సింహం సింగిల్‌గానే ఉంటుంది: కేటీఆర్‌ | Sakshi
Sakshi News home page

‘హరీశ్‌రావుతో నాకెలాంటి విభేదాలు లేవు’

Published Wed, Aug 9 2017 6:06 PM

సింహం సింగిల్‌గానే ఉంటుంది: కేటీఆర్‌ - Sakshi

హైదరాబాద్‌ :  తెలంగాణ‌లో 2019 ఎన్నిక‌ల్లో కూడా అధికార టీఆర్ఎస్‌దేనని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఆయన బుధవారం మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ కూడా అదే విషయాన్ని చెప్పారని కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీలో ఇప్పుడున్న ఐదుగురు ఎమ్మెల్యేలు గెలవడమే కష్టం అని, అయితే హైదరాబాద్‌లో మాత్రం బీజేపీనే ప్రతిపక్షమన్నారు. రాజధానిలో కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క సీటు రాదని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ, వామపక్షాల ఊసే లేదని, సింహం సింగిల్‌గానే ఉంటుందన్నారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జానారెడ్డి అందరూ తమకు రాజకీయ శత్రువులేనన్నారు.

ఇక హరీష్‌రావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని కేటీఆర్‌ స్పష్టం చేశారు. అన్ని విషయాలలోనూ తమ ఇద్దరికీ క్లారిటీ ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు. తమకంటే కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన అన్నారు. కాగా ఈ ఏడాదే హైదరాబాద్‌ మెట్రో సర్వీసులను ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నామని, ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానిస్తామని కేటీఆర్‌ తెలిపారు. ప్రాజెక్టులపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాల్సిందేనని, చేనేత, గ్రానైట్‌పైనా జీఎస్టీ తగ్గంచాలన్నారు.

ఎయిమ్స్‌, ఐఐఎం, ఐఐటీఆర్‌, హైకోర్టు, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ సహా దేనికీ కేంద్రం సహకరించడం లేదన్నారు. ఇలా అయితే రాష్ట్రంలో బీజేపీ ఎలా బలపడుతుందని అన్నారు. నేరేళ్ల ఘటన దురదృష్టకరమని, విచారణ తర్వాత పోలీసులపై చర్యలు ఉంటాయన్నారు. ఇసుక మాఫియాను అరికట్టిన ఘటన తమ ప్రభుత్వానిదేనని, ఆదాయం పెరగడమే అందుకు నిదర్శనమని కేటీఆర్‌ పేర్కొన్నారు.  హిమాన్ష్‌ మోటార్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఏడేళ్ల క్రితమే కార్యకలాపాలు ఆపేశానని, తనపై విముర్శలు చేయడం దారుణమని అన్నారు.

Advertisement
Advertisement