-
అల్పజీవులతో... రామకథ కళ్లకు కట్టారు
నా పాట నాతో మాట్లాడుతుంది సాహిత్య పరిశోధన కోసం - సమగ్రాంధ్ర సాహితీ సాగర మథనం కోసం - సినీ సాహిత్యం ద్వారా వచ్చిన ధనాన్ని వెచ్చించి సినిమాపాటను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోకుండా అవలీలగా - అలవోకగా గీకి పారేసిన అనితర సాధ్య సినీకవి - సినీకవితా సర్కస్ క్రీడాకారుడు విజేత ఆరుద్ర. గుక్క తిప్పుకోకుండా చెబుతున్న ఆరుద్ర పాటతో ‘‘కామాలు - ఫుల్స్టాప్లుండవా... ఏకబిగిన చెబుతున్నావ్’’ అన్నాను. మళ్లీ సినీపాటల సవ్యసాచి నా తండ్రి ఆరుద్ర ఏకాంతమూ - సాయంత్రమూ - ఎదనీకై వేచినదో నన్నేగతి విడనాడినా నా హృదయము పగిలేను- అని అనువాద గీతం రాస్తాడు. ‘‘ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము’’ గైడ్ గీతం రాస్తాడు. ‘‘మనసే గని - తరగని గని - తగ్గని గని - పనిలో పని తెలపని - ఇది తప్పనిసరి’’ అని రాసి వేటూరిలాంటి కవి పండితులకు రోల్‌మోడల్ అవుతాడు. పడుచుదనంతో అందాలకు తాంబూలమిస్తాడు - ముత్తయిదు కుంకుమ బతుక్కు ఛాయ అంటాడు. గాంధీ పుట్టిన దేశమా ఇది - అంటూ శ్రీశ్రీకి మేనల్లుడు అనిపిస్తాడు. మదీయ జనకుడు ఆరుద్ర అంది ‘‘మరి మీరు’’ నేను- ‘రాయినైన కాకపోతిని’ ‘గోరంతదీపం’ సినీగీతాన్ని - అంది. కథాపరంగా వాణిశ్రీ భర్త తనను అనుమానించే స్థితిలో ఇరుక్కుపోయి ‘ఎందుకీ మానవజన్మ’ అనే నిరాశలోంచి ఈ పాట రావాలి. ఎలాగో ఓలాగు మామూలు పాటలా రాయొచ్చు. కాని రాసేది ఆరుద్ర, రాయించిన బాపు-రమణలు అసామాన్యులు. ఈ సందర్భానికి దర్శక రచయితలు. సినిమాను దర్శించే ప్రేక్షకుల ఊహకందనంత గొప్పగా గీతా దీప స్తంబంగా తీర్చిదిద్దాలనుకున్నాడు. సినీ రచయితలకు ‘‘పప్పేస్కో - ఉప్పేస్కో’’ పాటలేకాదు. మహాసముద్రాన్ని కలశంలో ఇమడ్చగలిగే అపార శక్తిసామర్థ్యాలు ఉండాలి అని రాబోయే మాలాంటి సినీ రచయితలకు నోటితో చెప్పకుండా - ఆచరణాత్మకంగా రాసి చూపించండి. ‘ఎందుకీ మానవజన్మ’ అనే నిరాశను కేంద్ర బిందువుగా తీసుకుని ‘రామకథ’ చెబుదామనుకున్నాడు ఆరుద్ర. రాయినైనాకాకపోతిని - అని మొదలెట్టాడు ‘కాక’ పోతిని అనే మాటకు అనేక విషయాలు అతికిస్తూ వెళ్లాడు. రామాయణంపై ఎంత ప్రభుత్వం ఉంటేనో సాధ్యమీ గీతం. బోయనైనా కాకపోతిని పుణ్యచరితను పాడగా. పక్షినై (జటాయివై) సీతను రక్షించబోయి దెబ్బతింటే రాముడి కరుణ పొందేదాన్ని - ఉడుతనై బుడతసాయం చేస్తే - రాముని వేలిముద్రలైనా వీపున మిగిలేవి. పడవనైతే