ఈ గెలుపు బాధ్యత పెంచింది | Sakshi
Sakshi News home page

ఈ గెలుపు బాధ్యత పెంచింది

Published Sun, Feb 7 2016 12:14 AM

ఈ గెలుపు బాధ్యత పెంచింది - Sakshi

 హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సాధించిన అఖండ విజయం ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని ఆరుగురు టీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో కలిసి మారేడ్‌పల్లిలోని తన నివాసంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చడం వల్లే గ్రేటర్ ప్రజలు చరిత్రాత్మక తీర్పునిచ్చారని అభిప్రాయపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోను తమ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తుందన్నారు. నగరానికి నిరంతర విద్యుత్ సరఫరా, మంచినీటి సమస్య పరిష్కారానికి రెండు రిజర్వాయర్ల నిర్మాణాన్ని అతి త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచడంతో పాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలూ నిర్విరామంగా కొనసాగిస్తామన్నారు.

 ఉప ఎన్నికలపై ఏమీ చెప్పలేను తాను స్పీకర్‌కు రాజీనామా సమర్పించానని... దీనిపై ఆయన నిర్ణయం మేరకు చర్యలుంటాయని ఓ ప్రశ్నకు సమాధానంగా తలసాని చెప్పారు. ఉప ఎన్నికల విషయమై తానేమీ చెప్పలేనన్నారు. పక్క రాష్ట్రం వాళ్లకు ఇక్కడేం పని?
పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే తానే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని చెప్పుకోవడం ఆపేయాలని తలసాని సూచించారు. ఇక్కడేం జరిగినా అరగంటలో వస్తానని చెప్పిన ఆ ముఖ్యమంత్రి తన సొంత రాష్ట్రంలోని తునిలో హింసాత్మక సంఘటనలు జరిగితే మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ హైదరాబాద్‌లోనే తిష్ట వేశారని విమర్శించారు.

భవిష్యత్‌లో హైదరాబాద్ అభివృద్ధికి వారి సహకారం అవసరం లేదన్న రీతిలో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు తామే నిధులిస్తున్నామని చెప్పిన బీజేపీ నేతలు ప్రగల్భాలు ఆపాలని హితవు పలికారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటూ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందిస్తూ... కాంగ్రెస్ దైన్య స్థితికి ఆ పార్టీలో ముఖ్యమంత్రి రేసులో ఉన్న 30 మంది బడా నేతలను నిలదీయాలని సూచించారు. ప్రజా సమస్యలను విస్మరించిన పార్టీలకు ఇదే తరహా ఫలితాలు వస్తాయన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు కొలను లక్ష్మీ బాల్‌రెడ్డి, ఎన్.శేషుకుమారి, ఉప్పాల తరుణి నాయి, కె.హేమలత, అత్తేలి అరుణ శ్రీనివాస్ గౌడ్, ఆకుల రూప తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement