అభివృద్ధికి పునరంకితం | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి పునరంకితం

Published Thu, Mar 9 2017 4:07 PM

health minister c.laxma reddy talks on sakshi

► పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి
► ఉమ్మడి జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరందిస్తాం
► యుద్ధప్రాతిపదికన మెడికల్‌ కాలేజీ
► ఏప్రిల్‌ 1నుంచి ఒంటరి మహిళలకు ‘ఆసరా’
► ‘సాక్షి’తో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి

వలసల జిల్లా అన్న ముద్ర త్వరలో చెరిగిపోనుంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సీ లక్ష్మారెడ్డి జిల్లా అభివృద్ధికి ప్రత్యేకచొరవ తీసుకుంటున్నారు. మౌలికసదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వపరంగా అన్ని సహాయసహకారాలు అందిస్తున్నారు. దాంతో రెండున్నరేళ్లుగా పాలమూరు జిల్లా అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోంది. నిత్యం అధికార యంత్రాంగంతో సమీíక్షిస్తూ సలహాలతో సొంత నియోజకవర్గం జడ్చర్లకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. జిల్లా అభివృద్ధి ప్రణాళికపై మంత్రి లక్ష్మారెడ్డి ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలు


పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలతోపాటు ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టుల పూర్తి.. వైద్య సదుపాయాల కల్పన..వలస నివారణ.. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ.. ఇలా ప్రతి అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతున్నాం. వలసల పాలమూరు పచ్చగా మారాలి. అభివృద్ధికి పునరంకితమవుతాను.                               – వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
                                                                                                                                          
సమ్మర్‌కు ప్రత్యేక కార్యాచరణ
ఈ ఏడాది వేసవిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. మూడేళ్లుగా సరైన వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు బాగా పడిపోయాయి. మక్తల్, దేవరకద్ర నియోజకవర్గంలో సమస్య లేదు. కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టుల ద్వారా చాలా చెరువులను నింపడంతో ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. మహబూబ్‌నగర్, జడ్చర్ల, నారాయణపేట నియోజకవర్గాలకు తాగునీటి సమస్య తీవ్రంగా ఉండనుంది. ఈ సమస్యను అధిగమించడం కోసం ముందస్తు ప్రణాళిక రూపొందించాం. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. రామన్‌పాడు, కోయిల్‌సాగర్‌ నుంచి నీటి సరఫరా పర్‌ఫెక్టుగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో కొత్త బోర్లు, ఉన్న వాటిని లోతు పెంచేలా చూడాలని అధికారులను ఆదేశాలిచ్చాం. ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేసే వాటికి ధరలు పెంచాం. పాత బకాయిలన్నీ పేమెంట్‌ చేయాలని ఆదేశించాం.


కాంగ్రెస్‌ నేతలకు బుద్ధి రావాలి
ప్రాజెక్టుల ద్వారా నీరు తీసుకొచ్చి రైతుల ముఖంలో చిరునవ్వును తీసుకొచ్చేందుకు మేం ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అడుగడునా అడ్డు తగులుతోంది. కేసులు వేస్తూ.. రైతుల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తోంది. ఏదైనా మంచి కార్యక్రమం చేపట్టినప్పుడు చేతనైతే సహాయం చేయాలేకానీ... రాళ్లు వేయడం మంచి పద్ధతి కాదు. ఒక వైపు కోర్టుల్లో కేసులు వేస్తూ మరో వైపు చర్చ కార్యక్రమాలను నిర్వహిస్తూ దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ని కోరుతున్నా.


జిల్లాకు పచ్చదనం తీసుకొస్తాం
మహబూబ్‌నగర్‌ జిల్లాలో వర్షపాతం చాలా తక్కువ. కరువు నేలను పచ్చగా మార్చేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పెండింగ్‌లో ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తూనే.. రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రాజెక్టు పాలమూరు–రంగారెడ్డి పనులు వేగంగా పూర్తిచేసి ప్రతీ ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించాం. తద్వారా పాలమూరును పచ్చగా మార్చి వలసలను రూపుమాపాలని భావిస్తున్నాం. అందుకు అనుగుణంగా ఈ ఏడాదే కేఎల్‌ఐ ద్వారా పెద్ద సంఖ్యలో చెరువులను నింపాం. నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలం తుమ్మల్‌సూరు వద్ద ఒక రైతు న్యాయస్థానాలకు వెళ్లి అడ్డుపడుతుంటే.. సముదాయించి అతని సమస్యను పరిష్కరించాం. బిజినేపల్లి– ఆవంచకు క్లియరెన్స్‌ తీసుకొచ్చాం. నష్టపరిహారం చెల్లిస్తాం.


జడ్చర్ల ప్రజలకు రుణపడి ఉంటా..
నాకు పేరు ప్రతిష్టలు, రాష్ట్ర స్థాయిలో ఒక మంత్రిగా గుర్తింపు తీసుకొచ్చింది జడ్చర్ల నియోజకవర్గ ప్రజలే. వారికి జీవితాంతం రుణపడి ఉంటా. నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తూ.. కడుపులో పెట్టుకొని చూస్తున్న జడ్చర్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తి మేర ప్రయత్నిస్తున్నా.


రికార్డు స్థాయిలో పింఛన్లు

జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం తరఫున ప్రజలకు ఆసరా కల్పిస్తున్నాం. మహబూబ్‌నగర్‌ జిల్లాలో అన్ని రకా ల పింఛన్లు 1,64,078 మందికి నెలనెలా డబ్బులు అందజేస్తున్నాం. వీటిలో వృద్ధాప్య పింఛన్లు 64,009, వితంతువు 71,555, వికలాంగులు 21,176, చేనేత కార్మికులకు 3,237మందికి, కల్లుగీత కార్మికులకు 1,432 మందికి, బీడీ కార్మికులకు 2,669 మందికి అందజేస్తున్నాం. ఏప్రిల్‌ 1నుంచి ఒంటరి మహిళలకు కూడా పింఛన్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం. జోగినీ మహిళలకు ప్రతీ నెల పింఛన్‌ అందనుంది.


యుద్ధ ప్రాతిపదికన వైద్యకళాశాల
రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటి మెడికల్‌ కాలేజీని పాలమూరుకే తీసుకొచ్చాం. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) నుంచి 8నెలల్లోనే అనుమతులు రావడం దేశ చరిత్రలో సరికొత్త రికార్డు. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తిచేసి తరగతులు ప్రారంభించాం. బైపాస్‌ రోడ్డుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.



                                           

Advertisement
Advertisement