సఫాయిల సమస్యల్ని పరిష్కరించాలి | Sakshi
Sakshi News home page

సఫాయిల సమస్యల్ని పరిష్కరించాలి

Published Sun, Aug 30 2015 3:42 AM

solve Sanitation workers problems demands tsks

  • స్పందించకుంటే సెప్టెంబర్ 5 తర్వాత పెద్దల ఇళ్ల ఎదుట ఆందోళన: టీఎస్‌కేఎస్
  •  సాక్షి, హైదరాబాద్: 'మేం పనిచేస్తేనే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలకు, సామాన్యులకు ఆరోగ్యం. అటువంటి మమ్మల్ని రోడ్ల పాలు చేస్తారా.. తస్మాత్ జాగ్రత్త, మా తడాఖా ఏమిటో ముందు ముందు చూస్తారు. 'అని తెలంగాణ సఫాయి కార్మిక సంఘం హెచ్చరించింది.  శనివారం రవీంద్రభారతిలో తెలంగాణ సఫాయి కార్మిక సంఘం(టీఎస్‌కేఎస్) ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సఫాయి కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల కృపాదానం మాట్లాడుతూ ఇప్పటికైనా వెంటనే మా సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. 'సఫాయిలు సిపాయిల్లాంటి వారు. డాక్టర్ రోగం వచ్చిన తర్వాత నయం చేస్తారు. కానీ సఫాయిలు రోగం రాకుండా చూస్తారు.'అని అన్నారు. కొందరు యూనియన్ నేతలు తమ స్వార్థం కోసం ఉద్యమాలు చేయించి రెండు వేల మంది సఫాయిలను రోడ్లపాలు చేశారని విచారం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సోమవారం సీఎం కేసీఆర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్‌కు వినతి పత్రాలు అందజేస్తామన్నారు. వారు స్పందించకుంటే సెప్టెంబర్ 5వ తేదీ తర్వాత యూనియన్ లీడర్ల ఇంటి ముందు, జీహెచ్‌ఎంసీ కమిషనర్, హోంమంత్రి ఇంటి ఎదుట డప్పులు కొట్టి ఆడిపాడుతామని హెచ్చరించారు. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు.

    రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింప చేయాలని, రుణాలు మంజూరు చేయాలని సభ తీర్మానించింది. కార్యక్రమంలో తెలంగాణ సఫాయి కర్మ్‌చారిస్ చైర్మన్ మస్కు జాన్‌సన్, వివిధ జిల్లాల కార్మిక నాయకులు బాలక్రిష్ణ(జీహెచ్‌ఎంసీ), ఎడ్వార్డ్(కరీంనగర్), రాజు(వరంగల్), ఖమ్మం(సంగయ్య), ఎఫ్రహీమ్(ఆదిలాబాద్), అబ్రహం(నిజామాబాద్), స్టీఫెన్(నల్లగొండ) తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement