అవినీతిని నిలదీస్తే అడ్డంగా రోడ్డేశారు! | Sakshi
Sakshi News home page

అవినీతిని నిలదీస్తే అడ్డంగా రోడ్డేశారు!

Published Wed, Feb 1 2017 6:54 AM

అవినీతిని నిలదీస్తే అడ్డంగా రోడ్డేశారు! - Sakshi

‘సాక్షి’ విలేకరి ఇంటి స్థలంలో దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణం
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కనుసన్నల్లో అనుచరుల అరాచకం
కొమురవెల్లి ఆలయంలో అక్రమాలపై కథనాలు రాయడమే పాపం
మిక్సర్‌ ప్లాంటులో సిమెంటు, కంకర కలిపి తెచ్చి 30 నిమిషాల్లో 100 మీటర్ల రోడ్డు.. మంత్రి హరీశ్‌రావుకు ఫిర్యాదు..
నివేదిక తెప్పించుకొని న్యాయం చేస్తానని మంత్రి హామీ

సాక్షి, సిద్దిపేట: మల్లన్న సన్నిధిలో అక్రమాలను ప్రశ్నించినందుకు అరాచకానికి తెగబడ్డారు.. అవినీతిని నిలదీస్తూ కథనాలు రాసినందుకు కన్నెర్రజేశారు.. ఒక్కో చెమట చుక్కను పోగేసి కొన్న ఇంటి స్థలాన్ని కబ్జా చేశారు.. ఇదేం ఘోరం అని ప్రశ్నిస్తే ‘ఇంకా చేస్తాం.. చూస్తావా?’ అంటూ బెదిరి స్తున్నారు.. ఇదంతా సాక్షాత్తూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కనుసన్నల్లో ఆయన అనుచరులు సాగిస్తున్న దాదాగిరి ఇది! వీరి అరాచకాలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు సైతం వంత పాడుతుండడం గమనార్హం!!

అక్రమాలను ఎండగట్టినందుకే..
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలోని మల్లన్న గుడిలో ఏళ్లుగా జరుగుతున్న అక్రమాలపై ‘సాక్షి’ సమరశంఖం పూరించింది. అవినీతిని ఎండగడుతూ.. ఆలయంలో జరుగుతున్న అక్రమాలపై ఇటీవల వరుస కథనాలు ప్రచురించింది. ఈ కథనాలకు అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్‌ వెంకట్రామరెడ్డి దగ్గర నుంచి పోలీసు విజిలెన్స్  అధికారుల వరకు కొమురవెల్లిని సందర్శించి రికార్డులు తనిఖీ చేసి సీజ్‌ చేశారు. దీంతో ఆలయంలో జరుగుతున్న అక్రమాలు కొంతవరకు తగ్గుముఖం పట్టాయి. కొమురవెల్లి విలేకరి మాంకాలి నగేష్‌ ఈ వార్తలకు సమాచారం అందించాడనే అక్కసుతో కొమురవెల్లి సర్పంచ్‌ గీస భిక్షపతి, దేవస్థానం అభివృద్ధి కమిటీ సభ్యుడు బద్దిపడిగ కృష్ణారెడ్డి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు.

కొమురవెల్లి దేవస్థానం పక్కన 217 సర్వే నంబర్‌లో నగేశ్‌కు 530 గజాల ఇంటి స్థలం ఉంది. తన కుమారుడి భవిష్యత్తు కోసం ఆయన ఈ ప్లాట్‌ను 2004లో కొనుగోలు చేసి 2009లో రిజిస్ట్రేషన్  చేయించుకున్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అనుచరులైన భిక్షపతి, కృష్ణారెడ్డి.. ఈ ప్లాటును దౌర్జన్యంగా కబ్జా చేశారు. ఈ నెల 19న ప్లాటు మీదుగా ఎల్లమ్మ గుడికి సీసీ రోడ్డు వేశారు. దీన్ని ఆపాలంటూ నగేష్‌తో పాటు ‘సాక్షి’ ప్రతినిధులు స్థానిక పోలీసు స్టేషన్ లో సీఐ చంద్రశేఖర్‌ను కలిసి ఫిర్యాదు చేసినా ఆయన స్పందించలేదు. సరికదా సర్పంచ్‌ దురాగతానికి తన సిబ్బందితో కలిసి వచ్చి రక్షణగా నిలిచారు.

‘సాక్షి’ ప్రతినిధులు రోడ్డు నిర్మాణ పనులను ఆపేందుకు చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారు. బాధితుడు తన వద్ద ఉన్న డాక్యుమెంట్లను పోలీసులకు చూపినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రైవేటు మిక్సర్‌ ప్లాంటులో సిమెంటు, కంకర కలిపి తీసుకొచ్చి 30 నిమిషాల వ్యవధిలో 100 మీటర్ల సీసీరోడ్డు వేశారు. ఈ అరాచకాన్ని వివరిస్తూ ‘సాక్షి’ ప్రతినిధులు మంత్రి హరీశ్‌రావును కలసి వినతిపత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన ఆయన వాస్తవ పరిస్థితులపై నివేదిక తెప్పించుకుంటానని హామీ ఇచ్చారు.

దుర్మార్గమైన చర్య
నిజాలను వెలికి తీయడమే మా పని. వరుస కథనాలు రాశారని జర్నలిస్టులపై కక్ష సాధింపులకు పాల్పడటం దుర్మార్గమైన చర్య. ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే ఎమ్మెల్యేనే కాదు.. ఎవరినీ వదలిపెట్టం. దౌర్జన్యంగా ఆక్రమించి రోడ్డు వేసిన ఇంటి స్థలాన్ని తిరిగి నగేష్‌కు అప్పగించకపోతే ఉద్యమానికి సిద్ధమవుతాం. – విరాహత్‌ అలీ, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

స్థలాన్ని తిరిగి ఇప్పించాలి.. లేదంటే ఉద్యమం
మల్లన్న సన్నిధిలో కొనసాగుతున్న రాక్షస రాజ్యానికి ఇది పరాకాష్ట. ముమ్మాటికి మల్లన్న ఆలయంలో అక్రమాలు జరిగాయి. జర్నలిస్టుగా మేం దీన్ని వేలెత్తి చూపెట్టాం. తప్పా? తప్పు దిద్దుకోవాల్సిన ప్రజాప్రతినిధులు బరితెగించి జర్నలిస్టులపై విరుచుకుపడడం సిగ్గుమాలిన చర్య. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కల్పించుకొని ఇంటి స్థలాన్ని తిరిగి విలేకరికి అప్పగించాలి. లేకుంటే జర్నలిస్టు సంఘాలతో ఐక్య కార్యాచరణ వేసి ఉద్యమానికి సిద్ధమవుతాం. – విష్ణువర్ధన్ రెడ్డి, టీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి (143)

జర్నలిస్టులు రోడ్డెక్కాల్సి వస్తుంది
అక్రమాలపై కథనాలు రాస్తే విలేకరి ఇంటి స్థలాన్ని బలవంతంగా లాక్కుంటారా? ఇది ప్రజాస్వామ్యమా? రాక్షస రాజ్యమా? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతుంటే జర్నలిస్టులు రోడ్డెక్కాల్సి వస్తుంది. తప్పు దిద్దుకునే వరకు ఉద్యమించాల్సి వస్తుంది.    – క్రాంతికిరణ్‌ టీయూడబ్ల్యూజే, (143) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Advertisement
Advertisement