ఒబామా.. గోబ్యాక్! | Sakshi
Sakshi News home page

ఒబామా.. గోబ్యాక్!

Published Sun, Jan 25 2015 3:39 AM

Obama .. gobyak!

సాక్షి, బృందం: గణతంత్ర వేడులకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రాకను నిరసిస్తూ పలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం  జిల్లాలో పలుచోట్ల నిరసనలు కొనసాగాయి. ‘ఒబామా.. గోబ్యాక్!, సామ్రాజ్యవాదం నశించాలి’ అంటూ నినదించారు. నారాయణపేటలో పీడీఎస్‌యూ-పీవైఎల్ ఆధ్వర్యంలో ఒబామా దిష్టిబొమ్మను దహనంచేశారు. ఈ సందర్భంగా పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి కాశీనాథ్ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలపై అమెరికా తన ఆధిపత్యం కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తూ చిన్నదేశాలపై యుద్ధం చేస్తుందన్నారు.

వనపర్తిలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఒబామా దిష్టిబొమ్మను దహనం చేశారు. కొల్లాపూర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు స్వదేశీ జపం చేసిన మోడీ ఇప్పుడు పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. బహుళజాతి కంపెనీలకు దేశాన్ని తాకట్టుపెట్టేవిధంగా బీజేపీ ప్రభుత్వ కార్యక్రమాలు సాగుతున్నాయన్నారు.

అలాగే జిల్లాకేంద్రంలో ఒబామా రాకను నిరసిస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. మూడో ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికే ఒబామా పర్యటిస్తున్నారని అన్నారు. ప్రధాని మోడీ సామ్రాజ్యవాదం ముందు మోకరిల్లారని ధ్వజమెత్తారు.

Advertisement
Advertisement