పీఎఫ్‌ సమాచారం ఇవ్వరా? | Sakshi
Sakshi News home page

పీఎఫ్‌ సమాచారం ఇవ్వరా?

Published Fri, Apr 14 2017 2:29 AM

పీఎఫ్‌ సమాచారం ఇవ్వరా? - Sakshi

విశ్లేషణ
కార్మిక శాఖ అధికారులు ఆర్టీఐ కింద పీఎఫ్‌ వివరాలను అడిగితే తిరస్కరించడం, కొత్త దరఖాస్తు వేసుకోమని వేధించడం న్యాయం కాదు. అది తప్పు చేసిన యాజమాన్యాలను పరోక్షంగా సమర్థించడమే.

గుజరాత్‌ అమ్రేలీ జిల్లా చావంద్‌లోని శ్యాంగోకుల్‌ టీబీ హాస్పిటల్‌ వారు భవిష్య నిధి (ప్రావిడెంట్‌ ఫండ్‌) కోసం కార్మికుల జీతాలలో ఎంత కోత పెడుతున్నారు, వారి íపీఎఫ్‌ ఖాతాలలో ఎంత జమ చేస్తున్నారు, ఏ తేదీ నుంచి వడ్డీని కలుపుతున్నారు, ఖాతాలోంచి డబ్బుని తిరిగి పొందే విధానం ఏమిటి మొదలైన అంశాలను తెలియజేయాలని కార్మిక నాయకుడు రాథోడ్‌ సమాచార హక్కు చట్టం కింద అడిగారు. కొన్ని కాగితాలు ఇచ్చిన అసిస్టెంట్‌ పీఎఫ్‌ కమిష నర్, ‘పోనీ మీరే స్వయంగా వచ్చి మొత్తం దస్తావే జులు చూసుకోండి, కావలసిన కాగితాలు ఇస్తాం’ అని పిలిచారు. రాథోడ్‌ వచ్చి చూసి, అదనపు కాగి తాలు అడిగితే ‘‘ఇవ్వం, ఇంకోసారి ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకోండి’’ అని వారు సెలవిచ్చారు.

కార్మికులందరి సమస్య గురించి ఈ ఆర్టీఐ వేశారు. కార్మికుల సంక్షేమం ఇందులో ఇమిడి ఉంది. యాజమాన్యాలు సరిగ్గా కార్మికుల వేతనాల నుంచి వారి పీఎఫ్‌ వాటా సొమ్మును కత్తిరించుకుని, దానికి తమ వాటాను కలిపి వారి ఖాతాలలో వేస్తు న్నారో, లేదో  తెలుసుకోవలసిన బాధ్యత కార్మిక సంఘాలకు ఉంది. వారు ఆర్టీఐ కింద అడగకపో యినా, ఒక ఉత్తరం రాస్తే చాలు ఈ వివరాలన్నీ ఇవ్వడం అవసరం. కాని ఆర్టీఐ వేసిన తరువాత కూడా ఇవ్వకపోవడం, ఇంకో ఆర్టీఐ దరఖాస్తు పెట్టండి అని ఉచిత సలహా ఇవ్వడం సరైంది కాదు. 1991 నుంచి ఆ సంస్థలో ఉద్యోగులు పనిచేస్తుంటే 1994 నుంచి మాత్రమే పీఎఫ్‌ వాటాలను ఖాతాల్లో జమచేశారు. 7 ఎ కింద ఆ సంస్థపైన దర్యాప్తు చేయ వలసిన బాధ్యత ఉన్నా పట్టించుకోలేదు.

పీఎఫ్‌ తది తర బకాయిలకు సంబంధించి ఇవ్వవలసిన ఫారం 3, 6 ఎ, 12 ఎ ఇచ్చినా సంస్థ తన బాధ్యత నిర్వ హించలేదు. ఇద్దరు ఉద్యోగులు 2008, 2009లో విరమణ చేశారు. 2009లో ఆస్పత్రి మూతబడటం వల్ల 20 మంది ఉద్యోగం కోల్పోయారు. కావాలని ఆలస్యం చేయడం వల్ల పీఎఫ్‌ కోసం కార్మికులు క్లెయిమ్‌ దరఖాస్తులు పెట్టుకోలేకపోయారు. కావల సిన వివరాల పత్రాలు ఇవ్వలేదు. మీరు అడిగిన వివరాలు స్పష్టంగా లేవు అని తాత్సారం చేశారు. స్పష్టంగా లేకపోతే కార్మిక నాయకుడిని పిలిచి అడి గితే ఏం పోయింది? రోజ్‌ కామ్‌ రిజిస్టర్‌ను, మరి కొన్ని రికార్డులను చూడాలని అడిగితే రమ్మన్నారు కాని, కావలసిన కాగితాలు ఇవ్వలేదు. అప్పీలు వేయమన్నారు. అందులోనూ న్యాయం జరగలేదు.

ఫలానా కాగితాలు కావాలని అడిగితే మొదటి అప్పీలును ముగించామని, మళ్లీ కొత్తగా ఆర్టీఐ దర ఖాస్తు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. వారి దగ్గర సమాచారం ఉన్నా ఇవ్వడం లేదని రాథోడ్‌ కమి షన్‌కు వివరించారు. 17 మంది కార్మికుల క్లెయిమ్‌ ఫారాల కాపీలు అడిగారు. ఇతర పత్రాలు కావాల న్నారు. కార్మికుల జీతాల నుంచి పీఎఫ్‌ వాటా తీసుకుని, జమ చేయకపోవడం, వారి వంతు డబ్బు ఇవ్వకపోవడం చట్ట ఉల్లంఘనలే. అర్థం అయ్యేట్టు ఆర్టీఐ అడగడం పౌరుని బాధ్యతే అయినా, స్పష్టంగా అడిగినా అర్థం కాలేదని వాదించడం బాధ్యతారాహిత్యం. కార్మికుల వేతనాల డబ్బును జమచేయకపోవడం అంటే, వారి డబ్బును యాజ మాన్యం అక్రమంగా వాడుకున్నట్టే. చాలా వివ రంగా దరఖాస్తు ఉన్నప్పడికీ అర్థం కావడం లేదని తిరస్కరించే అధికారం ఈ చట్టం కింద లేదు.

కార్మికులకు సక్రమంగా వారి హక్కులు అందేట్లు చూడవలసిన కార్మిక శాఖ అధికారులు ఆ పని చేయకపోగా, దానికి సంబంధించిన వివరా లను ఆర్టీఐ కింద అడిగితే తిరస్కరించడం, కొత్త దరఖాస్తు వేసుకోమని వేధించడం న్యాయం కాదు. ఇందువల్ల తప్పు చేసిన యాజ మాన్యాలను కార్మిక శాఖ పరోక్షంగా సమర్థిస్తూ నష్టపోయిన కార్మికుల న్యాయమైన హక్కులను రక్షించడంలో నిర్లక్ష్యం చేసి నట్టు స్పష్టమవుతున్నది.

ఈ కేసులో కమిషన్‌ కొన్ని ఆర్టీఐ సూత్రాలను నిర్ధారించింది. అవి:
1. సమాచార దరఖాస్తు అర్థం కాకపోతే దర ఖాస్తుదారుని పిలిచి తెలుసుకొనే ప్రయత్నం చేయ డం పీఐఓ బాధ్యత. అర్థం కాలేదని తిరస్కరించడం చట్ట వ్యతిరేకం. 2. పర్యవేక్షణ అధికారం కూడా సమాచార హక్కులో భాగం. దస్తా వేజులు పరిశీలిం చిన తరువాత కొన్ని కాగితాల ప్రతులు అడిగితే, ఇంకో తాజా ఆర్టీఐ దరఖాస్తు పెట్టుకోవాలని ఒత్తిడి చేయడానికి వీల్లేదు. పర్యవేక్షణ అధికారంలో కావ లసిన కాగితాలు కోరే హక్కు కూడా ఇమిడి ఉంది. మరోసారి దరఖాస్తు చేయడం వల్ల, మరోసారి వారి శ్రమ, సమయం శక్తి వెచ్చించవలసి వస్తుంది. అది ప్రజావనరుల వృథా అవుతుంది.
కోరిన సమాచారం మొత్తం ఇవ్వాలని, ఇటు వంటి అన్యాయాలను కేంద్ర కార్మిక మంత్రి దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. (రాథోడ్‌ వర్సెస్‌ ఈపీఎఫ్‌ఓ, కార్మిక మంత్రిత్వశాఖ CIC/BS/A/ 2015/001969 కేసులో 2017 మార్చి 10న ఇచ్చిన తీర్పు ఆధారంగా)


మాడభూషి శ్రీధర్‌,
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com

Advertisement
Advertisement