‘చెత్త’ డబ్బాలొస్తున్నాయ్! | Sakshi
Sakshi News home page

‘చెత్త’ డబ్బాలొస్తున్నాయ్!

Published Tue, Oct 13 2015 11:18 PM

Special arrangements for the collection of garbage

తడి.. పొడి చెత్త సేకరణకు  {పత్యేక ఏర్పాట్లు
సర్కిళ్లకు డస్ట్‌బిన్‌ల చేరిక త్వరలో పంపిణీ

 
హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఇళ్ల నుంచి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు ఇంటింటికీ రెండు రంగుల డస్ట్‌బిన్‌లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమయింది. దసరా రోజున వీటి పంపిణీని లాంఛనంగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేరోజు ప్రారంభం కానున్న బోయిగూడ ఐడీహెచ్‌కాలనీలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రజలకు వాటిని అందజేయనున్నారు. వారితోపాటు తొలిదశలో సర్కిల్‌కు దాదాపు 50 వేల వంతున చెత్త డబ్బాలను పంపిణీ చేయనున్నారు. మొత్తం 24 సర్కిళ్లకు వెరసి దాదాపు 12 లక్షల డబ్బాలు పంపిణీ చేయనున్నారు.  ఇందుకుగాను ఉత్పత్తి సంస్థల నుంచి బిన్‌లను ఆయా సర్కిళ్లకు చేరుస్తున్నారు. ఇప్పటికే కొన్ని సర్కిళ్లకు ఇవి చేరాయి. మిగతా సర్కిళ్లకు త్వరలోనే చేరనున్నాయి.  నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు, రోడ్ల మీద చెత్త కనబడకుండా చేసేందుకు, త డి..పొడి చెత్తలను ఇంటినుంచే వేర్వేరుగా వేసేందుకు రెండు రంగుల డబ్బాలను అందజేస్తామని తొలివిడత స్వచ్ఛ హైదరాబాద్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు.

హామీకనుగుణంగా జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ చర్యలకు దిగారు. చెత్తడబ్బాల పంపిణీ కోసం జీహెచ్‌ఎంసీ నిధులు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అనుమతించడంతో వెంటనే రంగంలోకి దిగి, టెండర్లు ఖరారు చేసి, ఆయా సంస్థలకు ఉత్పత్తి బాధ్యతలప్పగించారు. దీంతోపాటు చెత్త రవాణా ప్రదేశాలను ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఇంకా ఈ చెత్త డబ్బాలను ఇంటింటినుంచి ట్రాన్స్‌ఫర్ స్టేషన్లకు తరలించేందుకుగాను స్థానిక యువతకు ఆటోట్రాలీలు అందజేయనున్నారు.
 
 

Advertisement
Advertisement