Khammam District News
-
అమరవీరుల వారోత్సవాలకు సిద్ధం
● రేపటి నుంచి సీపీఐ(ఎంఎల్) గ్రూప్‌ల ఆధ్వర్యాన సన్నాహాలు ● తొలినాళ్లలో బలమైన వర్గం.. ఆపై చీలికలు ● ఐదు సార్లు ఇల్లెందు ఎమ్మెల్యే స్థానం కై వసం ఇల్లెందు: సీపీఐ(ఎంఎల్)లోని వివిధ వర్గాల ఆధ్వర్యాన శుక్రవారం నుంచి నవంబర్ 9వ తేదీ వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మాస్‌లైన్(ప్రజాపంథా)తో పాటు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీలోని వై.కే, చంద్రన్న వర్గాలు ఇందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే, సాధినేని వెంకటేశ్వరరావు సారథ్యాన కొనసాగుతున్న వర్గం వై.కే వర్గంలో విలీనం అయ్యేందుకు సిద్ధమైంది. ఫలితంగా ప్రజాపంఽఽథా, వై.కే., చంద్రన్న వర్గాల నేతృత్వాన అమరవీరుల వారోత్సవాలు జరగనున్నాయి. ప్రజలు, కూలీల సమస్యలపై పోరాటం చండ్ర పుల్లారెడ్డి నాయకత్వాన 1967లో సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యాన సాయుధ దళాలను ఏర్పాటు చేసి గోదావరి పరీవాహక ప్రాంతంలో కూలీ రేట్లు, తునికాకు కూలీలు, పోడు రైతుల సమస్యలపై ఉద్యమం చేపట్టారు. ఈ క్రమంలో అప్పటి ప్రభుత్వం నక్సల్స్‌పై ఉక్కుపాదం మోపింది. కాగా, పార్టీ ముఖ్యనేతలు చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమిల నాగిరెడ్డి, పోట్ల రామనర్సయ్య, నీలం రామచంద్రయ్య, బత్తుల వెంకటేశ్వరరావు, వెంపటాపు సత్యం, ఆదిబట్ల కై లాసం, జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర ప్రసాద్, చేరాలు తదితరులు వేర్వేరు సంవత్సరాల్లో నవంబర్ నెలలోనే అసువులు బాసారు. దీంతో ఏటా నవంబర్‌లో అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. బలమైన ఉద్యమం సీపీఐ(ఎంఎల్) నేతృత్వాన 1980 ప్రాంతంలో బలమైన ఉద్యమం ఏర్పాటైంది. ఇల్లెందు అసెంబ్లీ స్థానాన్ని ఐదు సార్లు, సిరిసిల్ల సీటును ఒకసారి కై వసం చేసుకుంది. 1984లో ఎంఎల్ పార్టీలో చీలికలు రాగా రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఇల్లెందు ఏరియాలో ప్రజాపంథాగా, ములుగు ఏరియాలో విమోచనగా పనిచేశాయి. ఆపై 1988లో విమోచనలో మరో చీలిక సంభవించింది. దీంతో రామచంద్రన్ – కూర రాజన్న విమోచన వర్గంగా, ఫణిబాగ్ఛీ– మధుసూదన్రాజ్ ప్రతిఘటన వర్గంగా కార్యకలాపాలు మొదలుపెట్టారు. విమోచన వర్గం సిరిసిల్ల కేంద్రంగా పనిచేసి ఎన్వీ.కృష్ణయ్యను ఎమ్మెల్యేగా గెలిపించుకుంది. కొంత కాలానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పది వర్గాలు కలిసి జనశక్తిగా ఆవిర్భవించాయి. ఇక ప్రతిఘటన వర్గంలో చలమన్న నాయకత్వాన ప్రజాప్రతిఘటన, అందులో నుంచి గోదావరి లోయ ప్రజాప్రతిఘటన వర్గాలు ఏర్పడ్డాయి. కొంత కాలానికే ఆ గ్రూపులన్నీ అంతరించిపోయి ప్రతిఘటన ఒక్కటే మిగిలింది. అయితే ఆ తర్వాత ప్రతిఘటనలో మళ్లీ రెండు, మూడు గ్రూపులు ఏర్పాటయ్యాయి. జనశక్తి నుంచి ఒక వర్గం సీపీయూఎస్ఐ, ఆదివాసీ లిబరేషన్ ఫ్రంట్‌గా ఏర్పడినా ఆతర్వాత కనుమరుగమయ్యాయి. కీలక నేతల మరణం ఈ ప్రాంతంలో కీలక నేతలైన చండ్ర కృష్ణమూర్తి(ఎల్లన్న) సుభాష్‌చంద్రబోస్(రవి), పూనెం లింగయ్య(లింగన్న), ముక్తార్‌పాషా, రాయల చంద్రశేఖర్ కన్నుమూయడంతో పార్టీ తీవ్ర నష్టాన్ని చవిచూసింది. కాగా, ప్రస్తుతం కొనసాగుతున్న మూడు గ్రూపులకు చెందిన రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య, ఆవునూరి మధు, అశోక్ అమరవీరుల సభలను జరపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈమేరకు ఇల్లెందులోని ఎన్డీ కార్యాలయంలో ఇటీవల జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు, జె. సీతారామయ్య, తుపాకుల నాగేశ్వరరావు అమరవీరు ల వారోత్సవాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో నాయకులు గౌని నాగేశ్వరరావు, తోడేటి నాగేశ్వరరావు, సారంగపాణి, మోకాళ్ల రమేష్, కొండపల్లి శ్రీనివాస్ ఇర్పా రాజేష్ పాల్గొన్నారు. -
యంత్రాల వాడకం అంతంతే..
