చమురు ముప్పు | Sakshi
Sakshi News home page

చమురు ముప్పు

Published Sat, Feb 4 2017 12:58 AM

చమురు ముప్పు

దాదాపు వారం రోజుల నుంచి చెన్నై సాగర తీరంలో సముద్ర జలాలతోపాటు కొట్టుకొస్తున్న చమురు తెట్టు మత్స్యకారులనూ, పర్యావరణవాదులనూ, ప్రజలనూ ఆందోళనకు గురిచేస్తోంది. కుటుంబసభ్యులతో, బంధు గణంతో, స్నేహితు లతో సాగరతీరాన్ని సందర్శించేవారూ... ఆరోగ్యాన్ని ఆశించి ఆ తీరంలో వ్యాహ్యా ళికి వెళ్లేవారూ అక్కడి గాలి మోసుకొస్తున్న చమురు వాసనతో ఇబ్బందిపడుతు న్నారు. మత్స్యకార గ్రామాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. గత నెల 28న చెన్నై సమీపంలోని ఎన్నోర్‌ ఓడరేవులో రెండు రవాణా నౌకలు పరస్పరం ఢీకొనడం పర్యవసానంగా చమురు లోడ్‌తో వెళ్తున్న ఒక నౌక ఒరిగి అందులోని 20 టన్నుల చమురు సముద్ర జలాల్లో కలిసింది. ఒలికిన చమురు ఇంతకన్నా చాలా రెట్లు ఎక్కువుంటుందన్నది పర్యావరణవేత్తల ఆందోళన. తీర రక్షక దళం సైతం ఆ మాటే చెబుతోంది.

నౌక బాధ్యులు చెప్పినకంటే కనీసం పది రెట్లు ఎక్కువగా చమురు లీక్‌ అయి ఉంటుందని అంచనా వేస్తోంది. చమురు తెట్టును పూర్తిగా తొలగించడానికి కనీసం మరో వారం రోజులు పడుతుందని అంటున్నది. అయితే ఈ ఉదంతంలో అందరినీ కలవరపెడుతున్న అంశం ఈ చమురు లీక్‌పైనా, దాని పర్యవసానా లపైనా ఓడ రేవు అధికారులు పాటిస్తున్న గోప్యత. ఇదేమంత పెద్ద సమస్య కాద న్నట్టు మంత్రి రాష్ట్ర శాసనసభలో మాట్లాడారు. అనుకోనిదేమైనా జరిగి ఇబ్బం దులు ఏర్పడినప్పుడు అందుకు సంబంధించిన సరైన సమాచారాన్ని ప్రజానీకానికి అందించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఆందోళనను ఉపశమింపజేయ డానికి వీలవుతుంది. దాచి ఉంచితే సమస్య తీరదు సరిగదా వదంతులు వ్యాపి స్తాయి. ఈ సంగతి అటు ప్రభుత్వానికీ, ఇటు ఓడ రేవు అధికారులకూ తెలియక పోవడం విచిత్రం. చమురు తెట్టు తొలగింపు మరో వారానికో, పది రోజులకో పూర్తి కావొచ్చు... షిప్పింగ్‌ కంపెనీ చెబుతున్నట్టు ఒలికిన చమురు 20 టన్నులే కావొచ్చు. కానీ అది ఆ ప్రాంతంలోని మత్స్యసంపదపైనా, ఇతర సముద్ర జీవులపైనా, అక్కడి వాతావరణంపైనా కలిగించే ప్రభావం చాలా ఎక్కువుంటుంది. తిరిగి సాధారణ స్థితి ఏర్పడటానికి సమయం పడుతుంది. సముద్రంపై వీచే గాలులు తరచు దిశ మార్చుకుంటాయి. అందుకనుగుణంగా కెరటాలు కూడా ఉంటాయి.

ఫలితంగా చమురు తెట్టు అన్ని దిశలకూ పోతుంది. ఒలికిన చమురు తీరానికి కొట్టుకుని వచ్చి నప్పుడు అక్కడి బురదనీటితో కలిసి అది మరింతగా పెరుగుతుంది. ఈ వారం రోజుల్లో తీర రక్షక దళం, వందలాదిమంది వలంటీర్లు కలిసి చమురు కలిసిన 600 టన్నుల అడుసును తీరం నుంచి తొలగించారు. కానీ ఇలా బకెట్లతో ఎన్ని రోజుల పాటు ఎన్ని వందలమంది నిర్విరామంగా పనిచేస్తే సాధారణ పరిస్థితులు ఏర్పడ తాయి? చమురు తెట్టు ఏర్పడినప్పుడు తొలగించడానికి ఉపయోగించే సాంకేతికత ఏమైనట్టు? అసలు జాతీయ విపత్తు నివారణ ప్రాధికార సంస్థ ఏం చేస్తున్నట్టు? ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అనుసరించాల్సిన విధివిధానాలపై అది మార్గ దర్శకాలు రూపొందించిందా? వాటిని ఓడ రేవు అధికారులకు అందజేసిందా? ఇంధనాన్ని మోసుకొచ్చే నౌకల భద్రత విషయంలో పటిష్టమైన నిబంధనలుం డాలి. వాటన్నిటినీ పాటించారా? ఇవన్నీ సాధారణ పౌరులను వేధిస్తున్న ప్రశ్నలు. ప్రమాదం జరిగిన వెంటనే చమురు తెట్టు తొలగింపునకు చర్యలు తీసుకుని ఉంటే నష్టం చాలా తక్కువుండేదని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.


