కృష్ణభాస్కర్ ఐఏఎస్ | Sakshi
Sakshi News home page

కృష్ణభాస్కర్ ఐఏఎస్

Published Sun, Jan 25 2015 3:11 AM

కృష్ణభాస్కర్ ఐఏఎస్

ఆయన ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి బీటెక్ ఎలక్ట్రానిక్స్ పట్టా అందుకున్నారు. తర్వాత ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. బహుళజాతి కంపెనీలో ఉద్యోగం పొందేందుకు అన్ని అర్హతలు సాధించారు. వెంటనే మోటరోలా కంపెనీ డిజైన్ ఇంజినీర్‌గా నియమించుకుంది. అంతపెద్ద కంపెనీల్లో లక్షల్లో వేతనంపై పనిచేస్తున్నా.. ఆయన మాత్రం అక్కడ ఎంతోకాలం నిలువలేకపోయారు.

తన లక్ష్యమైన ఐఏఎస్ సాధన వైపు అడుగులు కదిపారు. తొలిప్రయత్నంలో ఐఏఎస్‌కు అడుగు దూరంలో ఆగిపోయారు. ఐపీఎస్‌కు ఎంపికై ఓవైపు శిక్షణ పొందుతూనే.. మరో ప్రయత్నంలో లక్ష్యాన్ని చేరుకున్నారు. సివిల్స్ సాధించాలనే నేటి యువతకు రోల్‌మోడల్‌గా నిలిచారు. ఆయనే జగిత్యాల సబ్ కలెక్టర్ దేవరకొండ కృష్ణభాస్కర్.
 - జగిత్యాల అర్బన్
 
సివిల్స్ కుటుంబం..
తల్లిదండ్రులే పిల్లలకు తొలిగురువులు, మార్గదర్శకులు అంటారు. కృష్ణభాస్కర్  విషయంలో ఆ మాట నిజమైంది. అమ్మానాన్నలిద్దరూ ఐఏఎస్ అధికారులే. చిన్నతనం నుంచి వారిని గమనిస్తూ పెరగడం వల్లే తాను కూడా ఐఏఎస్ అధికారి కావాలనుకున్నారు కృష్ణభాస్కర్. ఉన్నత విద్యనభ్యసించి, పెద్ద ఉద్యోగాన్ని వదులుకొని ప్రజాసేవ కోసం సివిల్ సర్వెంట్‌గా మారాను అంటారాయన.

కెరీర్లో ఎన్నో అవకాశాలున్నా... అమ్మానాన్న స్ఫూర్తితో ప్రజాసేవకు ఐఏఎస్సే సరైన దారని భావించానని చెబుతారు. కృష్ణభాస్కర్ తండ్రి దేవరకొండ భాస్కర్ రిటైర్డ్ ఐఏఎస్ కాగా, తల్లి లక్ష్మీపార్థధి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో డెరైక్టర్ ఆఫ్ జనరల్‌గా పనిచేస్తున్నారు. తమ్ముడు పార్థసారధి భాస్కర్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ విభాగానికి ఎంపికై ప్రస్తుతం కస్టమ్స్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
 
పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే..

కృష్ణభాస్కర్‌ది స్వతహాగా కేరళ రాష్ట్రం అయినా... అమ్మానాన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారులు కావడంతో పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లోనే చదువుకున్నారు.ఖరగ్‌పూర్ ఐఐటీలో 2005లో బీటెక్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి 2009లో ఎంబీఏ పట్టా పొందారు. అనంతరం మొటరోలా కంపెనీలో డిజైన్ ఇంజినీర్‌గా పనిచేసిన ఆయన తల్లిదండ్రుల బాటలోనే నడవాలని సివిల్స్‌పై దృష్టి సారించారు.

2011లో సివిల్స్ రాయగా మొదటి ప్రయత్నంలోనే 90వ ర్యాంకుతో ఐపీఎస్ వచ్చింది. సర్దార్ వల్లాభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్‌లో ట్రెయినింగ్ పొందిన అనంతరం ట్రెయినీ ఎస్పీగా ఆదిలాబాద్ జిల్లాలో పనిచేశారు. కానీ, ఆయన దృష్టంతా సివిల్స్‌లో టాప్ అయిన ఐఏఎస్‌పైనే ఉండేది. ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తూనే 2012లో మరోసారి సివిల్స్ రాశారు. ఈసారి 9వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.

ముస్సోరీలో శిక్షణ అనంతరం విశాఖపట్టణంలో శిక్షణ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఏఎస్ విభజనలలో భాగంగా కృష్ణభాస్కర్‌ను తెలంగాణకు కేటాయించగా తొలి పోస్టింగ్ జగిత్యాల సబ్ కలెక్టర్‌గా లభించింది. ఈ నెల 13న బాధ్యతలు స్వీకరించిన ఆయన తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు.
 
పారదర్శకపాలన అందిస్తా..
పేదల కోసం ప్రభుత్వం ఏమేం పథకాలు ప్రవేశపెడుతుందో చాలా మందికి తెలియడం లేదు. ఈ పథకాలు వారికి అందించడమే ధ్యేయంగా పనిచేస్తా. నేను ఎన్నో రకాల కెరీర్‌లు పరిశీలించినా  సేవ చేయడమే లక్ష్యంగా ఐఏఎస్‌ను ఎంచుకున్నా. అవినీతిని అంతం చేసేలా పారదర్శక పాలన అందిస్తా.

ఎంబీఏలో నేర్చుకున్న మేనేజ్‌మెంట్ మెలకువలు ఇప్పుడు ఎంతో ఉపయోగపడనున్నాయి. మాది స్వతహాగా కేరళ రాష్ట్రం అయినా... అమ్మానాన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారులు కావడంతో నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. తెలంగాణపై నాకు పూర్తి అవగాహన ఉంది. త్వరలోనే డివిజన్‌పై పూర్తి అవగాహన పెంచుకుని పనులు సక్రమంగా జరిగేలా చూస్తా.

Advertisement
Advertisement