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలోని భూగర్భగనుల్లో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. ఫలితంగా 24 గనుల్లో ఎక్కడ కూడా 100 శాతం ఉత్పత్తి నమోదు కాక వార్షిక లక్ష్యాల సాధన సాధ్యం కావడం లేదు. దీంతో సంస్థకు రూ.కోట్లలో నష్టం ఎదురవుతోంది. సింగరేణి పరిధిలోని భూగర్భ గనుల్లో 26 వేల మంది కార్మికులు పనిచేస్తుండగా.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 59.31 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నమోదైంది. అదే 18 ఓపెన్‌కాస్ట్ గనుల్లో 8 వేల మంది కార్మికులే ఉండగా.. 640 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి వచ్చింది. ఎస్డీఎల్ ద్వారా అంతంతే.. సింగరేణి సంస్థలో మొదట తట్టాచెమ్మస్ విధానం అమల్లో ఉండగా కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా 2002–03లో సైడ్ డిశ్చార్జ్ లోడర్ (ఎస్డీఎల్) యంత్రాలను ప్రవేశపెట్టారు. అయితే, కార్మికులకు నామమాత్రపు శిక్షణే ఇచ్చినా ఆరంభంలో రోజుకు 100 టన్నుల ఉత్పత్తి నమోదైంది. ఆ తర్వాత కార్మికులకు విదేశాల్లో శిక్షణ ఇప్పించడంతో రోజుకు 142 టన్నుల ఉత్పత్తి సాధించగలిగారు. కానీ ఇప్పుడు రోజుకు 102 టన్నులకు మించి ఉత్పత్తి రాకపోవడం గమనార్హం. సింగరేణిలోని 24 భూగర్భగనుల్లో 18 గనుల్లోనే ఎస్డీఎల్ యంత్రాలు నడుస్తుండగా. మిగతా వాటిలో సీఎమ్మార్, లాంగ్వాల్ యంత్రాలతో ఉత్పత్తి సాగుతోంది. ఎస్డీఎల్లు గతంలో సగటున రోజుకు 10.7 గంటలు పనిచేసేవి. ప్రస్తుతం 6.7 గంటలకే పరిమితమైంది. వీటి పని గంటలు కనీసం మరో రెండు గంటలు పెంచగలిగితే మరో 30 టన్నుల మేర బొగ్గు ఉత్పత్తి చేయొచ్చని, తద్వారా నష్టాన్ని అధిగమించొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఏంవీటీసీల్లో శిక్షణ కరువు సింగరేణిలోని ప్రతీ ఉద్యోగికి శిక్షణ ఇచ్చేందుకు మైన్స్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ (ఎంవీటీసీ)లను ఏర్పాటుచేశారు. గనుల్లోని ప్రతీ యంత్రం పనితీరు, మరమ్మతులకు సంబంధించి ఈ కేంద్రాల్లో నిపుణుల ద్వారా శిక్షణ ఇప్పించేవారు. అయితే, ప్రస్తుతం ఒకటి, రెండు సెంటర్లు మినహా మిగతా చోట్ల నిపుణులు లేక శిక్షణ సాఫీగా సాగడం లేదు. అంతేకాక సర్ఫేస్ ఉద్యోగం కావాలని వస్తున్న కొందరు అధికారులకు పూర్తిస్థాయిలో శిక్షణ అందడం లేదని చెబుతున్నారు. ఇకనైనా యంత్రాల పని గంటలు పెరిగేలా అధికారులు పర్యవేక్షిస్తే తప్ప భూగర్భగనుల్లో ఆశించిన స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధ్యం కాదని పలువురు పేర్కొంటున్నారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం గతంలో రోజుకు 10.7 గంటల మేర ఎస్డీఎల్ యంత్రాలతో పని ఇప్పుడు సగటున 6.7 గంటలకే పరిమితం నానాటికీ తగ్గుతున్న బొగ్గు ఉత్పత్తి గత కొన్నేళ్లలో ఎస్డీఎల్ పని గంటలు, ఉత్పత్తి (సగటున) సంవత్సరం పని రోజువారీ గంటలు ఉత్పత్తి (టన్నుల్లో) 2013–14 8.4 108 2014–15 7.9 107 2015–16 7.8 109 2016–17 7.8 114 2017–18 7.9 104 2018–19 7.6 105 2019–20 7.3 107 2020–21 5.6 79 2021–22 6.7 102 2022–23 7.0 105 2023–24 6.7 102 యంత్రాల పనిగంటలు పెంచాలి ఉద్యోగులు పనితీరు మార్చుకుని యంత్రాల వినియోగాన్ని పెంచితే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. లేనిపక్షంలో కంపెనీ మనుగడ కష్టతరమనే విషయాన్ని అందరూ గుర్తించాలి. భూగర్భ గనుల్లో ఎల్హెచ్డీలు, ఎస్డీఎల్ యంత్రాల పనిగంటలు పెంచాలి. అప్పుడే 100శాతం ఉత్పత్తి సాధ్యమవుతుంది. – వెంకటేశ్వరరెడ్డి, సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) -
118 కిలోల గంజాయి స్వాధీనం
భద్రాచలంటౌన్: ఒడిశా రాష్ట్రం నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్న ఎండు గంజాయిని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను భద్రాచలం ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎకై ్సజ్ అధికారి జానయ్య వెల్లడించారు. భద్రాచలంలోని కూనవరం రోడ్డులో అధికారులు వాహన తనిఖీ చేపట్టగా రెండు ఆటోల్లో తరలిస్తున్న 118 కిలోల ఎండు గంజాయి దొరికింది. ఆటోల్లో ఉన్న ముగ్గురిలో ఇద్దరు పారిపోగా, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.30 లక్షల వరకు ఉంటుందని జానయ్య తెలిపారు. సమావేశంలో ఎస్ఐ గౌతమ్, ఉద్యోగులు రామకృష్ణ గౌడ్, హాబీబ్ పాషా, వెంకట నారాయణ, గురవయ్య, సుమంత్, శ్రావణి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ‘సింగరేణి ఉద్యోగాల నోటిఫికేషన్ అవాస్తవం’ సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి ఇల్లెందు ఏరియాలోని ఓసీల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోిటిఫికేషన్లో నిజం లేదని జీఎం పర్సనల్(వెల్ఫేర్ అండ్ ఆర్సీ) శామ్యూల్ సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను పత్రికల ద్వారా ప్రకటిస్తామే తప్ప సోషల్ మీడియాలో విడుదల చేయమని చెప్పారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న నోటిఫికేషన్ అంశాన్ని నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని సూచించారు. ఇప్పటికే ఈ అంశంపై సింగరేణి విజిలెన్స్ విభాగం విచారణ చేపడుతోందని జీఎం తెలిపారు. -
కాంగ్రెస్ పాలనను ప్రజలు గమనిస్తున్నారు..
ఖమ్మంమయూరిసెంటర్: ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలను అమలు చేయలేక రోజుకో ప్రకటన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్ తెలిపారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 11 నెలలు కావొస్తున్నా హామీల అమలుపై కాలయాపన చేస్తున్నారన్నారు. ఇదేసమయాన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే, తెలంగాణ ఉన్నంతకాలం కేసీఆర్ గుర్తుండిపోతారని తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడగా బీఆర్ఎస్ పోరాటంతో విద్యుత్ చార్జీల పెంపుపై ఈఆర్సీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఇందిరమ్మ పథకం వర్తింపజేయండి ఖమ్మం మయూరిసెంటర్/సత్తుపల్లి: సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై నిర్మాణ దశలో ఉన్న ఇళ్లకు ఇందిరమ్మ పథకాన్ని వర్తింపచేసి పేదలను ఆదుకోవాలని ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. ఈ సందర్భంగా ఖమ్మంలో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. సొంత స్థలం ఉన్న నిరుపేదలకు గత ప్రభుత్వం రూ.3 లక్షలకు సంబంధించి ప్రొసీడింగ్స్ అందించిందని తెలిపారు. ప్రస్తుతం ఆ జీఓను రద్దు చేయడంతో పేదలు నష్టపోతున్నందున ఇందిరమ్మ పథకం వర్తింపజేయాలని, రఘునాథపాలెంలో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు హైవే నిర్మాణంలో కోల్పోతుండడంతో ప్రత్యామ్నాయం చూపించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు శీలంశెట్టి వీరభద్రం, శ్రీనివాసరావు, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, కనగాల వెంకట్రావు, బెల్లం వేణు, వీరూనాయక్, పోగుట్ల వెంకటేశ్వరరావు, అలేఖ్య, రామారావు, కట్ట అజయ్‌కుమార్, కాటమనేని వెంకటేశ్వరరావు, దుగ్గిరాల వెంకట్‌లాల్, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, పగుట్ల వెంకటేశ్వరరావు, కాటమనేని వెంకటేశ్వరరావు, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాత మధు -
వర్షం.. రైతుల్లో కల్లోలం
● జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాన ● పంటలు చేతికందే దశలో ఆందోళన ● ఖమ్మం మార్కెట్లో తడిసిన పత్తి బస్తాలుఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు వాతావరణం మామూలుగానే ఉన్నా ఆతర్వాత ఒక్కసారిగా చల్లబడింది. అనంతరం పలుచోట్ల వర్షం కురవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. చేతికొచ్చిన పత్తి, ఇతర పంటలకు వర్షం నష్టం చేస్తోందని దిగులు చెందారు. కాగా, జిల్లాలోని పెనుబల్లి లో 50 మి.మీ.ల వర్షపాతం నమోదు కాగా, ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో 28.3, కొణిజర్ల మండలం పెద్దగోపతిలో 22.3, సత్తుపల్లి మండలం గంగారంలో 21.3, కొణిజర్లలో 20.8, రఘునాథపాలెం మండలం మంచుకొండలో 11, మధిర మండలం సిరిపురంలో 7.5, రఘునాథపాలెంలో 6.8, వైరాలో 4, ఖమ్మం ప్రకాష్‌నగర్‌లో 3, తల్లాడలో 2.5 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. బుధవారం రాత్రి వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పంటలకు ప్రతికూలం ప్రస్తుతం కురుస్తున్న వానలు పంటలకు ప్రతికూలమనే చెబుతున్నారు. పత్తి తీతలు జోరుగా సాగుతుండగా, తొలినాళ్లలో వరి సాగు చేసిన రైతులు కోతలు మొదలుపెట్టారు. ఇదే సమయాన కురుస్తున్న వానలతో పత్తి రంగు మారడమే కాక నేల రాలుతోంది. అలాగే, కల్లాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం రంగు మారే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లో తడిసిన పత్తి బస్తాలు ఖమ్మంవ్యవసాయం/తల్లాడ: బుధవారం కురిసిన వర్షానికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో విక్రయానికి తీసుకొచ్చిన పత్తి బస్తాలు తడిశాయి. అయితే రైతులు అప్పటికే పంటను వ్యాపారులకు విక్రయించారు. వ్యాపారులు కాంటా పెట్టించి గోదాములకు తరలిస్తున్న క్రమాన వర్షం రావడంతో పత్తి బస్తాలపై టార్పాలిన్లను కప్పించారు. కొన్ని బస్తాలు తడవడంతో షెడ్లలోకి తరలించారు. ఇక తల్లాడ మండలం మిట్టపల్లి, నూతనకల్ గ్రామాల్లో వర్షంతో కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడుస్తుండడంతో రైతులు పట్టాలు కప్పారు. -
లేఖ రాయండి.. బహుమతి పొందండి!
● పోస్టల్ శాఖ ఆధ్వర్యాన లెటర్ రైటింగ్ పోటీలు ● విజేతలకు నగదు బహుమతి ● డిసెంబర్ 14 పోటీలకు తుది గడువు ఖమ్మంగాంధీచౌక్: లేఖ రాయడాన్ని ఈ తరం మరిచిపోయినా పాత తరం వారికి మాత్రం ప్రత్యేక అనుభవం. ప్రేమ, భావాల అందాన్ని ప్రదర్శించే లేఖా రచనలో భారత తపాలా శాఖ ‘ధాయ్ు అఖర్’ పేరిట పోటీలు నిర్వహిస్తోంది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పోటీల్లో ‘రచనానందం, డిజిటల్ యుగంలో ఉత్తరాల ప్రాధాన్యత’ అంశంపై తెలుగు, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో లెటర్ రాయొచ్చు. ఇంగ్లిష్‌లో The joy of writing: Importence of letters in a Digital Age అంశంపై లెటర్ రాయాల్సి ఉంటుంది. రెండు కేటగిరీల్లో.. లెటర్ రైటింగ్ పోటీలను రెండు కేటగిరీల్లో నిర్వహిస్తున్నారు. 18ఏళ్ల లోపు ఒక కేటగిరీగా, ఆపై వయస్సు కలిగిన వారిని రెండో కేటగిరీగా పరిగణిస్తారు. మొదటి కేటగిరీ వారు ఇన్లాండ్ లెటర్లో, రెండో కేటగిరీ వారు ఎన్వలప్ వినియోగించాలి. ఇన్లాండ్ లెటర్లో 500 పదాల లోపు రాయాల్సి ఉంటుంది. ఇక రెండో కేటగిరీ వారు ఏ–4 సైజు పేపర్లో వెయ్యి పదాల లోపు లేఖ రాసి కవర్లో పెట్టి పంపించాలి. లెటర్లను ‘చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్, తెలంగాణ సర్కిల్, హైదరాబాద్’ చిరునామాకు డిసెంబర్ 14 లోగా చేరేలా ఉంటుంది. జాతీయ, సర్కిల్ స్థాయిలో బహుమతులు లెటర్ రైటింగ్ పోటీల్లో విజేతలకు తపాలా శాఖ బహుమతులు అందిస్తుంది. జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతిగా రూ. 50 వేలు, ద్వితీయ బహుమతి రూ.25 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలు ఇస్తారు. ఇక సర్కిల్ స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచినవారికి రూ.25 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు ఇవ్వనున్నారు. గతంలో పలువురు విజేతలు తపాలా శాఖ గతంలో నిర్వహించిన లెటర్ రైటింగ్ పోటీల్లో ఖమ్మంకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. 2022–23లో నిర్వహించిన పోటీల్లో 18ఏళ్ల లోపు విభాగంలో కె.జస్విత(శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఖమ్మం), ఓ.ఉమామహేశ్వరి(జెడ్పీహెచ్ఎస్ బల్లేపల్లి) ద్వితీయ బహుమతిగా రూ.10 వేల చొప్పున సర్కిల్ స్థాయిలో గెలుచుకున్నారు. 18ఏళ్లకు పైబడిన విభాగంలో సర్కిల్ స్థాయిలో గోల్కొండ భావన(ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఖమ్మం) ద్వితీయ బహుమతిగా రూ.10వేలు గెలుచుకోగా, యలమద్ది సుచి(ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఖమ్మం) తృతీయ బహుమతిగా రూ.5వేలు గెలుచుకున్నారు. ఇక 2023–24లో 18 ఏళ్ల లోపు ఎన్వలప్ విభాగంలో బి.ఆరాధ్య(త్రివేణి టాలెంట్ స్కూల్, ఖమ్మం) ప్రథమ బహుమతి రూ.25 వేల నగదు గెలుచుకోవడం విశేషం.పోటీలు ఓ సదవకాశం.. లెటర్ రైటింగ్ పోటీలు విద్యార్థులు, యువతకు సదవకాశం. పోటీల్లో విజేతలుగా నిలిచే వారికి తపాలా శాఖ జాతీయ సర్కిళ్ల స్థాయిలో నగదు బహుమతులు అందిస్తుంది. మరిన్ని వివరాలకు సమీప తపాలా కార్యాలయంలో సంప్రదించవచ్చు. లేదంటే www. indiapost.gov.in వెబ్సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. – వివీరభద్రస్వామి, పోస్టల్ సూపరింటెండెంట్, ఖమ్మం డివిజన్ -
వన సమారాధన ఏర్పాట్లు పరిశీలన
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం గొల్ల గూడెంలోని చెరుకూరి వారి మామిడితోటలో 3వ తేదీ ఆదివా రం జరగనున్న ఉద్యోగుల సమ్మేళనం, వనసమారాధన ఏర్పాట్లను టీజేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన వేదికతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు ఇంకో వేదిక ఏర్పాటుచేస్తుండగా భోజనాలు, పార్కింగ్‌కు ఏర్పా ట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కస్తాల సత్యనారాయణ, మోదుగు వేలాద్రి, టీఎన్జీవోస్ నాయకులు గుంటుపల్లి శ్రీనివాస్, జయపాల్, కొమరగిరి దుర్గాప్రసాద్, గంగవరపు బాలకృష్ణ, రమేష్, తాల్లూరి శ్రీకాంత్, సగ్గుర్తి ప్రకాశ్‌రావు, ముఖీద్ పాల్గొన్నారు. కాగా, ఉద్యోగుల ఐక్యతను చాటేందుకు ఆదివారం వన సమారాధన నిర్వహిస్తున్న జేఏసీ మహిళా విభాగం నాయకులు ఉషశ్రీ, సుధారాణి, లలితకుమారి వెల్లడించారు. టీన్జీవోస్ భవన్ వద్ద బుధవారం నిర్వహించిన మహిళా ఉద్యోగుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈసమావేశంలో లలితమ్మ, పద్మజ, రోజా, స్వరూప, నాగమణి, షమ్మి, శ్వేత పాల్గొన్నారు. బాలుడిపై లైంగిక దాడి కేసులో జైలుశిక్ష ఖమ్మం లీగల్: జామపండ్లు కోసి ఇస్తానని నమ్మించి బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి 20ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి కె.ఉమాదేవి బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథ నం ప్రకారం వివరాలు.. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన ఎస్.కే.ఖాదర్ అలీ ఖమ్మం మోమినాన్ బజార్లో నివాసముంటున్నాడు. 2021 నవంబర్ 27న పని నిమిత్తం నిజాంపేటకు చెందిన ఓ మహిళ ఇంటికి వెళ్లాడు. ఆమె తమ ఇంట్లో జామపండ్లు ఉన్నాయని, పిల్లలు ఉంటే చెట్టు ఎక్కించొచ్చని పక్క ఇంట్లో నివా సం ఉండే బాలుడి తల్లికి తెలిపింది. దీంతో బాలుడిని పంపించగా ఖాదర్ అలీ కాసేపటికి ఎవరూలేని సమయాన లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈమేరకు ఇంటికి వచ్చాక తల్లికి చెప్పడంతో డిసెంబర్ 1న ఖమ్మం వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోక్సో చట్టం కింద పోలీసులు ఖాదర్‌ను అరెస్ట్ చేయగా, విచారణ అనంతరం ఆయనకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ న్యాయాధికారి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున పీపీ ఎ.శంకర్ వాదించగా, రషీద్, అయూబ్ సహకరించారు. -
4న ఖమ్మం మార్కెట్ ఎదుట ధర్నా
ఖమ్మంమయూరిసెంటర్: రైతులు పండించిన పత్తి మొత్తాన్ని ఎలాంటి షరతులు లేకుండా సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం(ఏఐపీకేఎస్) రాష్ట్ర నాయకుడు గుర్రం అచ్చయ్య డిమాండ్ చేశారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావు అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గిన నేపథ్యాన రైతులు నష్టపోకుండా పత్తిని మద్దతు ధరతో కొనుగోలు చేయాలన్నారు. ఈమేరకు 4వ తేదీన ఖమ్మం మార్కెట్ ఎదుట నిర్వహిస్తున్న ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, కోలేటి నాగేశ్వరరావు, కమ్మకోమటి నాగేశ్వరరావు, కేలోతు లక్ష్మణ్, మారుతి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఆర్డీఓ నర్సింహారావు ఖమ్మం సహకారనగర్: ఖమ్మం ఆర్డీఓగా జి.నర్సింహారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక్కడ పని చేస్తున్న గణేష్‌ను తొర్రూరు ఆర్డీఓగా బదిలీ చేయగా, ఖమ్మం ఆర్డీఓగా నర్సింహారావును ఇటీవల నియమించిన విషయం విదితమే. విద్యార్థులను విస్మరిస్తున్న ప్రభుత్వం ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంతో పాటు విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేసి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విషయంలో గత ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరిస్తోందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు విమర్శించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యాన ఖమ్మం ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద బుధవారం చేపట్టిన దీక్షను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. దీక్షకు ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి మద్దతు తెలిపారు. నాయకులు తుడుం ప్రవీణ్, సీహెచ్.రమేష్, సుధాకర్, సాయి, శేషు, ఉమేష్, రాగిణి, శ్రీలత, సంతోష్, మణికంఠ, తరుణ్, వంశీ, పూజిత, సింధు, స్వాతి పాల్గొన్నారు. -
