ఎవుసం పనులు ఊపందుకోవాలి | Sakshi
Sakshi News home page

ఎవుసం పనులు ఊపందుకోవాలి

Published Mon, May 25 2015 2:56 AM

ఎవుసం పనులు ఊపందుకోవాలి - Sakshi

* వ్యవసాయ క్షేత్రంలో ఉద్యోగులకు సీఎం కేసీఆర్ సూచనలు
* కాన్వాయ్‌లోనే తిరుగుతూ పంటల పరిశీలన, పనుల పర్యవేక్షణ
* అడుగడుగునా ప్రజల వినతులు.. హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిన సీఎం

 
జగదేవ్‌పూర్: ‘ఖరీఫ్ దగ్గరలో ఉంది.. ఎవుసం పనులు ఊపందుకోవాలి.. భూమిని మంచిగా దున్నండి.. ఎరువులు బాగా చల్లండి.. ఏ పంటలు వేస్తే బాగుంటుంది.. కొత్త బావిని తొందరగా పూర్తి చేయాలి..’ అంటూ ఆదివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన వ్యవసాయక్షేత్రంలో పర్యటిస్తూ ఫాంహౌస్ సూపర్‌వైజర్ జహంగీర్‌కు పలు సూచనలు చేశారు. శనివారం సాయంత్రం  మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ రాత్రి  ఇక్కడే బస చేశారు. ఉదయమే లేచి కాన్వాయ్ ద్వారా వ్యవసాయక్షేత్రంలో పర్యటించారు. ఎరువులు చల్లిన భూమిని పరిశీలించారు. అక్కడి నుంచి బయటకు వచ్చి, అదనంగా కొన్న 14 ఎకరాల భూమిని పరిశీలించారు. డ్రిప్ సౌకర్యాన్ని తొందరగా పూర్తి చేయాలని సూపర్‌వైజర్‌ను ఆదేశించారు. ఆదే దారిన మళ్లీ ఫాంహౌస్‌లోకి చేరుకుని నూతనంగా తవ్విస్తున్న బావిని, సొరకాయ తోటను పరిశీలించారు. అక్కడే మధ్యాహ్నం భోజనం చేసి 2.25 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు.
 
 సీఎంతోనే మంత్రి జగదీశ్వర్‌రెడ్డి..
 శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు వచ్చిన కొద్దిసేపటికే విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి కూడా చేరుకొని,రాత్రి అక్కడే బస చేశారు. ఎర్రవల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభానికి మంత్రి ఫాంహౌస్‌కు వచ్చినట్లు తెలిసింది. అయితే అది పూర్తి కాకపోవడంతో వచ్చే నెలకు వాయిదా వేసినట్లు సమాచారం. అలాగే రాష్ర్టంలో విద్యుత్ సరఫరాపై  కేసీఆర్ మంత్రితో ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిసింది. సీఎం కాన్వాయ్‌లోనే మంత్రి జగదీశ్వర్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లారు. సీఎం కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో ఉన్నారని తెలుసుకున్న ప్రజలు ఆదివారం ఉదయం నుంచే అక్కడకు వచ్చి తమ సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చారు.  ఎస్పీ సుమతి. సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ అధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం తిరిగి హైదరాబాద్ వెళ్లే వరకు  ఈ బందోబస్తు కొనసాగింది.
 

Advertisement
Advertisement