స్వామి కార్యము తీర్చేదాన్ని, కాకినైన కాకపోతిని - రాముడిచే గడ్డిపోచతో చచ్చేదాన్ని - మనిషినై జన్మించి మదుమత్సరమ్ములు రేపగా... అంటూ నిరాశ - నిర్లిప్తతను, నిస్సహాయతలో కూడా రామకథలోని అల్పజీవుల అల్పవస్తువులను ఊతం చేసుకొని గీతం రాసి శెభాషనిపించుకోవచ్చన్న ఆరుద్ర సిరాముద్ర గుండెనిండా పడిన నాలాంటి కవులు ఆరుద్రనెలా మరువగలరు. మహనీయ మహాకవులు సినీగీతాలు రాసి సృష్టించిన ‘రహదారి’ లో నడుస్తూవుండు ఆ కవుల పదముద్ర - పాదముద్రలలో నీ భవిష్యత్తుకు దిక్సూచికా ముద్రలుంటాయి అశోక్‌తేజా అంటూ... ‘సమగ్రాంధ్ర సాహిత్యం‘ తన సమస్త గ్రంథాలను దానం చేసిన ఆరుద్ర సమర్పిత గ్రంథాలున్న సుందరయ్య విజ్ఞాన మందిరంలోని తన చోటు వెతుక్కుంటూ వెళ్లిపోయింది. - డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత -
నిదురంతటి సుఖమైన పాట
చిత్రం : రాజమకుటం (1960) గీతం : సడిసేయకో గాలి రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి సంగీతం : మాస్టర్ వేణు గానం : పి.లీల నా పాట నాతో మాట్లాడుతుంది నాతో కృష్ణశాస్త్రి పాట మాటాడింది. ‘‘ఇదిగో ఎవరూ మాటాడేది?’’ ‘‘నేను సుద్దాల అశోక్‌తేజ. హలో’’ ‘‘నేను కృష్ణశాస్త్రి పాటను.’’ ‘‘ఓహో, ‘ఇదిగో’ ఏంటి ఫోన్లో?’’ ‘‘నేను ఆంగ్లంలో హలో అనను. ఇదిగో అనే అంటాను. అవునూ కొసరాజు పిదప కృష్ణశాస్త్రి కదా! మధ్యలో నువు దూరావేంటి గతాదివారం?’’ ‘‘నా పాటతోనేకదమ్మా ఈ శీర్షిక ఆరంభమైంది’’. కృష్ణశాస్త్రి పాట మాటాడే పద్ధతి చూసి నాకు అచ్చ తెనుగే వస్తుంది... ‘‘అశోక్‌తేజా, నా పాటల తండ్రి చలన చిత్రాలకు పాటలు రాయకమునుపే మహాకవి. మహా మహా ప్రస్థాన మహాకవులకే గురుతుల్యులు. ఆయన మనసు ‘‘వెన్న బంగారు లోకం’’. ఆ లోకంలో నింగి సంస్కృతం, నేల తెనుగు తెలుసా?’’ ‘‘చెప్పు తల్లి’’ ‘‘మాట మనిషి - పాట పక్షి అన్న మాట విన్నావా?’’ ‘‘విన్నానమ్మా. కృష్ణశాస్త్రి. పట్నం తెమ్మంటుంది, పల్లె రమ్మంటుంది అన్నది కూడా ఆయనే కదా! బాపు ‘సంపూర్ణ రామాయణం’లో ‘అసలే ఆనదు చూపు - ఆపై ఈ కన్నీరు తీరా దయ చేసిన నీరూపు తోచదయ్యయ్యో’ అని చత్వారంతో నీరునిండిన శబరి కళ్లతో పాట అల్లి శబరి హృదయంలోకి తను వెళ్ల లేదూ! తన హృదయాన్ని శబరిగా మలచి రాసిన పాట కూడా తెలుసు, ఇంతకీ తమరెవరు?’’ ‘‘నేనూ... ‘రాజమకుటం’లో ‘సడిసేయకోగాలి’ని...’’ సిగ్గుపడుతూ అంది, ఫోనులో కూడా చెవికి తను సిగ్గరి అని తెలుస్తుంది. కృష్ణశాస్త్రి పాటమ్మాయ్ మరి! నా గుండె గొంతుకలోకి వచ్చి పొలమారినట్టయి ‘‘ఓ వండర్ఫుల్’’ అన్నాను. ‘‘మధ్యలో వండర్ ఫులెందుకు? అద్భుతమో, అపురూపమో, అపూర్వమో అనలేవూ’’ అంది లలితరమ్యంగా నా బుగ్గ గిల్లుతూ, బుద్ధి గరపుతున్నట్టూ. మన్నించు పాటా! ‘‘అపురూపమైన పాటవి, అపూర్వం కాదు’’ ‘‘ఏం... ఎందుకూ’’? ‘‘నీవు పుట్టకన్నా పూర్వం... మల్లీశ్వరిలో మనసున ఊగించిన మల్లెల మాలలు - ఎగిసిన హృదయమును పగులనీయకు అన్నవి కదా! అందుకే నీవు అపురూపమే కానీ అపూర్వం కాదుగా’’ అన్నాను. ‘‘గడుసరివే’’ ‘‘నేనూ కవికోవలోని కోవిలనే కదా’’ అన్నాను పాటల తండ్రి కృష్ణశాస్త్రి సంభాషణా సరళి అనుకరిస్తూ, అనుసరిస్తూ. ‘‘చెప్పు నీ జన్మరహస్యం.... ‘‘ఆరోజేమైందంటే... రాజమకుటం - దర్శకులు బి.ఎన్.రెడ్డి. పాట సన్నివేశం చెప్పారు. అలసిసొలసిన కథానాయకుడు ఎన్టీఆర్‌ను నాయిక తన ఒళ్లో పడుకోబెట్టుకొని సేదదీర్చాలి. ఎలా మొదలెట్టనూ అనుకుంటూ నా కోసం వెదుకుతున్నారు తన గదిలో నా తండ్రి. అంతలో చిన్నగాలి వీచి కిటికీల తలుపులు టపటపా కొట్టుకుంటున్నాయి. లేచి తలుపులు మూసి కూచున్నారు కృష్ణశాస్త్రి. మళ్లీ నాకోసం అన్వేషణ. ఇంతలో మళ్లీ గాలి - తలుపులు టపటపా చప్పుడు... అప్పుడు... ‘సడిసేయకే గాలి - నే పాట రాసుకోవాలి’ అని స్వగతంగా అన్నాడు. అంతే తటాలున తన ముందు నిలిచి... ఇదే పల్లవి తండ్రి అన్నా. సడిసేయకోగాలి సడిసేయబోకే... బడలి ఒడిలో రాజు పవళించేనే... పల్లవి పూర్తయింది. రత్నపీఠికలు, మణికిరీటములు లేకుంటే ఏమీ? చిలిపి పరుగు ఆపి నా రాజును సుకుమారంగా కొలిచి పోరాదే అనిపించాడు. నా రాజు ఎంత సుకుమారుడంటే ఆకు కదలికలకూ, ఏటి గలగలలకూ నిదురలేస్తాడు. నిద్ర అని సంయుక్తాక్షరం రాయటానికి కూడా కృష్ణశాస్త్రి ఇష్టపడడు. నిదుర అనే రాస్తాడు. ఇక్కడ కవి - సినిమా నాయకుడికన్నా సుకుమారుడే. అందుకే ‘నీ వల్ల నిదుర చెదిరిందో నేను ఊరుకోను సుమా!’ అని గాలిని... ఆ రాజసులోచన ద్వారా బెదిరిస్తాడు. ఈ ఆలోచన - ఈ సుందర ఆలాపన... కృష్ణశాస్త్రికే వస్తుంది.‘పండువెన్నెలను’ పడుకునే పాన్పు చేయరాదా అనటం... పానుపు మెత్తదనం వెన్నెలంత అని... తెనుగు తీపి తెలిసిన తేనెల జాబిల్లి దేవులపల్లి కనుకనే అలా రాయగలిగాడు, సరేనా! మూగగా మారిన నా తండ్రి రాగ గొంతుకే నా పండువెన్నెల పానుపు! వస్తా...’’ అంటు ఫోన్ పెట్టేసింది కృష్ణశాస్త్రి పాటలాధరి- పాట! - డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement