మరింత చేరువైన జపాన్‌ | Sakshi
Sakshi News home page

మరింత చేరువైన జపాన్‌

Published Sat, Nov 12 2016 12:47 AM

India signs Civil Nuclear energy cooperation agreement with japan

దౌత్య సంబంధాలకు ఎన్నో కోణాలుంటాయి. రెండు దేశాలు సన్నిహితమవుతు న్నాయంటే ఆ దేశాల్లో ఎవరో ఒకరితో విభేదాలున్న మరో దేశం అనుమాన దృక్కులతో చూస్తుంది. తన వంతుగా ఏం చేయాలో, తన అడుగు ఎటు పడాలో ఆలోచించుకుంటుంది. ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ దాంతో కుదుర్చుకున్న ఒప్పందాలను ఆ పొరుగునే ఉన్న చైనా జాగ్రత్తగానే గమ నిస్తుంది. ఈ పర్యటనలో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్న విధానానికి భిన్నంగా మన దేశంతో అది అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అమెరికాతో 2008లో భారత్‌కు పౌర అణు ఒప్పందం కుదిరిన అనంతరం... రష్యా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ తదితర దేశాలు కూడా ఆ పని చేశాక జపాన్‌ కూడా మనతో కలవడంలో ఆశ్చర్యమేముం దని అనిపించవచ్చు. అణు ఒప్పందం విషయంలో మిగిలిన దేశాలకూ, జపాన్‌కూ తేడా ఉంది. మనం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)పై సంతకం చేయ కపోయినా అమెరికా అందుకు మనతో ఒప్పందానికి అంగీకరించింది. మిగిలిన దేశాలు సైతం ఆ బాటలోనే వెళ్లాయి. కానీ 1945 ఆగస్టులో అమెరికా ప్రయోగించిన అణుబాంబుల కారణంగా మహోత్పాతాన్ని చవిచూసి ఎన్నో కష్టాలకోర్చి కోలు కున్న జపాన్‌ అంత సునాయాసంగా ఆ పని చేయలేకపోయింది. ఆరేళ్ల సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత నిరుడు మాత్రమే ఆ ఒప్పందం విషయంలో ఇరు దేశాల మధ్యా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. తుది ఒప్పందం ఖరారై సంత కాలు కావడానికి మరో ఏడాది సమయం పట్టింది. అది కూడా ఎన్నో నిబంధనలు, పరిమితులు విధించాకే! ఇవన్నీ ఎన్‌పీటీ నిబంధనలకు దాదాపు దగ్గరగా ఉన్నవే. ఎన్‌పీటీలో లేని ఒక దేశంతో జపాన్‌ అణు ఒప్పందానికి రావడం ఇదే మొట్టమొద టిసారి. వాస్తవానికి కొన్ని అణ్వస్త్ర వ్యతిరేక బృందాలతోపాటు జపాన్‌లోని విప క్షాలు, జపాన్‌ ప్రధాని షింజో అబే సొంత పార్టీ లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీలోని ఒక వర్గం ఇలా ఒప్పందం కుదుర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

పార్ల మెంటులో ఉన్న మెజారిటీతో ఆయన ఈ సవాళ్లను ఎటూ అధిగమిస్తారు. 2011లో ఫుకుషిమా అణుశక్తి కేంద్రంలో పెను ప్రమాదం సంభవించాక దేశంలోని అణుశక్తి కేంద్రాలను దశలవారీగా మూసేయాలని జపాన్‌ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తన దగ్గరున్న అధునాతన అణు సాంకేతికతను ఇతర దేశాలకు విక్రయిస్తే లాభ దాయకంగా ఉంటుందని ఆ దేశం భావిస్తోంది. తాజా ఒప్పందంతో జపాన్‌ పెట్టు బడులు దండిగా ఉన్న అమెరికాలోని జీఈ ఎనర్జీ వంటి సంస్థలు మన దేశంలో అణు విద్యుత్‌ కేంద్రాలు నెలకొల్పడం సులభమవుతుంది. అణు ఒప్పందంతో పాటు అణు సరఫరాదారుల బృందం(ఎన్‌ఎస్‌జీ)లో మన సభ్యత్వానికి జపాన్‌ గట్టి మద్దతునిచ్చింది. పాకిస్తాన్‌ను దృష్టిలో పెట్టుకుని మన సభ్యత్వానికి మోకాలడ్డు తున్న చైనాను ఈ పరిణామం పునరాలోచనలో పడేస్తుంది.

