మక్క పంచాయితీ మొదటికే! | Sakshi
Sakshi News home page

మక్క పంచాయితీ మొదటికే!

Published Wed, Oct 29 2014 1:21 AM

మక్క పంచాయితీ మొదటికే! - Sakshi

నాగర్‌కర్నూల్:
 నాగర్‌కర్నూల్ సింగిల్‌విండోలో కొనుగోలుచేసిన మొక్కజొన్న పంచాయితీ మొదటికే వచ్చింది. నాణ్యత పేరుతో జడ్చర్ల గోదాంలో తిరస్కరించిన సుమారు 9వేల బస్తాల మొక్కజొన్న కొనుగోలు వివాదం ఓ కొలిక్కిరాలేదు. తాము అమ్మిన మక్కను తిరిగి తీసుకునేది లేదని రైతులు, నాణ్యత లేని మొక్కజొన్న తీసుకోబోమని మార్క్‌ఫెడ్ డీఎం తేల్చిచెప్పడంతో పీఠముడి వీడటం లేదు.

ఈ వివాదాలతో తమకు సంబంధం లేదని.. లారీలను అన్‌లోడ్ చేయకపోతే ఆందోళన చేస్తామని మంగళవారం ట్రాన్స్‌పోర్టు యజమానులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో సింగిల్‌విండో చైర్మన్, వ్యాపార సంఘ నేతలను మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు పిలిచి చర్చలు జరిపారు.

 ఏం జరిగిందంటే..
 కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఆర్డీఓ వీరారెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 21 స్థానిక మార్కెట్‌లో రైతుల నుంచి సుమారు రూ.60లక్షల విలువైన 16వేల బస్తాల మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వాటిని మరుసటిరోజు జడ్చర్లలోని మార్క్‌ఫెడ్ గోదాంకు పంపించారు. ఇందులో 9వేల(నాలుగు లారీల లోడ్) బస్తాల ధాన్యం నాణ్యవంతంగా లేదని అధికారులు తిరస్కరించారు. కాగా, ఈ మొక్కజొన్నను నాటకీయ పరిణామాల మధ్య నాగర్‌కర్నూల్ మార్కెట్ షెడ్డుకు చేర్చారు.

మక్కలను ఆరబెట్టి తిరిగి పంపించాలన్న మార్క్‌ఫెడ్ అధికారుల సూచనతో రైతులను పిలిచి వారికి అప్పగించాలని సింగిల్‌విండో పాలకవర్గం భావించింది. ఇందుకు రాబోమని రైతులు తెగేసి చెప్పడం, ఒకవేళ వారొస్తే శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందన్న భావనతో వ్యాపారుల సమక్షంలో షెడ్డులోనే నిల్వచేయాలని నిర్ణయించారు.

అన్‌లోడింగ్ ఆపాలని, ఈ విషయమై ఎమ్మెల్యే సీఎంతో మాట్లాడుతున్నారని ఆయన అనుచరులు కొందరు సింగిల్‌విండో చైర్మన్‌ను సూచించడంతో ఆ ప్రయత్నం విరమించారు. దీంతో మొక్కజొన్న ధాన్యం తిరిగి మార్క్‌ఫెడ్ గోదాంకు చేరుతుందని, సమస్య కొలిక్కి వచ్చినట్లేనని అంతా భావించారు. మంత్రి హరీష్‌రావు గోదాం డీఎంతో మాట్లాడి సమస్య పరిష్కరించారని ఆర్డీఓ వీరారెడ్డి సింగిల్‌విండో చైర్మన్‌కు ఫోన్‌చేసి చెప్పారు. అయితే డీఎం ఫోన్‌చేసి ఎప్పటిలాగే మొక్కజొన్నను తిరిగి ఆరబెట్టి శుభ్రం చేసి పంపించాలని, అంతవరకు నాగర్‌కర్నూల్ మార్కెట్‌లోనే నిల్వ చేసుకోమ్మని తేల్చిచెప్పడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది.

  సీఈఓకు మెమో జారీ
 21న రాత్రి కొనుగోలు చేసిన మొక్కజొన్న వివాదానికి సంబంధించి ప్రాథమిక సహకార పరపతి సంఘం (సింగిల్‌విండో) సీఈఓ, క్యాషియర్‌లకు సింగిల్‌విండో చైర్మన్ వెంకట్రాములు మెమో జారీచేశారు. నిబంధనల మేరకు ఒకసారి టెండర్ వేసిన తర్వాత తిరిగి రాత్రివేళ సంఘం అనుమతి లేకుండా టెండర్లు వేసి నాణ్యత లేని మొక్కజొన్న కొనుగోలుచేసి నష్టం కలిగించే విధంగా వ్యవహరించినందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా.. జిల్లా కోఆపరేటివ్ అధికారికి లేఖరాశారు.
 
 కేసుపెడితే కోర్టులో తేల్చుకుంటాం
 వారం రోజులుగా మక్కల లోడ్‌తో లారీలు నిలపడం వల్ల లారీల టైర్లు పాడవుతున్నాయని, వ్యాపారులు, సింగిల్‌విండో, మార్క్‌ఫెడ్ వారెవ్వరూ అన్‌లోడ్ చేసుకోకపోతే తామే అమ్ముకుంటామని, కేసు పెడితే కోర్టులోనే తేల్చుకుంటామని లారీ ఓనర్ల సంఘం కార్యదర్శి ఎండీ. ఖలీలుర్ రష్మన్, ఉపాధ్యక్షుడు దయాకర్‌రెడ్డి హెచ్చరించారు. నెలాఖరులోగా తాము వాహనాల ట్యాక్స్‌లు చెల్లించాల్సి ఉందని, ఫెనాల్టీ పడితే ఎవరు భరించాలంటూ ప్రశ్నించారు. సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ రాజేశ్వర్‌గౌడ్ సూచన మేరకు వ్యాపారులు లారీ అద్దె చెల్లించేందుకు అంగీకరించడంతో ఓనర్లు అన్‌లోడ్ చేసేందుకు అంగీకరించారు.

Advertisement
Advertisement