చేను చిన్నబోతోంది | Sakshi
Sakshi News home page

చేను చిన్నబోతోంది

Published Sun, Jul 5 2015 1:16 AM

చేను చిన్నబోతోంది

* పది రోజులుగా వానల్లేక వాడిపోతున్న పంటలు
* ముఖం చాటేస్తున్న రుతుపవనాలు

* లక్షల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న పంటలపై ప్రభావం
* నాలుగైదు రోజుల్లో వర్షాలు పడకుంటే పరిస్థితి దుర్భరమే
* 15 రోజుల తర్వాతే వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణశాఖ
* ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం.. ఆందోళనలో అన్నదాతలు

 
సాక్షి, హైదరాబాద్: చేనులో మొలక వాడిపోతోంది. రైతన్న ఆశల పంటపై వరుణుడు కరుణ చూపడం లేదు. రుతుపవనాలు ముఖం చాటేయడంతో రాష్ట్రంలో ఎండలు మళ్లీ మండిపోతున్నాయి. తొలుత మురిపించిన వర్షాలు పది రోజులుగా తగ్గుముఖం పట్టాయి. దీని ప్రభావం గతనెలలో వేసిన పంటలపై పడింది. లక్షలాది ఎకరాల్లో వేసిన పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి. వర్షాలు లేకపోవడం, ఎండలు మండడంతో మొక్కలు వాలిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. మరో నాలుగైదు రోజుల్లోగా వర్షాలు కురవకుంటే పంటలు ఎండిపోయి చేతికందడం కష్టమేనని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి తలెత్తితే మరోసారి విత్తనాలు చల్లుకోవాల్సిన దు స్థితి రావచ్చు. దీంతో అన్నదాత ఆందోళనలో పడ్డాడు.
 
జూన్‌లో మురిపించి..
గత నెలలో రుతుపవనాలు సకాలంలోనే వచ్చాయి. తెలంగాణవ్యాప్తంగా జూన్‌లో సగటు వర్షపాతం 55 శాతం అదనంగా నమోదైంది. దీంతో రైతులు చేలల్లో విత్తనాలు చల్లారు. ప్రభుత్వ తాజా లెక్కల ప్రకారమే 50 శాతం వ్యవసాయ పంటల సాగు జరిగింది. ఖరీఫ్ సీజన్‌లో సాధారణంగా 1.03 కోట్ల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా... శనివారం నాటికి ఏకంగా 52.29 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో ఆహారధాన్యాల సాగు 13.05 లక్షల ఎకరాలు, పత్తి సాగు 28.12 లక్షల ఎకరాల్లో జరిగింది. సోయాబీన్, పసుపు, వేరుశనగ తదితర పంటల సాగు కూడా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం పంటలన్నీ రెండు మూడు ఆకులు వచ్చి మొక్క దశలో ఉన్నాయి.

సరిగ్గా ఇప్పుడే వర్షాలు నిలిచిపోడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గతనెల 25 నుంచి ఈనెల ఒకటో తే దీ వరకు 70 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఉష్ణోగ్రతలు పెరిగాయి. గత 24 గంటల్లో మెదక్ జిల్లాలో సాధారణం కంటే 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. అన్ని జిల్లాల్లోనూ 2 నుంచి ఐదు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చాలాచోట్ల పంటలు వాడిపోతున్నాయి. దాదాపు 72 శాతం వరకు పంటలు వాడిపోతున్నాయని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో పత్తి, మొక్కజొన్న, జొన్న, పెసర తదితర పంటలున్నాయి.
 
15 రోజుల తర్వాతే వర్షాలు
సాధారణంగా జూన్‌లో రుతుపవనాలు వచ్చినా... జూలై, ఆగస్టు నెలల్లోనే అధికంగా వర్షాలు కురుస్తాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అల్పపీడనం వస్తే తప్ప ఈనెల మూడో వారం వరకు వర్షాలు ఉండవని హైదరాబాద్ వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. మూడో వారం తర్వాతే వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీర్ఘకాలిక వాతావరణ అంచనా ప్రకారం ఈసారి ఆగస్టులో భారీ వర్షాలు కురుస్తాయని ఆయన చెప్పారు. ఈలోపు ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్నారు. ప్రస్తుతం వాతావరణ అనుకూలంగా లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం వచ్చే నాలుగైదు రోజుల వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుందని స్పష్టంచేశారు. దీంతో పంటలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తోంది.

Advertisement
Advertisement