రైలు ఢీకొని తండ్రీకుమార్తె మృతి
● మధిర స్టేషన్లో పట్టాలు దాటుతుండగా ప్రమాదం మధిర: తండ్రిని విజయవాడ ఆస్పత్రి తీసుకెళ్లి వస్తున్న క్రమాన రైల్వేస్టేషన్లో పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొనగా వస్తుండగా తండ్రీకుమార్తె మృతి చెందిన ఘటన ఇది. మధిర మండలంలోని మల్లవరం గ్రామానికి చెందిన కొంగర కేశవరావు(70) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో ఆయన కుమార్తె, ఖమ్మంపాడులో ఉండే నూకారపు సరిత(48) తన కుమారుడు కౌశిక్‌తో కలిసి బుధవారం విజయవాడకు తీసుకెళ్లింది. అక్కడ ఆస్పత్రిలో చూపించాక ముగ్గురు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో మధిర చేరుకున్నారు. అనంతరం తండ్రి కేశవరావును ఆటో ఎక్కించేందుకు రెండో నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు నుంచి ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు రైల్వేట్రాక్ దాటుతున్నారు. అదేసమయానికి చైన్నె నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ వస్తున్న విషయాన్ని గమనించలేదు. దీంతో రైలు ఢీకొనగా కేశవరావు, సరిత తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో కౌశిక్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కాగా, సరిత భర్త సంగారావు కొన్నాళ్ల క్రితం మృతి చెందగా ఆమె కూలీ పనులు చూస్తూ కుమారుడిని పోషిస్తోంది. ప్రమాదంలో తల్లి, తాత మృతితో కౌశిక్ కన్నీరుమున్నీరుగా రోదించడం అందరినీ కలిచివేసింది. రోడ్డు ప్రమాదంలో ఒకరు.. మధిర: మండలంలోని దెందుకూరు రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. మధిర నుండి దెందుకూరు వైపు యువకులు భాజ సాయి(25), చందు, గోపి బైక్‌పై వెళ్తుండగా బ్రిడ్జి సమీపాన ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ గటనలో సాయి అక్కడక్కడే మృతి చెందగా చందు, గోపి తీవ్రంగా గాయపడ్డారు. డిగ్రీ పూర్తి చేసిన సాయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. కాగా, క్షతగాత్రులను ఆర్కే ఫౌండేషన్ నిర్వాహకులు రామకృష్ణ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గోకినేపల్లిలో.. ముదిగొండ: మండలంలోని గోకినేపల్లిలో వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కోదాడ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న టాటా ఎస్ వాహనం, ఖమ్మం నుంచి నేలకొండపల్లి వైపు వస్తున్న బైక్ గోకినేపల్లి వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తలకు తీవ్రగాయాలు కాగా 108లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేసరికి మృతిచెందాడు. కాగా, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
ముగిసిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
కొత్తగూడెంరూరల్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు బుధవారం ముగిశాయి. ముగింపు సమావేశంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో పాటు వైరా, అశ్వారావుపేట, ఇల్లెందు ఎమ్మెల్యేలు రాందాస్‌నాయక్, జారే ఆదినారాయణ, కోరం కనకయ్యతో పాటు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పురుషుల విభాగంలో ప్రథమ బహుమతి గెలుచుకున్న రంగారెడ్డి జిల్లా జట్టుకు రూ.75వేలు, ద్వితీయ బహుమతి మహబూబ్‌నగర్ జిల్లా జట్టుకు రూ.60 వేలు అందజేశారు. అలాగే, మహిళా విభాగంలో నల్లగొండ జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలవగా రూ.75 వేలు, రెండో స్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా జట్టుకు రూ.60 వేలు అందించారు. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల నుంచి 16 జట్లు హాజరు కాగా, అన్ని జట్లకు నగదు బహుమతులు అందజేశారు. డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, నాయకులు తుంబూరు దయాకర్‌రెడ్డి, చీకటి కార్తీక్, ఆళ్ల మురళి, నాగ సీతారాములు తదితరులు పాల్గొన్నారు.విజేతలకు బహుమతులు అందజేసిన ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి -
రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబానికి రూ.90 లక్షల పరిహారం
ఖమ్మంలీగల్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ.90 లక్షల పరిహారాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ అందజేశారు. వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం టేకులపల్లి ఎన్నెస్పీ కెనాల్లో లష్కర్గా పనిచేస్తున్న మల్లెబోయిన గోపి 2018 డిసెంబర్ 29న విధులు ముగించుకుని వెళ్తుండగా వరంగల్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా ఢీకొనటడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఆయన కుటుంబీకులు పరిహారం కోరుతూ ఖమ్మం జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈమేరకు జిల్లా జడ్జి ప్రత్యేక చొరవతో, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి జెట్ల మహేష్ తమ న్యాయవాదులతో చర్చించి నష్టపరిహారంగా రూ.90 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించగా పిటీషనర్లు అంగీకరించారు. ఈమేరకు జిల్లా జడ్జి బుధవారం అవార్డు జారీ చేశారు. పిటీషనర్ల తరఫున నేరెళ్ల శ్రీనివాస్, బీమా కంపెనీ తరఫున బండారుపల్లి గంగాధర్, లోక్‌అదాలత్ మెంబర్లుగా ఎస్.శ్రీనాథ్, కె.ప్రసాద్ వ్యవహరించారు.సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి ఖమ్మం సహకారనగర్: డీఎస్సీ–2024 స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లుగా అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందని జిల్లా విద్యాశాఖాధికారి ఈ.