చంద్రబాబు భద్రతపై ఎలాంటి అనుమానాలు లేవు: జైళ్ల శాఖ డీఐజీ | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదు: జైళ్ల శాఖ డీఐజీ

Published Fri, Oct 27 2023 9:08 PM

DIG Ravi Kiran Comments On Chandrababu Security In Central Jail - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి జైలులో చంద్రబాబు నాయుడు భద్రతపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదని తేలిందన్నారు. చంద్రబాబు భద్రత విషయంలో ఎంతో కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 

కాగా, డీఐజీ రవికిరణ్‌ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జైలు లోపల చంద్రబాబుకు భద్రత కట్టుదిట్టంగానే  ఉంది. మొదటి నుంచి 24 గంటలు సెక్యూరిటీ ఏర్పాటు చేశాం. అడిషనల్‌ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఎప్పుటికప్పుడు సెక్యూరిటీ వాచ్‌ చేస్తున్నాం. మావోయిస్టుల పేరుతో వచ్చిన లేక నిజం కాదని తేలింది. చంద్రబాబు జైలుకు వచ్చినప్పటి నుంచి ప్రతీ వారం సెక్యూరిటీ పరిశీలిస్తూనే ఉన్నాం. శ్రీనివాస్ చక్రవర్తి అనే వ్యక్తి దొంగతనం కేసులో లోపలికి వచ్చాడు. అతని జేబులో బటన్ కెమెరా దొరికింది. వెంటనే దాన్ని గుర్తించి పోలీసులకు అందజేశాం. బటన్ కెమెరాను అతను జైలు లోపలికి తీసుకు వెళ్లలేదు. అందులో జైలుకు సంబంధించిన సమాచారం ఏమీ లేదు. అతని కుటుంబ సమాచారం మాత్రమే ఉంది.

మా జైలు చుట్టూ ఐదు వాచ్ టవర్లు ఉన్నాయి. ఈనెల 23వ తేదీన డ్రోన్ కెమెరా తిరిగినట్లుగా సమాచారం వచ్చింది. వెంటనే సమాచారం పోలీసులకు తెలియజేశాం. పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు. జైలు లోపలికి గంజాయి ప్యాకెట్లు రావడం నిజం కాదు. జైలు లోపలికి గంజాయి ప్యాకెట్లు విసిరారు అనడం వాస్తవం కాదు. గంట గంటకు జైలు చుట్టూ పెట్రోలింగ్ జరుగుతూనే ఉంది. చంద్రబాబు కుటుంబ సభ్యులను ఫోటో తీశారు అనడంలో వాస్తవం లేదు.

చంద్రబాబు కుడి కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ సంబంధించి రాజమండ్రి జీజీహెచ్ వైద్యులను సంప్రదించాము. వారు పరీక్షలు నిర్వహించారు. ఇమ్మెచ్యూర్ కేటరాక్ట్ ఉన్నట్టు గుర్తించారు. కొంత సమయం తర్వాత చేయవచ్చని వైద్యులు సూచించారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి మేము ఎటువంటి తప్పుడు రిపోర్టు బయటికి ఇవ్వటం లేదు. పూర్తి వివరాలు కోర్టుకు పంపుతున్నాం. జైల్లో భద్రతకు సంబంధించి స్నేహబ్యారక్‌లో చంద్రబాబును ఏ రూమ్‌లో ఉంచామన్న విషయం బయటకు వెల్లడించాము. 

జైల్లో చంద్రబాబును ఫోటో తీసిన వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసాము. విచారణ చేస్తున్నాము. చంద్రబాబు భద్రతకు సంబంధించి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. చంద్రబాబు తనకు గతంలో ఉన్న ఎలర్జీల గురించి వైద్యులకు చెప్పారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులకి రెండు లెటర్లు రాశాము. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి వ్యక్తిగత వైద్యున్ని సంప్రదించి ఎటువంటి చికిత్స అవసరమవుతుందో సజెషన్స్ ఇవ్వమని భువనేశ్వరికి కూడా తెలియజేశాము. ఇదే విషయాన్ని కోర్టు కూడా తెలిపినట్టు చెప్పారు.

Advertisement
Advertisement