తీరనున్న తాగునీటి కష్టాలు !
శంషాబాద్: గ్రామాల్లో తాగునీటి కష్టాలు తీరనున్నాయి. సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించిన వాటర్ గ్రిడ్ పథకంతో సమస్యలకు అడ్డుకట్ట పడనుంది. ఈ పథకంతో మండలంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తొలగనున్నాయి. సర్కారు ఆదేశాలతో గ్రామీణ నీటి సరఫరా విభాగం వాటర్‌గ్రిడ్‌కు సంబంధించిన సర్వేను పూర్తి చేసి నివేదికను పంపేందుకు సిద్ధమైంది. మండలంలో మొత్తం మూడు పాయింట్లుగా నీటి సరఫరా చేయడానికి ఇందులో ప్రతిపాదించారు.
నాగార్జునసాగర్ నుంచి కల్వకుర్తి, ఆమన్‌గల్ మీదుగా వచ్చే నీటి సరఫరాకు మహేశ్వరం మండలం హర్షగూడలో ప్రధాన పంపింగ్‌పాయింట్‌గా నిర్ణయించారు. శంషాబాద్ మండలంలోని పెద్ద గోల్కొండ, రాళ్లగూడ, సరూర్‌నగర్ మండలంలోని పహడిషరీఫ్ పాయింట్లుగా నీటి సరఫరా చేయడానికి ప్రణాళికలు రూపొందించారు.
ప్రణాళిక వ్యయం సుమారు రూ.51 కోట్లు కావచ్చనే అంచనాలను కూడా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు రూపొందించారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణం చేయాల్సిన ఒవర్‌హెడ్ ట్యాంకులు, సంపులకు మరో రూ.10 కోట్ల అంచనాను ఇందులో పొందుపర్చారు. శంషాబాద్ మండలానికి ప్రతిరోజు 15 లక్షల 80 వేల లీటర్ల నీటి సరఫరా అవసరాన్ని గుర్తించి ఈ అంచనాను సిద్ధం చేసినట్లు సమాచారం.
మెట్రోవాటర్ ఇక అంతే..
వాటర్ గ్రిడ్ పథకాన్ని పట్టాలెక్కించే యోచనలో ఉన్న సర్కారు జలమండలితో శంషాబాద్‌కు కృష్ణా నీటిని సరఫరా చేయాలనే ప్రతిపాదనలను దాదాపు విరమించుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. శంషాబాద్ పట్టణానికి రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్‌దేవ్‌పల్లి రిజర్వాయర్ నుంచి సరఫరా చేయడానికి పైప్‌లైన్ పనులు పూర్తి చేసి కృష్ణా నీటిని సరఫరా చేసినా అది మూన్నాళ్లముచ్చటగానే మారింది. వన్‌టైమ్ కనెక్షన్ డిపాజిట్ కింద జలమండలికి చెల్లించాల్సిన రూ.13 కోట్లు ప్రభుత్వం నేటికీ చెల్లించకపోవడంతో నీటి సరఫరాను నిలిపివేశారు.
ప్రస్తుతం వాటర్‌గ్రిడ్ పథకంలో జల్లపల్లి మీదుగా వచ్చే పైప్‌లైన్‌కు పహడిషరీఫ్ పాయింట్‌గా నీటి సరఫరా చేయాలనే యోచనలో అధికారులున్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో జలమండలి నుంచి శంషాబాద్‌కు నీటి సరఫరా అయ్యే అవకాశాలు దాదాపు ముగిసినట్లేననే వాదనలు వినిపిస్తున్నాయి.