కొండంత భక్తి!  | Sakshi
Sakshi News home page

కొండంత భక్తి! 

Published Sun, Oct 1 2023 5:03 AM

The queue in Tirumala stretches up to 5 kms - Sakshi

తిరుమల: తమిళనాడు వాసులకు పవిత్రమైన పెరటాసి మాసం ఓ వైపు, మరోవైపు అక్టోబర్‌ 2 వరకు వరుస సెలవులు రావడంతో తిరుపతి, తిరుమలకు వెళ్లే రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయి. అలిపిరి వద్ద పార్కింగ్‌ ప్రాంతాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. అలిపిరి నుంచి ఎస్వీ వేద వర్సిటీ వరకు తమిళనాడు నుంచి వచ్చిన బస్సులు నిలిచి ఉన్నాయి. శుక్రవారం నుంచి అలిపిరి రోడ్డుకిరువైపులా బస్సులు బారులు తీరాయి.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ 1, 2, నారాయణగిరి షెడ్‌లలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, క్యూ లైన్లు నందకం విశ్రాంతి భవనం దాటి 5 కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, అన్నప్రసాదాలు, వసతి తదితర అంశాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు అందిస్తోన్న సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు.

క్యూల్లో ఉన్నవారికి అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ నిరంతరాయంగా టీటీడీ అందిస్తోంది. 2,500 మంది శ్రీవారి సేవకులు నిరంతరాయంగా భక్తులకు సేవలందిస్తున్నారు. సెపె్టంబర్‌ 30 నాటికి శ్రీవారి దర్శనానికి టోకెన్‌ లేని భక్తులకు 48 గంటల సమయం పడుతోంది. టీటీడీ రేడియో, బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ఈ విషయమై పలు భాషల్లో ప్రకటనలు చేస్తోంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తీర్థయాత్రను రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.  

ఎస్‌ఎస్‌డీ టోకెన్ల రద్దు 
పెరటాసి శనివారాలు, వరుస సెలవుల కారణంగా అధిక రద్దీ దృష్ట్యా, టీటీడీ ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని రద్దు చేసింది. తిరుపతిలో అక్టోబర్‌ 1, 7, 8, 14, 15వ తేదీల్లో ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేయబోమని టీటీడీ తెలిపింది.  

Advertisement
Advertisement