చమురు లీక్‌ కావడం ఇది మొదటిసారేమీ కాదు. 1997లో ముంబై తీరంలో ఒక వాణిజ్య నౌక మునిగి దాదాపు 200 టన్నుల చమురు, 13,000 టన్నుల రసా యన ఎరువులు సముద్ర జలాల్లో కలిసిపోయాయి. 2006లో సముద్ర గర్భంలో చమురు వెలికితీస్తున్న ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించి ఇంధనమంతా దహించుకుపోయింది. 2009లో సైతం ముంబై తీరంలోనే భారీమొత్తంలో చమురు సముద్రంలో కలిసింది. 2014లో సుందర్‌బన్స్‌ ప్రాంతంలో రెండు నౌకలు ఢీకొని లక్షలాది లీటర్ల చమురు ఒలికిపోయింది. ప్రమాదం జరిగిన కాసేపటికే చేపలు, ఇతర జలచరాలు వేల సంఖ్యలో తీరానికి కొట్టుకొచ్చాయి. 2010లో మెక్సికో జలసంధి వద్ద బ్రిటిష్‌ పెట్రోలియం(బీపీ) సంస్థకు చెందిన చమురు క్షేత్రంలో భారీ పేలుడు సంభవించి 11మంది చనిపోవడంతోపాటు లక్షలాది టన్నుల చమురు సాగర జలాల్లో కలిసింది. ఆ ఘటన కలిగించిన నష్టం అంతా ఇంతా కాదు. మెక్సికో జలసంధి పొడవునా ఉన్న అమెరికా రాష్ట్రాల్లో పర్యావరణం ఘోరంగా దెబ్బతింది. చివరకు బీపీ సంస్థ మెడలు వంచి అయిదేళ్ల తర్వాత భారీ మొత్తంలో పరిహారం రాబట్టారుగానీ ఆ ఘటన కలిగించిన నష్టం అంతా ఇంతా కాదు. ఇలాంటి ఉదం తాలు కలిగించే బహుముఖ నష్టాలపై నౌకల్లోని సిబ్బంది మొదలుకొని ఓడరేవు సిబ్బంది, తీర రక్షక దళం సిబ్బంది వరకూ అందరికీ అవగాహన ఉంటే ఇంధనాన్ని మోసుకొచ్చే నౌకల విషయంలో వారెవరూ ఏమరు పాటును ప్రదర్శించరు.


 చమురు తెట్టు తెచ్చే సమస్యలు బహుళమైనవి. సముద్ర జలాల్లో కలిసిన చమురులో కొంత ఆ జలాలతోపాటే ఆవిరై వాతావరణంలో కలుస్తుంది. తినే తిండి, పీల్చేగాలి కలుషితమై అదంతా మనిషి శరీరంలో చేరుతుంది. చర్మవ్యాధులు కలుగుతాయి. మత్స్యకారులు సముద్రంలో ఎంతో లోపలకు వెళ్లి చమురు తెట్టు ప్రభావం పడని ప్రాంతంలో చేపలు పట్టాల్సి ఉంటుంది. చమురు లీక్‌ తర్వాత చెన్నైకు సమీపంలోని వివిధ మత్స్యకార గ్రామాల ప్రజలు నిస్సహాయంగా సము ద్రంకేసి చూడటం తప్ప వేటకు వెళ్లలేకపోతున్నారు. మనకు జాతీయ విపత్తు నివా రణ ప్రాధికార సంస్థతోపాటు కాలుష్య నివారణ సంస్థలున్నాయి. ఈ సంస్థలు ప్రమాదాలకు ఆస్కారం ఉండేచోట పనిచేసేవారికి వాటిపై అవగాహన పెంచాలి. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో, ఆ ప్రమాదాలను నివారించడానికి లేదా వాటి తీవ్రతను తగ్గించడానికి ఏం చేయాలో చెప్పాలి. అవన్నీ సక్రమంగా అమలు జరగటం లేదని చెన్నై సమీపంలో చోటుచేసుకున్న తాజా ప్రమాదం నిరూపిస్తోంది. దీన్నుంచి గుణపాఠం తీసుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడ వలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.

Advertisement
Advertisement