రూ.2,300 కోట్లతో.. విశాఖలో భారీ ఐటీ బిజినెస్‌ పార్క్‌  | Sakshi
Sakshi News home page

రూ.2,300 కోట్లతో.. విశాఖలో భారీ ఐటీ బిజినెస్‌ పార్క్‌ 

Published Mon, Oct 9 2023 6:02 AM

Andhra Pradesh mulling mega IT park in Visakhapatnam - Sakshi

సాక్షి, అమరావతి:  ఐటీ, ఐటీ ఆథారిత పరిశ్రమల ఆకర్షణలో విశాఖ నగరం ముందంజలో ఉందని ఇటీవల నీతి ఆయోగ్‌ ప్రకటించిన నేపథ్యంలో.. ఏపీఐఐసీ (ఏపీ ఇండ్రస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌) కూడా భారీ ఐటీ బిజినెస్‌ పార్క్‌ను ఇక్కడ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. విశాఖలో ఇప్పటికే అదానీ డేటా సెంటర్‌తో పాటు ఐటీ పార్క్, రహేజా గ్రూపు ఇన్‌ఆర్బిట్‌ మాల్‌తో పాటు ఐటీ పార్క్‌ ఏర్పాటుచేస్తున్న సంగతి తెలిసిందే. మధురవాడ హిల్‌ నెంబర్‌–3 మీద 18.93 ఎకరాల విస్తీర్ణంలో ఐ–స్పేస్‌ పేరుతో ఈ ఐటీ బిజినెస్‌ పార్కును పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి ఆసక్తిగల సంస్థల నుంచి ఏపీఐఐసీ తాజాగా బిడ్లను ఆహ్వనించింది.

ఐటీ, ఐటీ ఆధారిత కార్యకలాపాలు నిర్వహించుకునే సంస్థలకు అనుగుణంగా వాణిజ్య సముదాయాలతో పాటు సమావేశ మందిరాలు, బిజినెస్‌ హోటల్స్, సర్వీస్‌ అపార్ట్‌మెంట్స్, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్, ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ ఫెసిలిటీలతో పాటు తగినంత పార్కింగ్‌ సదుపాయాలు ఉండే విధంగా ఈ క్యాంపస్‌ను సుమారు రూ.2,300 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం భాగస్వామ్య కంపెనీతో ప్రత్యేక సంస్థ (ఎస్‌పీవీ)ని ఏర్పాటుచేస్తారు. ఈ ఎస్‌పీవీలో ఏపీఐఐసీ 26 శాతం వాటాను, భాగస్వామ్య కంపెనీ 74 శాతం వాటాను కలిగి ఉంటుంది.  

బహుళజాతి సంస్థలను ఆకర్షించేలా.. 
ఇక మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.2,300 కోట్లలో 40 శాతం ఈక్విటీగా సమకూర్చాల్సి ఉంటుంది. ఈక్విటీ రూపంలో ఏపీఐఐసీ రూ.239 కోట్లు, భాగస్వామ్య కంపెనీ రూ.681 కోట్లు సమకూరుస్తాయి. మిగిలిన మొత్తం రూ.1,380 కోట్లను రుణ రూపంలో సేకరిస్తారు. ఈ ప్రాజెక్టు డిజైన్‌ దగ్గర నుంచి నిర్మాణం, బ్రాండింగ్, నిర్వహణ అన్నీ భాగస్వామ్య కంపెనీయే చూడాల్సి ఉంటుంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు.. బహుళజాతి సంస్థలను ఆకర్షించేలా ఈ బిజినెస్‌ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ వీసీ ఎండీ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

పబ్లిక్, ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరడానికి ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించామని, భాగస్వామ్య కంపెనీ ఎన్నిక అనంతరం నిర్మాణ పనులను ప్రారంభించి వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు.. గడిచిన ఐదేళ్లలో విశాఖ రియల్‌ ఎస్టేట్‌ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, పలు అంతర్జాతీయ సంస్థలు, రిటైల్‌ సంస్థలు విశాఖలో ఏర్పాటుకావడంతో స్థిరాస్తి ధరలు 20 శాతం పైగా పెరిగినట్లు ఏపీఐఐసీ అధికారులు వెల్లడించారు. వాణిజ్య సముదాయాలకు భారీగా డిమాండ్‌ ఉండటంతో ఐ–స్పేస్‌ బిజినెస్‌ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement