయితే, ప్రతిసారి జరిగినట్లే   2001లో గ్రామీ అవార్డుల ప్రధానం జరిగింది. ఆ ఈవెంట్‌కు జెన్నీఫర్‌ లోపెజ్‌ ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించి రెడ్‌ కార్పెట్‌ మీద హొయలొలుకుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు.

ఆనందంతో ఉక్కిరి బిక్కిరి
అంతే ఆ ఫోటోల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లు జెన్నీ డ్రెస్‌ గురించి తెలుసుకునేందుకు గూగుల్‌లో తెగ వెతికారు. యూజర్ల తాకిడికి దీంతో గూగుల్‌ సైట్‌ సైతం స్తంభించిపోయింది. ఈ ఊహించని పరిణామానికి గూగుల్‌ ఫౌండర్లు సైతం ఆనందంలో ఉక్కిరి బిక్కిరయ్యారు.

గూగుల్‌ పేరు మారు మ్రోగింది
గూగుల్‌ పేరు సైతం మారు మ్రోగింది. గూగుల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. అప్పుడే గూగుల్‌ ఫౌండర్లకు ఓ మెరుపు లాంటి ఐడియా వచ్చింది. గూగుల్‌ ఇమేజెస్‌ అనే టూల్‌ను లాంచ్‌ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నారు. ఇందుకోసం ముందుగా గూగుల్‌ ఇమేజెస్‌ టూల్‌ను ఎంపిక చేసిన యూజర్లకు అందుబాటులోకి తెచ్చారు. పనితీరు ఎలా ఉంటుందా? అని టెస్ట్‌ చేశారు. ఐడియా సూపర్‌ హిట్‌ అయ్యింది.

ఆదాయం అనూహ్యంగా 
ఆ తర్వాత ఏడాది 2001లో గూగుల్‌ గూగుల్‌ ఇమేజ్‌ అనే టూల్‌ను లాంచ్‌ చేసింది.  గూగుల్‌ ఇమేజ్‌ అనే టూల్‌ .. గూగుల్‌ ఇమేజ్‌నే మార్చేసింది. యూజర్ల సంఖ్య వేల నుంచి లక్షల్లోకి.. లక్షల నుంచి కోట్లకి చేరింది. గూగుల్‌లో అడ్వటైజ్మెంట్స్‌ పెరిగాయి. ఆదాయ మార్గాలకు కొదువలేకుండా పోయింది.

థ్యాంక్స్‌ టూ జెన్నిఫర్‌ లోపెజ్‌
గూగుల్‌ ఇమేజెస్‌, యాప్స్‌, మ్యాప్స్‌, బిజినెస్‌ లిస్టింగ్‌ ఇలా అన్నింట్లో గూగుల్‌ ఇమేజ్‌ అనే టూల్‌ ఆ సంస్థ స్వరూపానే మార్చేసింది. సెర్చ్‌ ఇంజిన్‌ సంపాదనలో 80 శాతం ఈ గూగుల్‌ ఇమెజ్‌ టూల్‌ వల్లే వస్తుంది. ఇలా ప్రపంచంలో తనతో ఏ ఇతర టెక్‌ కంపెనీ కూడా పోటీ పడలేని స్థాయికి చేరింది. కాబట్టే పరోక్షంగా తమ విజయానికి కారణమైన జెన్నిఫర్‌ లోపెజ్‌కు గూగుల్‌ ఫౌండర్లు సందర్భానుసారం కృతజ్ఞతలు చెబుతుండడం విశేషం.

Advertisement
Advertisement