బంగారు కృష్ణయ్య | Sakshi
Sakshi News home page

బంగారు కృష్ణయ్య

Published Sun, Oct 26 2014 12:04 AM

బంగారు కృష్ణయ్య

  • పేద  ఇంట్లో పుట్టి ప్రొఫెసర్‌గా ఎదిగిన కృష్ణయ్య
  •  పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకున్న వైనం
  • ఉస్మానియా యూనివర్సిటీ: పట్టుదల...క్రమశిక్షణ... ఈ రెండింటి కలబోతే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణయ్య. మహబుబ్‌నగర్ జిల్లా మాడుగుల మండలంలోని దిల్వార్ ఖాన్‌పల్లిలోనినిరుపేద దళిత కుటుంబానికి చెందిన అరెకంటి లక్ష్మయ్య, నర్సమ్మ దంపతుల కుమారుడు కృష్ణయ్య. చిన్ననాటి నుంచి చదువంటే ఆసక్తి కనబరిచే ఆయన అనేక కష్టనష్టాలకు ఓర్చి ఉన్నత విద్యను అభ్యసించారు. హాస్టళ్లలో ఉంటూ... ఉపకార వేతనాలు...మిత్రుల సాయంతో చదువు సాగించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించారు.
     
    పీహెచ్‌డీలో గోల్డ్ మెడల్


    ప్రొఫెసర్ కృష్ణయ్య ఓయూలో విధులు నిర్వహిస్తూనే ఐఐటీ చెన్నైలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. తన పరిశోధనకు బంగారు పతకం అందుకున్నారు. ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకుల్లో పీహెచ్‌డీలో బంగారు పతకం సాధించిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. అనంతరం పోస్టు డాక్టరల్ ఫెలోషిప్ (పీడీఎఫ్)ను దక్షిణ కొరియాలో పూర్తి చేశారు. సుమారు 17 ఏళ్ల బోధన అనుభవం గల ఆయన రూ.32 లక్షలతో మూడు యూజీసీ, ఏఐసీటీఈ ప్రాజెక్టులు చేస్తున్నారు.
     
    తొమ్మిది దేశాల్లో పర్యటన..

    ఓయూ అధ్యాపకునిగా పని చేస్తున్న కృష్ణయ్య 25 పరిశోధన పత్రాలను సమర్పించారు. అందులో 15 అంతర్జాతీయ, పది జాతీయ స్థాయి పేపర్లు ఉన్నాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, ఫ్రాన్స్, చైనా, థాయ్‌లాండ్, కొరియా, సింగపూర్‌లలో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధన పత్రాలను సమర్పించారు. బోధన, పరిశోధనలో ప్రతిభకు సుదర్శన్ భట్ మెమోరియల్ అవార్డు అందుకున్నారు. ఓయూ టీచర్స్ అసోసియేషన్ (ఔటా)లో రెండు పర్యాయాలు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌తో పాటు, ఇతర పదవులు చేపట్టిన ఆయనప్రస్తుతం అడిషనల్ కంట్రోలర్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు  తన స్వగ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. కష్టపడి చదవితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని చెప్పే కృష్ణయ్య జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.
     
    స్నేహితుల సహకారంతోనే
     
    పేద కుటుంబం కావడంతో ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కష్టపడి చదువుకున్నాను. ఓయూకు ప్రొఫెసర్‌ను అవుతానని కలలోనైనా అనుకోలేదు. వ్యవసాయ కుటుంబం కావడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. స్కాలర్‌షిప్‌లు, స్నేహితుల ఆర్థిక సహకారంతో చదువుల బండి సాగింది. అమనగల్లు, బీచ్‌పల్లిలో పది వరకు చదివా. కోఠిలో గల (నేడు బీఎన్ రెడ్డిలో) చైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేశా. సైఫాబాద్ సైన్స్ కళాశాలలో బీఎస్సీ చ6దువుతూ ఎంసెట్‌కు హాజరయ్యాను. ఓయూ క్యాంపస్‌లోని ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో సీటు సాధించాను. బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి ప్రాజెక్టులో పని చేస్తుండగానే 1997లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం లభించింది. దీంతో ఉన్నత విద్య పై మరింత ఆసక్తి కలిగింది. 2012లో ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించింది.
     - ప్రొఫెసర్ కృష్ణయ్య
     

Advertisement
Advertisement