తొలిసారి తగిలిన లాటరీ.. రైతులను కోటీశ్వరులను చేసిన టమాటా  | Sakshi
Sakshi News home page

తొలిసారి తగిలిన లాటరీ.. రైతులను కోటీశ్వరులను చేసిన టమాటా

Published Thu, Aug 10 2023 4:43 AM

The tomato that made farmers millionaires - Sakshi

సాక్షి, అమరావతి: ఒకప్పుడు కిలో టమాటాలను రూపాయి.. రెండు రూపాయలకు విక్రయించిన రైతులు అనూహ్యంగా లక్షాధికారులు­గా మారారు. కొందరైతే కోటీశ్వరులయ్యా­రు కూడా. ఈ సీజన్‌లో టమాటా ధరలు పెరగడం రైతుల అదృష్టాన్ని మలుపు తిప్పింది.

టమాటా ఎక్కువగా సాగయ్యే మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో ఆకస్మిక వర్షాలతో పంటలు దెబ్బతినడంతో డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తిలేక టమాటా ధరలు జాతీయ స్థాయిలో అనూహ్యంగా పెరిగాయి. మండీలలోనే కిలోకు సగటున రూ.130 నుంచి రూ.150 ధర లభించగా.. ఒక దశలో కిలో రూ.270 వరకు పలికింది. వ్యాపారులు పోటీపడి ధరలు పెంచడంతో రైతులకు మంచి లాభాలు వచ్చాయి.  

సుమారు 7 వేల మంది రైతులకు ప్రయోజనం 
రాష్ట్రంలో 1.50 లక్షల ఎకరాల్లో టమాటా సాగ వుతోంది. ఏటా ఖరీఫ్‌లో 60 శాతం, రబీలో 30 శాతం, వేసవిలో 10 శాతం విస్తీర్ణంలో సాగవుతుంది. వేసవి పంటను కర్ణాటక రాష్ట్రంలోని కోలార్, బెంగళూరు రూరల్‌ జిల్లాలతో పాటు ఏపీలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల్లో సాగు చేస్తుంటారు.

ఏపీలో టమాటా రైతులు 70 వేల మంది ఉండగా, వారిలో 5–7 వేల మంది రైతులు మాత్రమే సుమారు 10 వేల ఎకరాల్లో వేసవి పంట సాగు చేస్తుంటారు. ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. సాధారణంగా సాగు చేస్తే 15 కోతలు, ట్రెల్లీస్‌ కింద సాగు చేస్తే 25–30 కోతలు వస్తుంది. హెక్టార్‌కు ఖరీఫ్‌లో 60 టన్నులు, రబీలో 65–70 టన్నులు, వేసవిలో 50–60 టన్నులు వస్తుంది. 

ఎకరాకు గరిష్టంగా రూ.25 లక్షలకు పైగా ఆదాయం 
గతేడాది వేసవి పంటకు కిలో రూ.100కు పైగా లభించడంతో ఈ ఏడాది అదే స్థాయిలో ధర లభిస్తుందన్న ఆశతో రైతులు వేసవి పంట సాగుకు మొగ్గు చూపారు. సాధారణంగా వేసవి పంట ఫిబ్రవరి–మార్చిలో వేస్తారు. కొద్దిమంది కాస్త ఆలస్యంగా మార్చి–ఏప్రిల్‌లో పంట వేశారు. ఈ వేసవిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల వల్ల ఎకరాకు సగటున 15–20 టన్నుల వరకు దిగుబడి వచ్చింది.

అనూహ్యంగా పెరిగిన ధర ల ఫలితంగా చిత్తూరు జిల్లాలో 2,500 మంది రైతులు, అన్నమయ్య జిల్లాలో 3,200 మంది రైతులు రికార్డు స్థాయి లాభాలను ఆర్జించారు. సగటున ఎకరాకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఆదాయం రాగా, కొంతమందికి ఎకరాకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చింది. సుమారు 10–20 మంది రైతులు రూ.కోట్లలో ఆర్జించా రు. మదనపల్లెలో కిలోకు గరిష్టంగా రూ. 200 పలుకగా, కలికిరిలో రూ.245 పలికింది. ఇక అంగర మార్కెట్‌లో రూ.215 ధర వచ్చింది.

రూ.3 కోట్లు మిగిలింది 
చిత్తూరు జిల్లా సోమల మండలం కరమండ గ్రామానికి చెందిన ఈ రైతు పేరు పెసలప్పగారి మురళి. 24 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. ఎకరాకు 20 నుంచి 25 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. పంట చేతికొచ్చే సమయంలో టమాటా ధర అనూహ్యంగా పెరిగింది. సగటున కిలో రూ.130 నుంచి రూ.150 వరకు ధర పలికింది. కేవలం 45 రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.4 కోట్లకు పైగా ఆదాయం రాగా.. పెట్టుబడి పోనూ రూ.3 కోట్లకుపైగా మిగిలింది.

ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. ‘నాలుగేళ్ల క్రితం 12 ఎకరాల్లో టమాటా సాగుచేసే వాడిని. ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రస్తుతం 24 ఎకరాల్లో పంట వేశా. ప్రభుత్వం 20 ఎకరాలకు సబ్సిడీపై డ్రిప్‌తోపాటు మల్చింగ్‌ షీట్స్‌ ఇచ్చింది. గతంలో విద్యుత్‌ సరఫరా సక్రమంగా ఉండేది కాదు. ప్రస్తుతం 9 గంటలు ఇస్తున్నారు. ఇటీవలే మా ప్రాంతంలో ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లిన 4 గంటల్లోనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ వేశారు. టమాటా రైతులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి, మంత్రి పెద్దిరెడ్డికి రుణపడి ఉంటాం’ అని కృతజ్ఞతలు తెలిపారు. 

వినియోగదారులకు బాసటగా ప్రభుత్వం
టమాటా ధరలు చుక్కలనంటడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని వినియోగదారులకు బాసటగా నిలిచింది. రైతుల నుంచి సగటున కిలో రూ.107.49 చొప్పున రూ.14.65 కోట్ల విలువైన 1,363 టన్నులు సేకరించి రైతుబజార్ల ద్వారా కిలో రూ.50కే సబ్సిడీపై వినియోగదారులకు అందించింది.

బుధవారం కూడా కిలో రూ.83 చొప్పున రూ.16.60 లక్షలతో 20 టన్నులు సేకరించి సబ్సిడీపై పంపిణీ చేసింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.80 నుంచి రూ.125 మధ్య ధర పలుకుతుంటే రైతుబజార్లలో రూ.70 నుంచి రూ.84 మధ్య పలుకుతున్నాయి.

అప్పులన్నీ తీర్చేశా 
రెండెకరాల్లో 15 ఏళ్లుగా టమాటా సాగు చేస్తున్నా. దిగుబడులు ఘనంగా వచ్చినా మార్కెట్లో ధరలు అంతంతమాత్రంగానే ఉండేవి. పెట్టుబడి పోనూ ఆదాయం పొందిన సందర్భాలు చాలా తక్కువ. ఈ ఏడాది ఫిబ్రవరిలో పంట వేశా. దిగుబడుల కోసం అధికంగా ఎరువులు వినియోగించడం వల్ల రూ.8 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది.

మే 20 నుంచి ఇప్పటిæవరకు 23 కోతలు కోశాను. పెట్టుబడి ఖర్చులు పోనూ రూ.36 లక్షల వరకు ఆదాయం పొందాను. ఈ ఏడాది టమాటాకు వచ్చిన ధర గతంలో ఎప్పుడూ లేదు. ఈ ఆదాయంతో మాకున్న అప్పులన్నీ తీర్చేశా.  – వెంకటేష్ రాయల్, చిప్పిలి, మదనపల్లె 

Advertisement
 
Advertisement
 
Advertisement