సోమశేఖరశర్మ తెలిపారు. మంగళ, బుధవారాల్లో ఎస్ఏలు 21మందిలో 19 మంది, ఎస్జీటీల్లో 67మందికి గాను 47మంది హాజరయ్యారని వెల్లడించారు. నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఖమ్మం రాపర్తినగర్: జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యాన నవంబర్ 1నుంచి వృత్తి నైపుణ్య శిక్షణ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు డీవైఎస్ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నిరుద్యోగ యువతీ, యువకులకు కంప్యూటర్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, రిఫ్రిజిరేటర్, ఏసీ మెకానిక్ కోర్సుల్లో మూడేళ్ల కాలపరిమితితో శిక్షణ ఉంటుందని వెల్లడించారు. శిక్షణ పూర్తిచేసిన వారికి సెట్విన్ నుంచి సర్టిఫికెట్లు జారీ చేస్తారని, తద్వారా ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఫొటో, కుల ధ్రువీకరణపత్రంతో ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఉన్న తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 9948207271 నంబర్లో సంప్రదించాలని డీవైఎస్ఓ సూచించారు. డీసీసీబీలో కొత్తగా మూడు బ్రాంచ్‌లు ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పరిధిలో కొత్తగా మూడు బ్రాంచ్‌లు ఏర్పాటుకానున్నాయి. ఆర్థిక లావాదేవీలను పరిగణనలోకి తీసుకుని ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి, వేంసూరు మండలంలోని కందుకూరు, నేలకొండపల్లి మండలంలోని చెరువుమాధారంలో కొత్త బ్రాంచ్‌ల ఏర్పాటుకు నిర్ణయించారు. ఇప్పటికే టస్కాబ్ చొరవతో నాబార్డ్, ఆర్బీఐ నుంచి అనుమతులు జారీకాగా, త్వరలోనే పాలకవర్గం సమావేశంలో తీర్మానిస్తారు. ప్రస్తుతం డీసీసీబీ పరిధిలో 50 బ్రాంచ్‌లు ఉండగా కొత్తవి ఏర్పాటైతే ఈ సంఖ్య 53కు చేరుతుంది. తిరునక్షత్ర మహోత్సవానికి ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి తిరునక్షత్ర మహోత్సవానికి హాజరుకావాలని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఆహ్వానించారు. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లో వారిని అహోబిల జీయర్‌స్వామి కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్నేని రామారావు, రమేశ్‌గుప్తా పాల్గొన్నారు. -
డీసీసీబీ మేనేజర్ ఉపేంద్రనాథ్‌పై వేటు
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) ఖమ్మం రూరల్ బ్రాంచిలో అవినీతి, అక్రమాలకు బాధ్యుడిగా మేనేజర్ ఉపేంద్రనాధ్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2019లో ఈ బ్రాంచ్ ద్వారా 16 మందికి రూ.10లక్షల చొప్పున రూ.1.60 కోట్ల మేర నకిలీ ధ్రువపత్రాలతో దీర్ఘకాలిక మార్టిగేజ్ రుణాలు ఇచ్చినట్లు తేలగా, రుణ బకాయిలు వడ్డీతో కలిపి రూ.3 కోట్లకు చేరా యి. కాగా, ప్రస్తుతం ఎన్ఎస్టీ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఉపేంద్రనాధ్ను సస్పెండ్ చేస్తూ సీఈఓ వి.వసంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో బీఎంగా సృజనను నియమించారు. -
మెడికల్ కాలేజీలో ‘వైట్‌కోట్’ వేడుకలు
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బుధవారం వైట్‌కోట్ వేడుకలు నిర్వహించారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానుండగా నిర్వహించిన ఈ వేడుకలో ప్రిన్సిపాల్ ఎస్.రాజేశ్వరరావు, సూపరింటెండెంట్ ఎల్.కిరణ్‌కుమార్ వైట్‌కోట్‌లు అందజేశారు. అనంతరం ‘ఎలాంటి పక్షపాతం లేకుండా రోగులకు సేవ చేస్తాం’ అని ప్రమాణం చేయించారు. ఆతర్వాత అనాటమీ విభాగంలో మృతదేహానికి పూలమాలలు వేయించి ‘మృతదేహం మా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. దీన్ని ఎప్పుడూ చులకనగా చూడం. మొదటి గురువుగా భావిస్తాం’ అని కూడా ప్రమాణం చేయించారు. సీఎస్ ఆర్ఎంఓ కళావతిబాయి, ఆర్ఎంఓ రాథోడ్ వినాయక్, వైస్ ప్రిన్సిపాల్ సరిత, ఉద్యోగులు పాల్గొన్నారు. -
మత్స్య సొసైటీలో కాంట్రాక్ట్ విధానం రద్దు
వైరా: వైరా మత్స్య సహకార సొసైటీలో కాంట్రాక్ట్ విధానాన్ని తొలగించి, మత్స్యకారులకు ఇష్టమున్న వారికే చేపలు అమ్ముకునేలా తీర్మానించారు. వైరా మత్స్య సహకార సంఘం సమావేశం బుధవారం జరగగా జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్ హాజరయ్యారు. వైరా మత్స్య సహకారం సంఘం పాలకవర్గాన్ని రద్దు చేయాలని ఇటీవల కొందరు సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్‌లో పట్టిన చేపలను కాంట్రాక్టర్‌కు కాకుండా, తమకు నచ్చిన వారికి అమ్ముకునేలా తీర్మానించారు. అంతేకాక పాలకవర్గం యథావిధిగా కొనసాగేలా నిర్ణయించారు. ఇంకా ఈ సమావేశంలో సొసైటీ చైర్మన్ షేక్ రహీం, ఉద్దండు తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి
● తాలు పేరిట కోత పెడితే మిల్లర్లపై చర్యలు ● కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని రైస్ మిల్లులకు వరి ధాన్యం కేటాయించేందుకు బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో బుధవారం ఆయన మిల్లర్లు, బ్యాంక్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయించే సమయాన బ్యాంకు గ్యారంటీ సమర్పించాలని సూచించారు. కాగా, శుభ్రం చేసిన ధాన్యాన్నే కొంటున్నందున మిల్లుల వద్ద తాలు పేరుతో కోత విధించడానికి వీలు లేదన్నారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొనుగోలు కేంద్రాలకు సమీపంలోని రైస్ మిల్లులకు ధాన్యం కేటాయిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్‌కుమార్, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి రైతులకు లాభాలు వచ్చే ప్రత్యామ్నాయ పంటల దిశగా అవగాహన కల్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఆయిల్ పామ్ సాగుపై వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగుతో లాభాలు రైతులకు వివరించాలని తెలిపారు. అంతేకాక కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసే లా ప్రోత్సహిస్తే ఫలితం ఉంటుందని తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య, జిల్లా హార్టికల్చర్ అధికారి ఎం.వీ.మధుసూదన్, ఉద్యోగులు పాల్గొన్నారు. 5న ప్రజాభిప్రాయ సేకరణ స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన, అవసరమైన రిజర్వేషన్ల దామాషాపై అభిప్రాయ సేకరణకు తెలంగాణ బీసీ కమిషన్ బృందం నవంబర్ 5న ఖమ్మం వస్తోందని, కలెక్టరేట్లో జరిగే సమావేశంలో సంఘాల బాధ్యులు అభిప్రాయాలను రాత పూర్వకంగా సమర్పించాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సూచించారు. ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటల వరకు కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలోని బృందం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులపై విశ్వాసం కల్పించాలి ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేవారికి మెరుగైన సేవలందిస్తూ విశ్వాసం పెంపొందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్షించిన ఆయన మాట్లాడుతూ చాలాచోట్ల వైద్యులు, సిబ్బంది వ్యవహారశైలిపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ప్రజలకు సేవ చేయడం కోసం ఉన్నామనే స్పృహ లేకపోతే పని చేయొద్దని చెప్పారు. వైద్యులు, సిబ్బంది బయోమెట్రిక్ హాజరు వివరాలు ఎప్పటికప్పుడు అందించాలని సూచించారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.రాజేశ్వరరావు, జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, డీఎంహెచ్ఓ వి.సుబ్బారావు, డీసీహెచ్ఎస్ సూపరింటెండెంట్ కె.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.నేడు ఉద్యోగ విరమణ చేయనున్న వారికి సన్మానం జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేస్తున్న వారిని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సన్మానించారు. ఈ మేరకు డి.వెంకటేశ్వర్లు, బి.రాంబాబు, జి.వెంకట్‌రెడ్డి, డి.హీరాలాల్‌ను సన్మానించగా అదనపు కలెక్టర్ శ్రీజ, డీఆర్వో రాజేశ్వరి, డీఎంహెచ్ఓ వి.సుబ్బారావు, జిల్లా అగ్నిమాపక అధికారి అజయ్‌కుమార్, డీఐఈఓ రవిబాబు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి పాల్గొన్నారు. -
కార్పొరేటర్ పాడె మోసిన మంత్రి తుమ్మల
ఖమ్మంఅర్బన్: మూడు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందిన ఖమ్మం 3వ డివిజన్ కార్పొరేటర్ మలీదు జగన్ అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. విదేశాల్లో ఉంటున్న ఆయన కుమారుడు ప్రణీత్, మణీష్ మంగళవారం రాత్రి ఖమ్మం బల్లేపల్లిలోని స్వగృహానికి చేరగా తల్లి నాగమణి కన్నీరుమున్నీరుగా రోదించారు. అనంతరం బుధవారం ఉదయం కాంగ్రెస్ శ్రేణులు, కుటుంబీకులు, బంధువుల సమక్షాన బల్లేపల్లి సమీపంలోని జగన్ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జగన్ పాడె మోశారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో పాటు వివిధ పార్టీలు, సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు తుంబూరి దయాకర్‌రెడ్డి, తుమ్మల యుగంధర్, బాలసాని లక్ష్మీనారాయణ, మానుకొండ రాధాకిషోర్, సాధు రమేష్‌రెడ్డి, గుత్తా వెంకటేశ్వర్లు, మలీదు వెంకటేశ్వర్లు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు, దొంగల సత్యనారాయణ, పుచ్చకాయల వీరభద్రం, తాతా రఘురాం, రావూరి సైదబాబు, తుపాకుల ఎలగొండస్వామి, కుమలి శ్రీనివాసరావు, భద్రునాయక్, జంగిపల్లి రవి, రవీందర్ నాయక్, నాగరాజు, ఉపేంద్ర, నజీమా, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీకి 30లక్షల సభ్యత్వాలు ● పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జి మధుసూదన్‌రెడ్డి ఖమ్మం మామిళ్లగూడెం: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి రాష్ట్రంలో 30లక్షల సభ్వత్వాలు ఉన్నాయని పార్టీ రాష్ట్ర సభ్యత్వ నమోదు ఇన్చార్జ్ గోలి మధుసూదన్‌రెడ్డి వెల్లడించారు. ఖమ్మంలో బుధవారం క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టగా ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వాన అన్నివర్గాల ప్రజలకు మేలు జరిగేలా పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. కాగా, అవినీతికి పాల్పడిన తహసీల్దార్లను జైలుకు పంపుతామని మంత్రులు ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ రైతుల రుణమాఫీ చేయకపోగా, ధాన్యం బోనస్‌ను సన్న రకాలకే పరిమితం చేశారని విమర్శించారు. ఈ సమావేశంలో నాయకులు తాండ్ర వినోద్‌రావు, సన్నె ఉదయ్‌ప్రతాప్, దొంగల సత్యనారాయణ, నరేందర్, ఎడ్ల అశోక్‌రెడ్డి, నంబూరి రామలింగేశ్వరావు, శ్యాంరాథోడ్, నున్నా రవి, అల్లిక అంజయ్య, విజయారెడ్డి, మంద సరస్వతి పాల్గొన్నారు. -
వృద్ధుడి ఆత్మహత్య
చింతకాని: మండలంలోని చిన్నమండవకు చెందిన అలవాల సత్యనారాయణ(70) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత పదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న ఆయన మనోవేదనకు గురై సోమవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగాడు. ఈవిషయాన్ని గమనించిన కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఘటనపై సత్యనారాయణ కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు. చింతకాని మేజర్ కాల్వకు గండి చింతకాని: సాగర్ ప్రాజెక్టు పరిధిలో చింతకాని మేజర్ కాల్వకు బస్వాపురం గ్రామ సమీపాన గండి పడింది. ఈమేరకు 7 కిలోమీటర్ వద్ద మంగళవారం ఉదయం కాల్వకు గండి పడగా సాగర్ జలాలు వృధాగా పోతుండడంతో అధికారులు నీటి సరఫరా నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం తిరిగి నీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. -
పంటల రీ సర్వేను అడ్డుకున్న రైతులు
బోనకల్: మండలంలోని రాపల్లిలో పంట నష్టపరిహారం జాబితాలో అవకతవకలు జరిగాయని పలువురు రైతులు కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో ఏఓలు నారాయణరావు, శరత్, నాగేశ్వరావుతో పాటు ఏఈఓలు నాగసాయి, హుస్సేన్ మంగళవారం రీ సర్వే చేసేందుకు వచ్చారు. ఈక్రమాన రైతులు విడిపోయి తమ పొలాలను ఎదుటి వర్గం చూపించడమేమిటని ఒక వర్గం, అనర్హుల పేర్లను జాబితాలో చేర్చినందున రీ సర్వే చేయాల్సిందేనని ఇంకో వర్గం వారు పట్టుబట్టారు. దీంతో అధికారులు వెనుదిరిగారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుందనే అనుమానంతో వెళ్లిపోయామని అధికారులు తెలిపారు. -
రూ.10 లక్షలు రికవరీ, రూ.1.39 లక్షల జరిమానా
ముగిసిన సామాజిక తనిఖీ ప్రజావేదిక కామేపల్లి: కామేపల్లిలో మండలం గత ఆర్థిక సంవత్సరం చేపట్టిన ఈజీఎస్ పనులపై చేపట్టిన సామాజిక తనిఖీ ప్రజావేదిక మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా అడిషినల్ డీఆర్డీఓ శిరిష మాట్లాడారు. ఒకే వ్యక్తికి రెండేసి జాబ్‌కార్డుల జారీ, మస్టర్ల నిర్వహణలో లోపాలు, అంచనా వేసిన పనికి అదనంగా ఉండడంతో పాటు కొలతల్లో తేడాలు గుర్తించామని తెలిపారు. అలాగే, ఎంబీ రికార్డు చేయకుండానే చెల్లింపులు బయటపడ్డాయమని చెప్పారు. ఈ మేరకు అవకతవకలకు పాల్పడిన కార్యదర్శులు, ఫీల్డ్ అసిసెంట్లు, టీఏలకు రూ.1.39లక్షల జరిమానా విధించగా రూ.10,36,271 లక్షల రికవరీకి నిర్ణయించినట్లు తెలిపారు. అంతేకాక గోవింద్రాలలో ఇద్దరు, బర్లగూడెంలో ఒక సీనియర్ మేట్‌ను తొలగించామని, కెప్టెన్ బంజర కార్యదర్శికి షోకాజ్ నోటీస్ జారీ చేశామని చెప్పారు. ఈ సమావేశంలో పవన్, రమేశ్, వెంకటపతిరాజు, శ్రీరాణి, సాంబశివాచారి పాల్గొన్నారు. ఫంక్షన్‌కు వెళ్లొచ్చే సరికి చోరీ నేలకొండపల్లి: మండలంలోని చెన్నారం గ్రామంలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన బట్టపోతుల క్రాంతి–అంజలి దంపతులు డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయంలో నివాసం ఉంటున్నారు. వీరు మంగళవారం ఓ పంక్షన్‌కు వెళ్లొచ్చే సరికి ఇంటి తలుపులు, బీరువా పగలగొట్టి ఉన్నాయి. ఈమేరకు రూ.10 వేల నగదు, రెండు జతల చెవిదిద్దులు, పట్టీలు చోరీ జరిగాయని పోలీసులు ఫిర్యాదు చేశారు. పాలేరు జలాశయంలో మృతదేహం లభ్యం కూసుమంచి: మండలంలోని పాలేరు జలాశయంలో మంగళవారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిని ముదిగొండ మండలం సువర్ణాపురానికి చెందిన పసుపులేటి రామకృష్ణ(52)గా కుటుంబీకులు గుర్తించారు. ఆయన సోమవారం తమ గ్రామానికి చెందిన వ్యక్తి ఆటోలో పాలేరు రిజర్వాయర్ వద్దకు చేరుకున్నాడు. స్నేహితుడు వస్తున్నాడని చెప్పి ఆటోడ్రైవర్‌ను పంపించగా ఆయన కుటుంబీకులకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. దీంతో రామకృష్ణ కుటుంబసభ్యులు చేరుకుని గాలిస్తుండగా మంగళవారం ఉదయం పాలేరు ఔట్ ఫాల్ కాల్వ గేటు వద్ద మృతదేహం లభ్యమైంది. ఘటనపై ఆయన సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి..
