కేంద్రంలో బీసీ శాఖ ఏర్పాటు చేయాల్సిందే..  | Sakshi
Sakshi News home page

కేంద్రంలో బీసీ శాఖ ఏర్పాటు చేయాల్సిందే.. 

Published Tue, Aug 2 2022 4:31 AM

R Krishnaiah On Establishment of BC Department At Central Govt - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వెనకబడిన వర్గాలకు సామాజిక న్యాయం దక్కాలంటే కేంద్రం తక్షణమే బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సిందేనని వైఎస్సార్‌సీపీ ఎంపీలు డిమాండ్‌ చేశారు. కేంద్రంలో 72 మంత్రిత్వ శాఖలు ఉన్నప్పుడు 75 కోట్ల జనాభా ఉన్న బీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఈ విషయమై త్వరలోనే ప్రధాని నరేంద్రమోదీని కలిసి విన్నవిస్తామని చెప్పారు. న్యూఢిల్లీలోని ఏపీభవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీలు ఆర్‌.కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణారావు, మార్గాని భరత్, బీశెట్టి సత్యవతి, డాక్టర్‌ సంజీవ్‌కుమార్, తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్‌ మాట్లాడారు.  

ఎవరికీ అభ్యంతరంలేని విషయంపై అలక్ష్యం వద్దు 
ఎంపీ కృష్ణయ్య మాట్లాడుతూ మండల్‌ కమిషన్‌ సిఫార్సులు, సంక్షేమ పథకాల అమలుకు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ అవసరమని చెప్పారు. పలు రాష్ట్రాల్లో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నప్పటికీ కేంద్రస్థాయిలో లేకపోవడం శోచనీయమన్నారు. ‘1992లోనే సుప్రీంకోర్టు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుపై ఎవరికీ అభ్యంతరాలు లేవు. ఇలాంటప్పుడు శాఖ ఏర్పాటుపై ఆలస్యం తగదు. దీనిపై పార్టీ తరఫున కేంద్రంపై ఒత్తిడి తెస్తాం.

కేంద్రస్థాయి ఉద్యోగాల్లో, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరతాం..’ అని చెప్పారు. బీసీల అభ్యున్నతికి వివిధ సంక్షేమ పథకాల అమలుతో పాటు, సామాజిక న్యాయం చేసేలా బీసీలకు రాజకీయ పదవుల్లో 50 శాతానికిపైగా కట్టబెట్టి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికే మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లు ఆమోదం పొందేవరకు ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు.

నామినేటెడ్, కార్పొరేషన్‌ పదవుల్లో 50 శాతం పదవులు బీసీలకు ఇచ్చేలా చట్టం తెచ్చారన్నారు. మాటల్లో కాకుండా ఆచరణలో బీసీల సంక్షేమం కోసం ఏపీ సీఎం జగన్‌ కృషిచేస్తున్నారని, ఆయన కృషిని చూసి పలు రాష్ట్రాల సీఎంలు, నేతలు ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. జగన్‌ నిర్ణయాలు ఓటుబ్యాంకు రాజకీయాల్లా కాకుండా ఒక తత్వవేత్త, సిద్ధాంతవేత్త తీసుకున్నట్లు ఉంటున్నాయన్నారు. బీసీలకు కేంద్ర  బడ్జెట్‌లో కనీసంగా రూ.లక్ష కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.  

కులగణన కోసం పోరాడతాం  
ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ బీసీలకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు కోసం కృషిచేస్తామని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం బీసీ సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల్లో కేంద్రం మ్యాచింగ్‌ గ్రాంటు ద్వారా భాగస్వామి కావాలన్నారు. రాష్ట్రస్థాయిలో అమలవుతున్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. బీసీల కులగణన కోసం ప్రధానిని కోరతామని చెప్పారు. ఎంపీ మార్గాని భరత్‌ మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌ లో కేటాయింపులు పెంచాలని కోరారు. బీసీలకు అవరోధంగా ఉన్న క్రీమిలేయర్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ బీసీ నినాదాన్ని బలంగా మోస్తున్న ఎనిమిది ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం కృషిచేస్తామని చెప్పారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement