వలంటీర్‌ చెప్పినవారికి ఓటేసేంత బలహీనంగా ఓటర్లు లేరు  | Sakshi
Sakshi News home page

వలంటీర్‌ చెప్పినవారికి ఓటేసేంత బలహీనంగా ఓటర్లు లేరు 

Published Wed, Apr 24 2024 5:50 AM

Observations of the High Court in the case of resignations of volunteers - Sakshi

రాజీనామాతోనే వలంటీర్‌కు, లబ్ధిదారుకు సంబంధం తెగిపోతుంది 

బూత్‌లోకి వెళ్లాక ఓటరు తనకు నచ్చిన వారికే ఓటేస్తారు 

ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఇప్పుడు సెలబ్రిటీలే ప్రచారం చేస్తున్నారు 

వలంటీర్ల రాజీనామాల వ్యవహారంలో హైకోర్టు వ్యాఖ్యలు 

వలంటీర్లు ఎంత మంది ఉన్నారు? ఎంత మంది రాజీనామా చేశారో చెప్పండి 

కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశం.. విచారణ నేటికి వాయిదా 

వలంటీర్లు రాజీనామా చేస్తే మేం చేయడానికి ఏమీ ఉండదు 

రాజీనామా చేశాక వారి ఇష్టానుసారం నడుచుకోవచ్చు: కేంద్ర ఎన్నికల సంఘం

సాక్షి, అమరావతి: వలంటీర్ల మాటలు విని.. వారు చెప్పినవారికి ఓటు వేసేంత బలహీనంగా ఓటర్లు లేరని హైకోర్టు వ్యాఖ్యానించింది. వలంటీర్, లబ్దిదారు మధ్య ఉన్న అనుబంధం వలంటీర్‌ రాజీనామాతో తెగిపోతుందని స్పష్టం చేసింది. అలాంటప్పుడు వలంటీర్‌ చెప్పినట్టు ఓటరు ఎందుకు చేస్తారని ప్రశ్నిం చింది. వలంటీర్లు తమ జేబులో నుంచి తీసి డబ్బేమీ ఇవ్వడం లేదని, అలాంటప్పుడు వారి మాటలను ఓటరు ఎందుకు వింటారని పిటిషనర్‌ను నిలదీసింది. ఎవరైనా కూడా ఓటరును పోలింగ్‌ బూత్‌ వద్దకు వెళ్లేంత వరకే ప్రభావితం చేయగలిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది.

పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లాక ఓటరు తనకు నచ్చినవారికే ఓటు వేస్తారని తెలిపింది. రాజీనామా చేశాక ఎవరైన వలంటీర్‌ ఏదైనా ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిం చింది. మొత్తం వలంటీర్లు ఎందరు? ఎంతమంది పనిచేస్తున్నారు? రాజీనామా చేసినవారెందరు? తదితర వివరాలను తమ ముందుంచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌ విచారణ జరిపారు.  

రాజీనామా చేశాక మేమేం చేయలేం.. 
కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది శివ­దర్శన్‌ వాదనలు వినిపిస్తూ.. వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారన్నారు. ఎన్నికల్లో విధుల్లో పాల్గొనకుండా, పోలింగ్‌ ఏజెంట్లుగా వ్యవహరించకుండా వలంటీర్లను నియంత్రిస్తూ ఎన్నికల సంఘం ఆదే­శాలు జారీ చేసిందని తెలిపారు. ఒకవేళ వలంటీ­ర్‌ రాజీనామా చేస్తే వారిపై ఎన్నికల సంఘానికి ఎలాంటి నియంత్రణ ఉండదన్నారు.

వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. వారికి సైతం ప్రాథమిక హక్కులున్నాయని.. ఇష్టానుసా­రం రాజీనామా చేసే హక్కు వారికి సైతం ఉందన్నా­రు. వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు పిటిషనర్‌ ఎలాంటి ఉదంతాలను పొందుపరచలే­దని చెప్పారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

ప్రత్యక్ష పరిచయాలతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు..
పి­టిషనర్‌ రామచంద్ర యాదవ్‌ తరఫు న్యాయ­వాది పీవీజీ ఉమేష్‌ వాదనలు వినిపిస్తూ.. అధికార పార్టీకి సహకరిస్తున్నారన్న ఆరోపణలతో వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచుతూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఆ ఆదేశాల నుంచి తప్పించుకునేందుకు వలంటీర్లు ఇప్పు­డు రాజీనామాలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిదారులతో వలంటీర్లు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నారన్నా­రు. ఇప్పుడు రాజీనామాలు చేసి ఎన్నికల్లో లబ్దిదారులను అధికార పార్టీ వైపు తిప్పడానికి వారిని ప్రభా­వితం చేస్తున్నారని ఆరోపించారు. అందువల్ల వలంటీర్ల రాజీనామాల విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు.

మరి సెలబ్రిటీలు కూడా ప్రచారం చేస్తున్నారుగా.. 
పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ.. వలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేసి, ఆయా పార్టీల అభ్యర్థుల అవకాశాలను ప్రభావితం చేయడం సాధ్యమా? అని ప్రశ్నిం చారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఒకరు పెద్ద ధనవంతుడు, మరొకరు పేద వ్యక్తి అయి ఉంటే, ఆ పేద వ్యక్తి.. తాను ఎన్నికల్లో తలపడేందుకు సమాన అవకాశాలు కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరగలడా? అని నిలదీశారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు సెలబ్రిటీలు కూడా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ఊహల ఆధారంగా పిటిషనర్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారని తెలిపారు. రాజీనామాలు చేశాక వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఎక్కడా కూడా పిటిషన్‌లో పేర్కొనలేదన్నారు. వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారని, వరుసగా వారు మూడు రోజుల పాటు విధులకు హాజరు కాకుంటే వారిని విధుల నుంచి తొలగించవచ్చన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందజేసేందుకే వలంటీర్లను నియమించామని చెప్పారు.

వారు కేవలం గౌరవ వేతనం మాత్రమే అందుకుంటున్నారని గుర్తు చేశారు. కొందరు తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు గౌరవ వేతనం పెంచుతామంటూ ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేస్తున్నారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఈ రోజుల్లో ఐఏఎస్‌ అధికారులు కూడా తమ ఉద్యోగానికి రాజీనామా చేసి, నచ్చిన పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు. కాబట్టి రాజీనామా చేశాక ఎవరినీ నియంత్రించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement