బీజేపీ పాదయాత్ర ఉద్రిక్తం | Sakshi
Sakshi News home page

బీజేపీ పాదయాత్ర ఉద్రిక్తం

Published Fri, Sep 4 2015 2:23 AM

బీజేపీ పాదయాత్ర ఉద్రిక్తం

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి డిమాండ్‌తో మహా పాదయాత్ర
- అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపైనే నేతల బైఠాయింపు
- పోలీసులు, కార్యకర్తల తోపులాట...
- నేతల అరెస్టు
హన్మకొండ:
రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం కంతనపల్లి నుంచి దేవాదుల వరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పాదయాత్రను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తొలుత బీజేపీ నేతలు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, నెహ్రూ యువ సంఘటన్ జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్, మరికొందరు నేతలు కంతనపల్లి ప్రాజెక్టు వద్ద మహా పాదయాత్ర ప్రారంభించారు.

దాదాపు ఏడు కిలోమీటర్ల దూరం సాగిన పాదయాత్ర ఏటూరునాగారం మండలం ఏటూరు గ్రామం సమీపంలోకి రాగానే పోలీసులు అడ్డుకొన్నారు. ఈ పాదయాత్రకు అనుమతి లేదని, భద్రతా కారణాల రీత్యా దానిని నిలిపేయాలని స్పష్టం చేశారు. దీంతో బీజేపీ నాయకులు అక్కడే బైఠాయించారు. ఈ సమయంలో కిషన్‌రెడ్డిని, పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగి, ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు కార్యకర్తలను దాటుకుని నేతలను ఏటూరునాగారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
 
నిరాశ, నిస్పృహల్లో ప్రజలు: కిషన్‌రెడ్డి
కేసీఆర్ పాలనతో ప్రజలు నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 69 ఏళ్ల కాంగ్రెస్ పాలనతోనే తెలంగాణకు ఈ దుస్థితి వచ్చిందని పేర్కొన్నారు. సాగు, తాగునీరుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బుధవారం ఒకే రోజు 8 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకర విషయమని పేర్కొన్నారు. తెలంగాణ వస్తే బీడు భూములు సస్యశ్యామలం అవుతాయని, ఉద్యోగాలు వస్తాయని ప్రజలు ఆశించారని.. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ ఆశలను వమ్ము చేసిందని విమర్శించారు. ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెబుతూ పబ్బం గడుపుకుంటోందని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్టులపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.

Advertisement
Advertisement