మహిళా రక్షణ కోసమే షీ టీంలు | Sakshi
Sakshi News home page

మహిళా రక్షణ కోసమే షీ టీంలు

Published Tue, Mar 7 2017 7:56 PM

మహిళా రక్షణ కోసమే షీ టీంలు

వనపర్తి క్రైం : సమాజంలో మహిళలకు ప్రత్యేక భద్రత కల్పించేందుకు షీ టీంలను ఏర్పాటు చేశామని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని చెప్పారు. అడుగడుగునా వివక్షకు గురవుతున్న మహిళలు తమలాంటి మనుషులేనన్న భావన సమాజంలో రావాలన్నారు. అప్పుడే వివక్ష తగ్గుతుందని తెలిపారు. వివిధ రంగాల్లో పని చేసేందుకు, చదువుకునేందుకు బయటకు వచ్చే బాలికలు, మహిళలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో షీ టీంలను ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. ఇప్పటికీ జిల్లాలో 302మందికి షీ టీంల ద్వారా కౌన్సెలింగ్‌ ఇచ్చామన్నారు.
 
వివక్ష చూపించే వారికి మా షీ టీం సభ్యులు కౌన్సెలింగ్‌ ఇస్తారన్నారు. తీవ్రతను బట్టి కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ.. మహిళలు, పురుషులతో సమానమని చాటిచెప్పేందుకు  పోలీస్‌శాఖ ద్వారా జనమైత్రి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతంలో సమానత్వంపై అవగాహన కార్యక్రమాలు ఎస్పీ నిర్వహిస్తున్నారు.
 
మహిళలకు చదువెంతో ముఖ్య: నేటి సమాజంలో పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో మహిళలు రాణించాలని ఎస్పీ అన్నారు. ఇది జరగాలంటే ప్రతి మహిళ తప్పకుండా చదువుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలకు చైతన్యం కేవలం చదువుతోనే వస్తుందన్నారు. ఇందిరాక్రాంతి పథం, మెప్మా శాఖలు ఏర్పాటు చేసిన మహిళా సంఘాల్లో చేరికతో ఆర్థిక సాయం అందుతుంది. తద్వారా స్వయం ఉపాధిలోనూ రాణించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా ఎదిగిన వారున్నారు. వారిలో పలువురు ప్రజాప్రతినిధుల చేతులమీదుగా అవార్డులు అందుకున్న సంఘటనలూ ఉన్నాయని ఎస్పీ తెలిపారు.
 

Advertisement
Advertisement