Sakshi News home page

‘చింతకాయల’కు చెంపదెబ్బలు రాల్తాయ్‌!

Published Sat, Dec 23 2023 5:39 AM

The original calculations of Gadiraja Palace with a thorough survey - Sakshi

విశాఖపట్నంలోని గాదిరాజు ప్యాలెస్‌లో ఆక్రమణలో ఉన్న మిగులు భూమిని 0.3530 చదరపు మీటర్లుగా తేలుస్తూ 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి జాయింట్‌ కలెక్టర్, కలెక్టర్‌ సంతకాలతో 22ఏ జాబితాను విడుదల చేశారు. మిగులు భూమిగా తేల్చిన మొత్తాన్ని 22 ఏ 1(డీ) జాబితాలో టీడీపీ ప్రభుత్వమే చేర్చింది. వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా భూముల సర్వేలో భాగంగా మళ్లీ పక్కాగా సర్వే చేసి గాదిరాజు ప్యాలెస్‌లో వాస్తవ మిగులు భూమి కేవలం 0.1141 చదరపు మీటర్లుగా తేల్చింది.

అంతేకాకుండా దీన్ని క్రమబద్ధీకరించుకోవాలని గత మే నెలలోనే జాయింట్‌ కలెక్టర్‌.. స్థానిక తహసీల్దార్‌ ద్వారా నోటీసులు జారీ చేశారు. మిగులు భూమిని క్రమబద్ధీకరించుకోవడం ద్వారా పక్కాగా యాజమాన్య హక్కులను పొందేందుకు గాదిరాజు రామకృష్ణరాజుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వాస్తవాలు ఇలా ఉండగా... దొంగే దొంగ దొంగ అన్నట్టుగా అయ్యన్నపాత్రుడు అసత్య ఆరోపణలు చేశారు. వీటిపై స్పష్టత తీసుకునేందుకు శుక్రవారమంతా మీడియా ప్రయత్నించినా ఆయన ముఖం చాటేశారు. దీన్ని బట్టి కావాలనే ఆయన తప్పుడు ఆరోపణలు చేశారని తేటతెల్లమవుతోంది. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/విశాఖ సిటీ

ఇది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గాదిరాజు ప్యాలెస్‌ ఉన్న ప్రాంతంలో యూఎల్‌సీ భూమి ఉన్నట్టు తేల్చిన విస్తీర్ణం కేవలం 0.1141 చదరపు మీటర్లు.   తాజాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పక్కాగా తేల్చిన సర్వే ప్రకారం మిగులు భూమి సుమారు 6 సెంట్ల మేర తగ్గింది. అంటే ప్రస్తుత ప్రభుత్వం పక్కాగా సర్వే చేసి వాస్తవ లెక్కలను తేల్చింది. దీన్నిబట్టి గత టీడీపీ ప్రభుత్వమే ఎక్కువ లెక్కలను చూపి గాదిరాజు యాజమాన్యాన్ని బెదిరించే ప్రయత్నం చేసిందని అర్థమవుతోంది. అయితే, టీడీపీ సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు సీఎం కుటుంబంపై దుష్ప్రచారమే చేయడమే లక్ష్యంగా తప్పుడు ఆరోపణలకు దిగారు.

గాదిరాజు ప్యాలెస్‌ కావాలని దాని యజమానిని ముఖ్యమంత్రి సతీమణి కోరారని అభూత కల్పనలను సృష్టించేశారు. ఇందుకు గాదిరాజు ప్యాలెస్‌ యజమాని రామకృష్ణరాజు ఒప్పుకోకపోవడంతో ఆ ప్యాలెస్‌ను 22ఏ నిషేధిత భూముల జాబితాలో చేర్చారంటూ అసత్య ఆరోపణలు చేశారు. వాస్తవానికి అయ్యన్నపాత్రుడు తన కుమారుడికి ఎంపీ టికెట్, తనకు ఎమ్మెల్యే టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే చంద్రబాబు నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తే చంద్రబాబు మెప్పు పొందొచ్చని దిగజారుడు రాజకీయానికి దిగారు.                   

రూ.5 వేల కోట్ల విలువైన భూములకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రక్షణ..
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో  గీతం యూనివర్సిటీ మొదలుకుని అనేక మంది టీడీపీ నేతలు ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించేశారు. అందినకాడికి బినామీ పేర్లతో కబ్జా చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ.5 వేల కోట్లకుపైగా విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా కోరుల నుంచి రక్షించింది. ఎక్కడికక్కడ ప్రభుత్వ భూముల్లో బోర్డులను పాతడంతో పాటు చుట్టూ అధికారులు రక్షణ కంచె ఏర్పాటు చేశారు. దీన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా గీతం వర్సిటీ ఆక్రమించిన ప్రభుత్వ భూములను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

ప్యాలెస్‌ అడిగారనేది పూర్తిగా అవాస్తవం..
గాదిరాజు ప్యాలెస్‌ ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి తన అనుచరులను పంపించి అడిగించారన్న టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్‌పై కూడా అభాండాలు వేయడం బాధ కలిగించింది. ప్యాలెస్‌ ఇవ్వడానికి నేను ఒప్పుకోకపోవడంతో ప్యాలెస్‌ స్థలాన్ని 22ఏలో పెట్టి జిల్లా కలెక్టర్‌ ద్వారా నోటీసులు ఇప్పించారని ఒక పత్రికలో వార్త రాయడం అన్యాయం. ఇంత దారుణమైన, అసలు సంబంధంలేని వార్తను నేనెప్పుడూ చూడలేదు. నేను అయ్యన్నపాత్రుడిని కలిసినట్లు చెప్పడం సమంజసం కాదు. ఇప్పటివరకు కనీసం నేరుగా కూడా ఆయనను చూడలేదు.

వాస్తవానికి ఇదేం పెద్ద ప్యాలెస్‌ కాదు.. వేరే ప్రాంతంలో ఉన్న మోడల్‌ను చూసి నచ్చి ఇక్కడ నిర్మించుకున్నాను. పెద్దవారికి ఇది చాలా చిన్న విషయం.. ఇటువంటి బిల్డింగ్‌ను ఎవరైనా కట్టొచ్చు. మూడు నెలల కిందట అనారోగ్యానికి గురవడంతో హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నా.. ఇప్పటికీ కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో నన్ను ఎవరూ, ఎక్కడా కలవలేదు. రాజకీయాలతో ఏ సంబంధంలేని నన్ను, జిల్లా కలెక్టర్‌ను ఇందులో ఎందుకు లాగారో అర్థం కావడం లేదు. గాదిరాజు ప్యాలెస్‌ స్థలాన్ని 1997లో కొనుగోలు చేశా.. అన్ని అనుమతులు తీసుకున్నాకే నిర్మాణాలు చేపట్టా.

ఈ భూమిలో కొంత స్థలం మిగులు భూమిలో ఉందని.. ఏడాదిన్నర క్రితమే నోటీసు ఇచ్చారు. రెవెన్యూ సిబ్బందిలో కొందరికి పూర్తి అవగాహన లేకపోవడంతో కొంత స్థలం మిగులు భూమిలో ఉందని చూపించారు. వాస్తవానికి గతంలోనే నిబంధనల ప్రకారం అన్నీ చెల్లించి ప్రతి గజాన్ని రిజిస్టర్‌ చేయించుకున్నా. అది యూఎల్‌సీ స్థలమని ఎవరైనా నిరూపిస్తే నా ఆస్తి రాసిస్తా. –గాదిరాజు రామకృష్ణరాజు,  గాదిరాజు ప్యాలెస్‌ యజమాని

వాస్తవాలు తెలుసుకోకుండా రాస్తే చర్యలు..
ప్యాలెస్‌కు సంబంధించిన భూమి చినవాల్తేరు గ్రామంలో సర్వే నెంబర్‌ 10/4ఏ2ఏ, 10/4ఏ2బీ/2ఏ, 10/5ఏ2లో 0.2937 చదరపు మీటర్ల విస్తీర్ణం మిగులు భూమిగా ఉన్నందున 2018లోనే ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా 22ఏ (1)(డీ) రిజిస్టర్‌లో నమోదైంది. ప్రసుత్తం ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్‌ 84 ప్రకారం.. సదరు మిగులు భూమిని క్రమబద్ధీకరించుకోవాలని గాదిరాజు ప్యాలెస్‌ యజమానిని కోరుతూ ఈ ఏడాది మే 23న సీతమ్మధార తహసీల్దార్‌ నోటీసు జారీ చేశారు.

ఒక పత్రికలో పేర్కొన్న విధంగా ప్యాలెస్‌ యజమాని ఎప్పుడూ కలెక్టర్‌ను ఈ విషయంపై సంప్రదించలేదు. ఈ విషయంలో ఎవరి నుంచి ఎటువంటి ఒత్తిళ్లు లేవు. ప్రభుత్వ అధికారి ప్రతిష్టలకు భంగం కలిగించేలా వార్తలు ప్రచురిస్తే పరువునష్టం దావా వేసి న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.  – కె.ఎస్‌.విశ్వనాథన్, జాయింట్‌ కలెక్టర్, విశాఖపట్నం

బాబు మెప్పు కోసమే అయ్యన్న అసత్యప్రచారం
డెప్యూటీ సీఎం ముత్యాలనాయుడు ఆగ్రహం 
తిరుపతి కల్చరల్‌: కేవ­లం చంద్రబాబు మెప్పు కోసమే వైఎస్‌ కుటుంబంపై టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నోటికొచ్చినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని డెప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మంత్రి ముత్యాలనాయుడు మీడి­యాతో మాట్లాడుతూ విశాఖలో గాదిరాజు ప్యాలెస్‌కు సంబంధించి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయ­డంతోపాటు అక్కడ పారిశ్రామిక అభివృద్ధి కోసం సీఎం జగన్‌ చేసే ప్రయత్నాలు గిట్టని టీడీపీ నేతలు నిత్యం అడ్డగోలు అబద్ధాలతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉండగానే 2018లో గాదిరాజు ప్యాలెస్‌కు సంబంధించిన 3వేల చదరపు గ­జాల భూమిని 22ఏ 1డీ సీలింగ్‌లో పెట్టిందని చెప్పారు.

ఆ భూమిని రెగ్యులరైజ్‌ చేసు­కోవా­లని జాయింట్‌ కలెక్టర్‌ ఐదు నెలల కిందట ప్యాలెస్‌ యజమానికి నోటీసులు ఇచ్చా­రని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తన­కు, తన కు­మా­రుడికి టికెట్ల కోసమే వైఎస్‌ జగన్‌ కుటుంబంపై అయ్యన్నపాత్రుడు బురదజల్లు­తూ మతి భ్రమించి ఆరోపణలు చేస్తున్నార­న్నా­­రు. టీడీపీ కుట్ర రాజకీయాలకు కాలం చె­ల్లిం­దని, వారి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టంచేశారు. అధికార దాహంతో అయ్యన్న చేసిన అసత్య ఆరోప­ణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

What’s your opinion

Advertisement