మన కోసం తన సంప్రదాయ విధానాన్ని సడలించుకోవడంలో జపాన్‌కు ఇత రత్రా అవసరాలు కూడా ఉన్నాయి. మరో రెండు నెలల్లో అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. తూర్పు చైనా సముద్రం దీవుల విషయంలో చైనాతో ఏర్పడ్డ వివాదాలపై ప్రస్తుత అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వెన్నుదన్నుగా నిలిచిన స్థాయిలో ట్రంప్‌ ఉంటారా, ఉండరా అన్న అనుమానాలు జపాన్‌కు ఉన్నాయి. ఆయన అమెరికా–జపాన్‌ భద్రతా ఒప్పందాన్ని తిరగదోడాల నుకుంటే సమస్యలొస్తాయి. అప్పుడు ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో పెరుగుతున్న చైనా పలుకుబడిని ఎదుర్కొనడానికి దృఢమైన ప్రాంతీయ మిత్రుల అవసరం ఉంటుంది. దానికితోడు వినియోగ వస్తువుల రంగంలో చైనా, దక్షిణ కొరియాల నుంచి ఆ దేశానికి తీవ్రమైన పోటీ ఉంది. అత్యంత వేగంతో నడిచే బుల్లెట్‌ రైళ్ల ప్రాజెక్టులో సైతం చైనాను ఎదుర్కోవడం జపాన్‌కు కష్టంగానే ఉంది. నిరుడు ఇండొనేసియాలో ఆ ప్రాజెక్టును చైనా తన్నుకుపోయింది. ఇటు మన దేశానికి కూడా జపాన్‌తో సాన్నిహిత్యం అవసరం పెరుగుతూనే ఉంది. మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా మార్చాలని మోదీ సంకల్పిస్తున్నారు.


స్మార్ట్‌ సిటీ ప్రణాళికలు రూపొందించారు. అందుకు జపాన్‌ పెట్టుబడులు, సాంకేతి కత దండిగా అవసరమవుతాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా స్తంభించిపోయిన స్థితిలో ఉన్న ఆర్ధిక వ్యవస్థను ఉత్తేజపరచడానికి జపాన్‌కు ఇదొక అవకాశం. మనది పెద్ద మార్కెట్‌ కావడం, మధ్యతరగతి ఎక్కువగా ఉండటం దానికి కలిసొచ్చే అంశం. ఇవిగాక చైనాతో మనకున్న సరిహద్దు వివాదంతోపాటు తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో, హిందూమహా సముద్ర ప్రాంతంలో దాని దూకుడు ఆందోళన కర స్థాయిలో ఉంది.

ఇప్పటికే మన దేశంతో కుదుర్చుకున్న 507 కిలోమీటర్ల ముంబై–అహ్మదా బాద్‌ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టు మోదీ పర్యటనతో మరింత ముందుకెళ్లింది. భారత్‌– జపాన్‌ బంధం బలంగానే ఉన్నా ద్వైపాక్షిక వాణిజ్యం ఇప్పటికైతే చెప్పు కోదగ్గ స్థాయిలో లేదు. 2015–16 ఆర్ధిక సంవత్సరానికి ఇరు దేశాలమధ్యా 1,450 కోట్ల డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 6.47 శాతం తక్కువ. దీనికి భిన్నంగా చైనాతో మన వాణిజ్యం విలువ 7,000 కోట్ల డాలర్లు. జపాన్‌–చైనాల మధ్య 35,000 కోట్ల మేర వాణిజ్యం సాగుతోంది. మొత్తంగా జపాన్‌ విదేశీ వాణిజ్యంలో మన వాటా కేవలం ఒకే ఒక్క శాతం. ద్వైపా క్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవడం, ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో పర స్పర ప్రయోజనాల పరిరక్షణ భారత్‌–జపాన్‌ల దౌత్య బంధంలో కీలక అంశం. అయితే ఈ పర్యటనలో నావికా దళం వినియోగించే యూఎస్‌–2ఐ యాంఫిబి యాస్‌ విమానాల విషయంలో ఒప్పందం కుదరొచ్చునని భావించినా అది వాయిదా పడింది. ఈ అంశంలో మన అవసరాలను మదింపు వేశాక తుది నిర్ణయం తీసుకోవచ్చునని చెబుతున్నారు. మొత్తానికి భారత్‌–జపాన్‌ల మైత్రి రాగల కాలంలో మరింత ఉన్నత స్థితికి చేరడానికి నరేంద్ర మోదీ పర్యటన దోహదపడింది.

Advertisement
Advertisement