దెబ్బతిన్న గుండెకు బంగారు ‘ప్యాచ్’ | Sakshi
Sakshi News home page

దెబ్బతిన్న గుండెకు బంగారు ‘ప్యాచ్’

Published Thu, Oct 2 2014 4:27 PM

దెబ్బతిన్న గుండెకు బంగారు ‘ప్యాచ్’

జెరూసలెం: బంగారం.. అలంకరించుకుంటే మన అందాన్ని పెంచడమే కాదు.. అవసరమైతే ప్రాణాలను కాపాడడానికీ తోడ్పడుతుంది. గుండెపోటు వంటి వ్యాధుల కారణంగా దెబ్బతిన్న గుండెను.. బంగారం నానోకణాల సహాయంతో రూపొందించిన ప్యాచ్ తిరిగి బాగుచేస్తుందట. మన శరీరంలోని జీవకణజాలాన్ని తీసుకుని, దానిని బంగారం నానోకణాలతో కలిపి సరికొత్త కణజాలాన్ని అభివృద్ధి చేయవచ్చని దానిని దెబ్బతిన్న గుండె కణజాలం స్థానంలో అమర్చవచ్చని ఇజ్రాయెల్‌కు చెందిన టెల్ అవీవ్ యూనివర్సిటీ బయోటెక్నాలజీ, మెటీరియల్ సైన్స్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ మేరకు ఒక సరికొత్త విధానాన్ని వారు అభివృద్ధి చేశారు. ముందుగా వ్యాధిగ్రస్తుడి శరీరం నుంచి కొంత జీవకణజాలాన్ని తీసుకుని, దానికి బంగారం నానోకణాలను కలిపి ప్రయోగశాలలో అభివృద్ధి చేస్తారు. గుండెపై దెబ్బతిన్న కణజాలాన్ని తొలగించి.. ఆ స్థానంలో ఈ అభివృద్ధి చేసిన కణజాలాన్ని ప్యాచ్‌లాగా అమర్చుతారు. బాధితుడి శరీరం నుంచి సేకరించిన కణాలతోనే అభివృద్ధి చేయడం వల్ల దీనిని రోగనిరోధక వ్యవస్థ తిరస్కరించే అవకాశం కూడా లేదని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ టల్ డివిర్ తెలిపారు.

Advertisement
Advertisement