అల్పజీవులతో... రామకథ కళ్లకు కట్టారు

గోరంత దీపం సినిమాలో రాయినైనా కాకపోతిని పాట సన్నివేశం - Sakshi


 నా పాట నాతో మాట్లాడుతుంది

 సాహిత్య పరిశోధన కోసం - సమగ్రాంధ్ర సాహితీ సాగర మథనం కోసం - సినీ సాహిత్యం ద్వారా వచ్చిన ధనాన్ని వెచ్చించి సినిమాపాటను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోకుండా అవలీలగా - అలవోకగా గీకి పారేసిన అనితర సాధ్య సినీకవి - సినీకవితా సర్కస్ క్రీడాకారుడు విజేత ఆరుద్ర. గుక్క తిప్పుకోకుండా చెబుతున్న ఆరుద్ర పాటతో ‘‘కామాలు - ఫుల్‌స్టాప్‌లుండవా... ఏకబిగిన చెబుతున్నావ్’’ అన్నాను. మళ్లీ సినీపాటల సవ్యసాచి నా తండ్రి ఆరుద్ర ఏకాంతమూ - సాయంత్రమూ - ఎదనీకై వేచినదో నన్నేగతి విడనాడినా నా హృదయము పగిలేను- అని అనువాద గీతం రాస్తాడు.

 ‘‘ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము’’ గైడ్ గీతం రాస్తాడు.

 ‘‘మనసే గని - తరగని గని - తగ్గని గని - పనిలో పని తెలపని - ఇది తప్పనిసరి’’ అని రాసి వేటూరిలాంటి కవి పండితులకు రోల్‌మోడల్ అవుతాడు.

 పడుచుదనంతో అందాలకు తాంబూలమిస్తాడు - ముత్తయిదు కుంకుమ బతుక్కు ఛాయ అంటాడు.

 గాంధీ పుట్టిన దేశమా ఇది - అంటూ

 శ్రీశ్రీకి మేనల్లుడు అనిపిస్తాడు.

 మదీయ జనకుడు ఆరుద్ర అంది

 ‘‘మరి మీరు’’

 నేను- ‘రాయినైన కాకపోతిని’

 ‘గోరంతదీపం’ సినీగీతాన్ని - అంది.

కథాపరంగా వాణిశ్రీ భర్త తనను అనుమానించే స్థితిలో ఇరుక్కుపోయి ‘ఎందుకీ మానవజన్మ’ అనే నిరాశలోంచి ఈ పాట రావాలి. ఎలాగో ఓలాగు మామూలు పాటలా రాయొచ్చు. కాని రాసేది ఆరుద్ర, రాయించిన బాపు-రమణలు అసామాన్యులు. ఈ సందర్భానికి దర్శక రచయితలు. సినిమాను దర్శించే ప్రేక్షకుల ఊహకందనంత గొప్పగా గీతా దీప స్తంబంగా తీర్చిదిద్దాలనుకున్నాడు.

 సినీ రచయితలకు ‘‘పప్పేస్కో - ఉప్పేస్కో’’ పాటలేకాదు. మహాసముద్రాన్ని కలశంలో ఇమడ్చగలిగే అపార శక్తిసామర్థ్యాలు ఉండాలి అని రాబోయే మాలాంటి సినీ రచయితలకు నోటితో చెప్పకుండా - ఆచరణాత్మకంగా రాసి చూపించండి.

 

 ‘ఎందుకీ మానవజన్మ’ అనే నిరాశను కేంద్ర బిందువుగా తీసుకుని ‘రామకథ’ చెబుదామనుకున్నాడు ఆరుద్ర.

 రాయినైనాకాకపోతిని - అని మొదలెట్టాడు ‘కాక’ పోతిని అనే మాటకు అనేక విషయాలు అతికిస్తూ వెళ్లాడు. రామాయణంపై ఎంత ప్రభుత్వం ఉంటేనో సాధ్యమీ గీతం. బోయనైనా కాకపోతిని పుణ్యచరితను పాడగా. పక్షినై (జటాయివై) సీతను రక్షించబోయి దెబ్బతింటే రాముడి కరుణ పొందేదాన్ని - ఉడుతనై బుడతసాయం చేస్తే - రాముని వేలిముద్రలైనా వీపున మిగిలేవి. పడవనైతే స్వామి కార్యము తీర్చేదాన్ని, కాకినైన కాకపోతిని - రాముడిచే గడ్డిపోచతో చచ్చేదాన్ని - మనిషినై జన్మించి మదుమత్సరమ్ములు రేపగా... అంటూ నిరాశ - నిర్లిప్తతను, నిస్సహాయతలో కూడా రామకథలోని అల్పజీవుల అల్పవస్తువులను ఊతం చేసుకొని గీతం రాసి శెభాషనిపించుకోవచ్చన్న ఆరుద్ర సిరాముద్ర గుండెనిండా పడిన నాలాంటి కవులు ఆరుద్రనెలా మరువగలరు. మహనీయ మహాకవులు సినీగీతాలు రాసి సృష్టించిన ‘రహదారి’ లో నడుస్తూవుండు ఆ కవుల పదముద్ర - పాదముద్రలలో నీ భవిష్యత్తుకు దిక్సూచికా ముద్రలుంటాయి అశోక్‌తేజా అంటూ... ‘సమగ్రాంధ్ర సాహిత్యం‘ తన సమస్త గ్రంథాలను దానం చేసిన ఆరుద్ర సమర్పిత గ్రంథాలున్న సుందరయ్య విజ్ఞాన మందిరంలోని తన చోటు వెతుక్కుంటూ వెళ్లిపోయింది.        

 - డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top