దిగ్విజయ్ మోసకారి: డీఎస్ | Sakshi
Sakshi News home page

దిగ్విజయ్ మోసకారి: డీఎస్

Published Thu, Jul 2 2015 12:53 PM

దిగ్విజయ్ మోసకారి: డీఎస్ - Sakshi

హైదరాబాద్: ఏ పదవి ఆశించి పార్టీ మారడం లేదని కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు డి. శ్రీనివాస్ అన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నదే తన అభిలాష అని పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయం ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. రాష్ట్ర సాధనలో ఎక్కువ కృషి కేసీఆర్ దేనని అన్నారు. రాష్ట్రాల అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా పనిచేయాలన్నారు. తెలంగాణ అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు.

బంగారు తెలంగాణ కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని తెలిపారు. తన అంతరాత్మ ప్రబోదానుసారం కాంగ్రెస్ పార్టీని వీడినట్టు వెల్లడించారు. ఎమ్మెల్సీ కోసం పార్టీ మారుతున్నానడం సరికాదని, తనకు పదవి ఓ లెక్క కాదన్నారు. పదవుల కోసం పాకులాడే మనిషిని కాదన్నారు. దిగ్విజయ్ సింగ్ మోసకారి అని మండిపడ్డారు.

సీఎం తప్ప అన్ని పదవులు దక్కాయని గుర్తు చేసుకున్నారు.  సోనియాపై గౌరవం ఎప్పటికీ ఉంటుందన్నారు. తనకు జరిగిన అవమానాలను ఆమె దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. 2014లో కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం అంశాన్ని హైకమాండ్ పెద్దలు సరిగా డీల్ చేయలేదన్నారు. తన సేవలను టీఆర్ఎస్ ఎలా వినియోగించుకుంటుందనేది సీఎం కేసీఆర్ చేతిలో ఉందన్నారు.

బీసీల సంక్షేమానికి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్తశుద్ధితో పనిచేశారని ప్రశంసించారు. తెలంగాణలో అభివృద్ధి పనులకు ఏపీ ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆరోపించారు. హైదరాబాద్ లో సెటిలర్ల ప్రయోజనాలు కాపాడేందుకు కృషి చేస్తానని డీఎస్ హామీయిచ్చారు.

Advertisement
Advertisement