ఖమ్మం సహకారనగర్: ఉపాధ్యాయులు, విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారా నికి కృషి చేస్తానని పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షు డు గాల్‌రెడ్డి హర్షవర్దన్‌రెడ్డి తెలి పారు. ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత పదేళ్లుగా విద్యారంగానికి సంబంధించి సమస్యలు పేరుకుపోయాయన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే పండిట్లు, పీటీటీల అప్‌గ్రెడేషన్, బదిలీలు, పదోన్నతులు, పోస్టుల భర్తీ చేపట్టిందన్నారు. ఈ నేపథ్యాన రెండు దశాబ్దాలుగా ఉపాధ్యాయుల పక్షాన పోరాడుతున్న తనను నల్లగొండ– ఖమ్మం–వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం గెలిపించాలని కోరా రు. తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్, సీపీఎస్ రద్దు తదితర సమస్యల పరిష్కారానికి పాటుపడతానని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కొమ్మినేని అని ల్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు గార్లపాటి ఉమాకర్రెడ్డితో పాటు బాలాజీనాయక్, ముత్తినేని సురేష్, మట్టా శ్రీనివాసరావు, శిరీష, ఓం ప్రకాష్, వీరూనాయక్, నాగుల్‌మీరా, దుబాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలి ఖమ్మంఅర్బన్: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించేలా కృషి చేయాలని రాష్ట్ర సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జేఏసీ లీగల్ అడ్వెజర్ తాళ్లపల్లి వెంకటరత్నం కోరారు. ఈమేరకు హర్షవర్ధన్‌రెడ్డికి ఆయన వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రుద్రగిరి గిరి, ఇస్మాయిల్, సైదమ్మ, షేక్ యాకుబ్ పాషా, సురేష్ తదితరులు పాల్గొన్నారు.పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్దన్‌రెడ్డి -
కొంటారా.. వదిలేస్తారా?!
●జాడలేని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ●నాణ్యత పేరిట వ్యాపారుల నిలువుదోపిడీ ●పెట్టుబడి కూడా రావడం లేదని రైతుల ఆవేదన ●ఉమ్మడి జిల్లాలో 88 వేలకు పైగా ఎకరాల్లో పంట సాగుఇల్లెందురూరల్: వాతావరణం అనుకూలించలేదు.. చీడపీడలు నీడలా వెంటాడాయి.. ఆపై అధిక వర్షాలు ఇబ్బంది పెట్టాయి.. అయినా చెమటోడ్చి మొక్కజొన్న సాగు చేసిన రైతులను దోచుకోవడంలో ఇప్పుడు దళారులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అతివృష్టితో భగవంతుడు రైతుల ఆశలపై నీళ్లు చల్లగా.. దళారులు ధరలో దగాతో వారి శ్రమను దోచుకుంటున్నారు. ఇదంతా తెలిసినా ప్రభుత్వ పరంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు దిగులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా.. భద్రాద్రి జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం అధికారిక గణాంకాల ప్రకారం 85,823 ఎకరాలుగా నమోదైంది. కానీ పట్టాలు లేని రైతులు సాగుచేసిన సుమారు 5వేల ఎకరాలు కలిపితే మొక్కజొన్న సాగు విస్తీర్ణం సుమారు 90వేల ఎకరాలుగా ఉంటుంది. ఇక ఖమ్మం జిల్లాలో 2,300 ఎకరాల్లో సాగైనట్లు అంచనా. అయితే, అనధికారికంగా లెక్కేస్తే ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న సాగు లక్ష ఎకరాలు దాటుతుందని చెబుతున్నారు. సాధారణంగా మొక్కజొన్న ఖరీఫ్‌లో ఎకరానికి 25 క్వింటాళ్లు, రబీలో 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కానీ ఈ దఫా వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగా ఎకరాకు 10 క్వింటాళ్ల నుంచి 15 క్వింటాళ్లు దాటడం లేదని రైతులు చెబుతున్నారు. ఎకరానికి 15 క్వింటాళ్ల చొప్పున లెక్కించినా 90 వేల ఎకరాల నుంచి 13.50 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న మార్కెట్‌కు చేరే అవకాశం ఉంది. దెబ్బమీద దెబ్బ.. ఖరీఫ్ ఆరంభంలో వర్షాభావంతో విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో రెండో సారి విత్తనాలు వేయాల్సి రావడంతో పెట్టుబడి ఖర్చు పెరిగింది. ఇక మొక్క ఎదుగుతున్న దశలో వర్షాభావం.. ఆ తర్వాత అధిక వర్షాలు కోలుకోకుండా చేశాయి. కంకి పాలుపోసే, గింజ పక్వానికి వచ్చే దశల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు మొక్కజొన్న దిగుబడిపై ప్రభావం చూపాయి. దీంతో ఎకరాకు కనీసం 20 క్వింటాళ్లకు బదులు పది నుంచి 15 క్వింటాళ్లు దాటలేదని రైతులు వాపోతున్నారు. ఓ పక్క పెట్టుబడి పెరగగా సరైన దిగుబడి లేకపోవడం వారిని కుంగదీస్తోంది. జాడలేని కొనుగోలు కేంద్రాలు.. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏటా అక్టోబర్ చివరి వారంలోనే ఏర్పాటు చేస్తుంది. దీంతో రైతులు ఆశతో తేమ తగ్గేలా మొక్కజొన్నలను కల్లాలు, రహదారులపై ఆరబెట్టారు. అయితే, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన లేకపోవడం గమనార్హం. ఈసారి ప్రభుత్వం మొక్కజొన్న మద్దతు ధర క్వింటాకు రూ.2,225గా నిర్ణయించింది. కానీ ప్రభుత్వ పరంగా కేంద్రాలు ఏర్పాటుకాకపోవడంతో చాలా మంది రైతులు బయట వ్యాపారులకు విక్రయిస్తున్నారు. క్వింటా రూ.2,300 చెల్లిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నా.. హమాలీ, ట్రాక్టర్ కిరాయి, తరుగు కోతలు లెక్కిస్తే రైతులకు క్వింటాకు రూ.2వేలు కూడా దక్కడం లేదు. అడుగడుగునా మోసం.. ఏజెన్సీ ప్రాంత రైతులను ధరతోపాటు తూకంలోనూ వ్యాపారులు మోసం చేస్తున్నారు. నేటికీ రాళ్లబాట్లు, ముళ్ల త్రాసులతో మొక్కజొన్న కాంటావేస్తూ అన్నదా త శ్రమను దోచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నా యి. ముళ్ల త్రాసుతో తూకం వేయడంతో రైతులు క్వింటాకు సగటున కిలో చొప్పున నష్టపోతారని, మొత్తంగా చూస్తే ఇది భారీగా ఉంటుందని చెబుతున్నారు. అయితే మొక్కజొన్న విక్రయాలు ఇప్పటికే 50 ాతం దాటాయని..ఇకనైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోతే వ్యాపారులకు తప్ప రైతులకు ప్రయోజనం ఉండదనే ఆందోళన వ్యక్తమవుతోంది.ఎప్పుడు ఏర్పాటు చేస్తరో.. ఐదెకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాను. పంట విక్రయం కోసం గతంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్దకు చేర్చాను. తేమ శాతం మెరుగ్గా ఉండేలా ఆరబెట్టుకుంటున్నాను. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తుందో ఇంకా తెలియడం లేదు. – గుగులోత్ మంగీలాల్, రైతు, కొమరారం, ఇల్లెందు మండలందిగుబడి భారీగా తగ్గింది అతివృష్టి, అనావృష్టి కారణంగా దిగుబడి భారీగా తగ్గింది. గతంలో ఎకరానికి 25 క్వింటాళ్లు వచ్చేది. కానీ ఈసారి 15 క్వింటాళ్లు కూడా దాటలేదు. బహిరంగ మార్కెట్‌కు పంట తీసుకెళ్తే మోసం చేస్తారనే భయం వేస్తోంది. అందుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రం కోసం ఎదురుచూస్తున్నాం. – భూక్యా చిన్నా , రైతు, కొమరారం, ఇల్లెందు మండలం -
పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఓపెన్‌హౌస్
ఖమ్మంక్రైం: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఖమ్మంలోని సిటీ ఆర్మ్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మంగళవారం ఓపెన్‌హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు హాజరుకాగా పోలీసులు విధినిర్వహణలో వినియోగించే ఆయుధాలు, ఇతర సామగ్రి పనితీరును అడిషనల్ డీసీపీ నరేష్కుమార్ వివరించారు. ఏకే 47 తదితర అత్యాధునిక ఆయుధాలు, బ్రీత్ ఎనలైజర్లు, పోలీస్ జాగిలాలను ప్రదర్శించగా, నేరస్తుల గుర్తింపు, అల్లరిమూకలను అదుపు చేసే విధానాన్ని వివరించారు. ఈకార్యక్రమంలో ఆర్ఐ కామరాజు, ఐటీ కోర్ ఎస్ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ ఏఈఓల ఆందోళనబాట
● నల్లబ్యాడ్జీలు ధరించి నేలపై కూర్చుని విధి నిర్వహణ ● ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ఖమ్మంవ్యవసాయం: ప్రభుత్వం పక్షాన ఉన్నతాధికారులు హామీల అమల్లో జాప్యం జరుగుతోందని చెబుతూ వ్యవసాయ విస్తర్ణాధికారు(ఏఈఓ)లు మళ్లీ ఆందోళన బాట పట్టారు. ఈమేరకు మంగళవారం ఏఈఓలు నల్ల బ్యాడ్జీలు ధరించి నేలపై కూర్చుని విధులు నిర్వర్తించారు. డిజిటల్ క్రాప్ సర్వే(డీసీఎస్) నిర్వహణ భారమవుతుందని, పొరుగు రాష్ట్రాల్లో మాదిరి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని లేదంటే సహాయకులను నియమించాలనే డిమాండ్‌తో కొన్నాళ్లుగా నిరసన తెలుపుతున్న విషయం విదితమే. ఈమేరకు ఉన్నతాధికారుల సూచనలతో ఆందోళనలు విరమించి సర్వే మొదలుపెట్టారు. అయితే, హామీలు నెరవేరకపోగా, సస్పెండ్ చేసిన ఏఈఓలను విధుల్లోకి తీసుకోకపోవడం, వేతనాల బిల్లుల్లో ద్వంద్వ విధానం అమలుచేస్తున్నారంటూ తిరిగి ఆందోళనలు ప్రారంభించారు. ఈ మేరకు మంగళవారం రైతు వేదికల్లో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమాల్లో ఏఈఓలు నేలపై కూర్చుని విధులు నిర్వహించారు. అలాగే, ఏఈఓల సంఘం ప్రతినిధులు నాగుల్ మీరా, శ్రీకాంత్, బాలకృష్ణ, హిందూ, భవాని, లిఖిత, అయేష, సుష్మ, జిష్ణు, వంశీ, శివ, గురుమూర్తి తదితరులు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందించారు. నేలకొండపల్లిలో... నేలకొండపల్లి: సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఏఈఓలు మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో నేలపై కూర్చుని నిరసన తెలిపారు. ఏఈఓల సంఘం నాయకుడు అవినాష్‌తోపాటు బి.శిరీష, అరవింద్, శశిరేఖ, సాయి నిఖిల, నవీన్, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు మానుకోవాలి
ఖమ్మం మామిళ్లగూడెం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలను మానుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగానే కాక దళితుల ఐక్యత కోసం మాల మహానాడు ఆధ్వర్యాన భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు చేపట్టిన మహా పాదయాత్ర మంగళవారం ఖమ్మం చేరుకుంది. ఈసందర్భంగా యూనిటీ ఆఫ్ మాల, మాల మహానాడు నాయకులు జెడ్పీ సెంటర్లో సుధాకర్, నాయకులకు స్వాగతం పలికారు. ఈమేరకు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిక సుధాకర్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలమంటూ వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారని విమర్శించారు. ఓట్లు వేసి కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఇప్పుడు మాలలకు అన్యాయం చేయడమేమిటని ప్రశ్నించారు. ఇకనైనా వర్గీకరణ ప్రయత్నాలు విరమించుకోకపోతే మాలల ఆగ్రహానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. కాగా, డిసెంబర్ 1న యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించే సభకు మాలలు తరలిరావాలని సుధాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కందుల ఉపేందర్, ఏ.మధు, జాగటి మధు, బీ.జీ.క్లైమెంట్, కనకయ్య, శ్రీను, ఎల్లయ్య, నాగలక్ష్మి, కామా ప్రభాకర్, శ్రీరాములు, రవి, సురేష్, ఎం.రవి, రాము, రామకృష్ణ, మనోజ్, వినయ్, కనకరత్నం, రాంబాబు, జానయ్య తదితరులు పాల్గొన్నారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ -
కార్పొరేటర్ జగన్‌కు నివాళులర్పించిన మంత్రులు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం 3వ డివిజన్ కార్పొరేటర్ మలీదు జగన్ సోమవారం గుండెపోటుతో మృతి చెందగా ఆయన మృతదేహాన్ని మంగళవారం బల్లేపల్లిలోని స్వగృహానికి తీసుకొచ్చారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, కేఎంసీ మేయర్ పి.నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య తదితరులు మృతదేహం వద్ద నివాళులర్పించి జగన్ సతీమణి నాగమణి, కుటుంబీకులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కమర్తపు మురళి, లకావత్ సైదులు, మలీదు వెంకటేశ్వర్లు, రఘునాథపాలెం పీఏసీఎస్ అధ్యక్షుడు తాతా రఘురాంతో పాటు మానుకొండ రాధాకిషోర్, నల్లమల వెంకటేశ్వర్లు, భూక్యా బాషా, గుత్తా వెంకటేశ్వర్లు, కొంగర జోతిర్మయి, దొబ్బల సౌజన్య, యరగర్ల హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత హైదరాబాద్ నుండి తీసుకొచ్చిన జగన్ మృతదేహాన్ని ఖమ్మంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి భారీ ర్యాలీగా ఇంటికి తీసుకెళ్లారు. కాగా, ఆయన అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి.