నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత

Published Tue, May 14 2024 5:44 AM

TDP Leaders Attack On YSRCP MLA Gopireddy Srinivasa Reddy In Narasaraopet

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ గూండాల రాళ్ల దాడి

ఇల్లు, ఆస్పత్రిపై దాడి.. మూడు కార్లు ధ్వంసం

ఎమ్మెల్యే మామ, డ్రైవర్, మరో యువకుడికి తీవ్ర గాయాలు

దగ్గరుండి దాడి చేయించిన టీడీపీ అభ్యర్థి అరవిందబాబు

అర్ధరాత్రి కూడా కొనసాగుతున్న ఉద్రిక్తత

ఇరువురి గృహాల వద్ద కంచె వేసిన పోలీసులు

బాష్పవాయు గోళాల ప్రయోగం

నరసరావుపేట: ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓటమి ఖాయమని తేలిపో­­వడంతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు దగ్గరుండి తన అనుచరులు, బౌన్సర్లతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లు, ఆస్పత్రిపై దాడులు చేయించారు. ఈ దాడిలో ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి కారు డ్రైవర్‌ హరితో పాటు ఎమ్మెల్యే మామ కంజుల రామకోటిరెడ్డి, మరో యువకుడి తలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రిలో చేర్పించారు.

టీడీపీ నేతల దాడిలో ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిముందు ఉన్న మూడు కార్లు, ఆయనకు చెందిన ఆస్పత్రి అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నరసరావుపేటలో మధ్యాహ్నం 2గంటల వరకు ప్రశాంతంగా పోలింగ్‌ జరిగింది. మున్సిపల్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్న బూత్‌ లోపలికి టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ అరవిందబాబు, 20 మంది గూండాలు, బౌన్సర్లతో వచ్చారు. అంతకుముందు అదే బూత్‌కు వచ్చిన ఎమ్మెల్యే గోపిరెడ్డిని మాత్రమే అనుమతించిన పోలీసులు ఇతర నాయకులను లోపలికి అనుమతించలేదు. అరవిందబాబు 20 మందితో రావటాన్ని బూత్‌లో ఏజెంట్‌గా ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకుడు గంటెనపాటి గాబ్రియేలు ప్రశ్నించారు. దీంతో అరవిందబాబు గాబ్రియేలుపై చేయిచేసుకున్నాడు. 

దీంతో పోలీ­సులు అరవిందబాబుకు రక్షణ ఇస్తూ గాబ్రి­యేలు, అతడితో పాటు ఉన్న మరో నాయకుడు గోగుల మనోహరయాదవ్‌ను కొట్టారు. అరవిందబాబు బూత్‌ నుంచి బయటకు రాగానే అక్కడే కనిపించిన ఎమ్మెల్యే డ్రైవర్‌ హరిపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. తిరిగి వెళ్లిపోతూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటి వద్దకు రాగానే ఆయన ఇంటిపైన, ఆస్పత్రిపైన టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా రాళ్లు, సీసాలు, కర్రలతో వారిపై టీడీపీ గూండాలు ఎదురు దాడికి దిగారు.

పోలీసుల వ్యాన్‌లపై రాళ్లు వేశారు. దీంతో పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అయినా లెక్కచేయని టీడీపీ గూండాలు మళ్లీ గోపిరెడ్డి ఇంటిపైన దాడికి ప్రయత్నించారు. పోలీసులు ఇద్దరు నేతల ఇళ్ల వద్ద ముళ్లకంచె ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత కొనసాగుతోంది. 

దాడులు చేయడానికి టీడీపీ గూండాలు, బౌన్సర్లు 
ఎన్నికల్లో అల్లర్లు సృష్టించేందుకు టీడీపీ నేత అరవిందబాబు ఒంగోలు, హైదరాబాద్, చెన్నైల నుంచి భారీ ఎత్తున బౌన్సర్లను రప్పించినట్లు ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన నరసరావుపేటలోని తన ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడారు. మారణాయుధాలతో మళ్లీ దాడి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోందన్నారు. నాయకులు, కార్యకర్తలు అప్ర­మత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే హింసాత్మక సంఘట­నలు జరిగి ఉండేవి కాదన్నారు. తనను కేవలం రెండుకార్లు మాత్రమే వాడాలని చెప్పి.. శ్రీకృష్ణదే­వరాయలు మూడుకార్లు, అరవిందబాబు ఏడు­కార్లతో తిరిగినా అధికారులు చూసీచూడ­నట్లుగా పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. కలెక్టర్, ఎస్పీలు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement