AP : సమాచార హక్కు కొత్త కమిషనర్ల ప్రమాణం | Sakshi
Sakshi News home page

AP : సమాచార హక్కు కొత్త కమిషనర్ల ప్రమాణం

Published Mon, Mar 11 2024 1:56 PM

New RTI Commissioners Has Taken Oath In Presence Of KS. Jawahar Reddy - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌కు ముగ్గురు కొత్త కమిషనర్లు

సునీల్‌, రెహనా, ఉదయ్‌ భాస్కర్‌ ప్రమాణం

విజయవాడ, 11 మార్చి: రాష్ట్ర సమాచార కమీషన్‌కు నియమించబడిన ముగ్గురు నూతన కమీషనర్లు చావలి సునీల్, రెహానా బేగం, అల్లారెడ్డి ఉదయ భాస్కర్ రెడ్డిలచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్. జవహర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ మేరకు విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో నూతన సమాచార కమీషనర్లచే  ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమీషన్ ముఖ్య సమాచార కమీషనర్ మెహబూబ్ భాషా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సమాచార కమీషనర్లు ఐలాపురం రాజా, శామ్యూల్ జొనాతన్, కాకర్ల చెన్నారెడ్డి, సమాచార కమీషన్ లా సెక్రటరీ జీ. శ్రీనివాసులు, ప్రభుత్వ సలహాదారు నేమాని భాస్కర్, నూతన సమాచార కమీషనర్ల కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రెహానా గురించి..
రెహానా స్వస్థలం కృష్ణా జిల్లా, ఉయ్యూరు. జర్నలిస్టుగా 20 ఏళ్ళ అనుభవం. జర్నలిజంలో పరిశోధనాత్మక కథనాలు, సాహసోపేత ప్రయాణాలతో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. హైదరాబాద్‌ పాతబస్తీలో మైనర్‌ బాలికలతో అరబ్‌ షేకుల కాంట్రాక్ట్‌ వివాహాలు, 2008 ముంబాయి మారణహోమం లైవ్‌ కవరేజ్‌, ఉత్తరాఖండ్ వరదల రిపోర్టింగ్, సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఉగ్రదాడి కవరేజ్ వంటివి వీటిలో కొన్ని.. దక్షిణాన తమిళనాడు మొదలు ఉత్తరాన జమ్ము-కాశ్మీర్‌, పశ్చిమాన గుజరాత్‌ మొదలు తూర్పున త్రిపుర వరకు 17 రాష్ట్రల నుంచి వివిధ అంశాలపై రిపోర్ట్‌ చేశారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి గెలిచినప్పుడు నరేంద్ర మోదీతో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది ముఖ్యమంత్రుల ఇంటర్వ్యూలు రెహానా ఖాతాలో ఉన్నాయి. భారత భూభాగంలో భారత-పాక్, భారత-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ప్రయాణం చేసి ప్రత్యేక కథనాలు అందించారు. గత ఏడాది టర్కీలో జరిగిన భూకంప ప్రళయాన్ని సాహసోపేతంగా కవర్ చేశారు రెహాన.

రెహానా రాసిన పుస్తకాలు
అంతర్జాతీయ సరిహద్దుల్లో చేసిన పాత్రికేయ ప్రయాణ అనుభవాలతో  "సరిహద్దుల్లో.." పేరుతో పుస్తకం తెచ్చారు. ఈ పుస్తకం "ఫ్రాంటియర్" పేరుతో ఇంగ్లీషులో అనువాదం అయ్యింది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై రాసిన వ్యాసాల సంకలనాన్ని "పెన్ డ్రైవ్" పేరుతో వెలువరించారు. టర్కీ భూకంప కవరేజ్ అనుభవాలతో టర్కీ @7.8 టైటిల్ తో పుస్తకం తెచ్చారు. 

అవార్డులు-రివార్డులు..
తెలంగాణ ప్రభుత్వ బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు, తెలంగాణా ప్రెస్ అకాడమీ అరుణ్ సాగర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు, వివిధ సంస్థల పురస్కారాలు, అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. గత ఏడాది మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ మహిళా జర్నలిస్టు పురస్కారంతో సత్కరించింది. ఏపీ మీడియా అకాడమీ కూడా బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా పురస్కారం అందజేసింది. 

నిర్వర్తించిన ఇతర బాధ్యతలు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీ సభ్యురాలు‌‌, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ సభ్యురాలిగా, ఏపీ మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఇవి చదవండి: మనబడి ‘ఐబీ’కి అనుకూలం!

Advertisement
Advertisement