Sakshi News home page

‘శ్రీవారి’ కోసం.. వేల కిలోమీటర్లు కాలినడకన..

Published Wed, Nov 1 2023 3:52 AM

Ahmedabad to Tirumala on feet - Sakshi

తాడిపత్రి: ఏడుకొండల స్వామిని దర్శించుకోవాలనే సంకల్పం ఆ వృద్ధ దంపతులను  వేలాది కిలోమీటర్ల దూరం నడిపించింది. స్వామివారి దర్శనభాగ్యం లభించిన అనంతరం తిరిగి కాలినడకనే సొంతూరికి తిరుగు పయనమయ్యారు. తాడిపత్రి ప్రాంతానికి చేరుకున్న ఆ వృద్ధ దంపతులను ‘సాక్షి’ పలకరించగా.. ఆశ్చర్యకర విషయాలు వెల్ల­డ­య్యాయి.. గుజరాత్‌ రాష్ట్రంలోని ద్వారకాకు చెందిన డాక్టర్‌ ఆర్‌.ఉపాధ్యాయ(74), భార్య సరోజినీ (71).. డాక్టరేట్‌ పూర్తి చేశారు.  ఉపాధ్యాయ తల్లి మెడికల్‌ సూపరింటెండెంట్‌గా పనిచేసేవారు. ఆమె కొన్నేళ్ల క్రితం కేన్సర్‌తో చనిపోయారు.

ఆమెకు జీవితంలో ఒక్కసారైనా తిరుమల వెంకన్న స్వామిని దర్శనం చేసుకోవాలనే కోరిక ఉండేది. కేన్సర్‌ కారణంగా శరీరం సహకరించక పోవడంతో ఆమె కోరి­క నెరవేరలేదు. కానీ అత్త బాధను అర్థం చేసుకున్న కోడలు సరోజినీ తన భర్త ఉపాధ్యాయతో కలసి కాలినడకన వెళ్లి ఏడుకొండల వాడిని దర్శనం చేసుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి దాదాపు 70 రోజుల క్రితం సుమారు 2,150 కిలోమీటర్ల దూరంలోని తిరుమలకు తోపుడు బండి (లగేజీ కోసం) తీసుకుని కాలినడకన బయలు దేరారు. స్వామి సన్నిధికి చేరుకునేందుకు 59 రోజులు పట్టింది.

వెంకన్న దర్శనానంతరం తిరిగి కాలినడకనే సొంతూరికి పయనమయ్యారు.  కాగా, ఏడు కొండల వాడి దర్శనానికి బయ­లుదేరే ముందు తన భార్యకు కాళ్లవాపుతో పా­టు ఆయా­సం ఉండేదని, తనకూ గ్లకోమా వ్యాధి ఉండేదని ఉపాధ్యాయ చెప్పారు. స్వామిపైన భారం వేసి యాత్ర మొదలుపెట్టామని, ఇప్పుడంతా బాగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. తన భార్య నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తోపుడు బండిపై కూర్చోబెట్టుకుని కొంతదూరం తోసుకుంటూ వెళ్తు­న్నట్లు ఉపాధ్యాయ చెప్పారు. వారి సంకల్పాన్ని చూసిన పలువురు ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement