బీమా ఉంటుందా? | Sakshi
Sakshi News home page

బీమా ఉంటుందా?

Published Thu, Jul 24 2014 1:23 AM

concerned in corn farmers on insurance

కందుకూరు: మొక్కజొన్న పంటకు బీమా సౌకర్యం కల్పించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏడాది జూన్ ప్రారంభంలోనే  విధివిధానాలు ప్రకటించే ప్రభుత్వం జూలై  గడుస్తున్నా ఇంతవరకు  స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం వాతావరణాన్ని బట్టి చూస్తే ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లా పరిధిలో సాగు చేపట్టిన రైతులు బీమా ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

 ఉంటేనే ధీమా...
 మొక్కజొన్న పంటకు జిల్లా పరిధిలో బీమా సౌకర్యం ఉండటంతో రైతుల్లో ధీమా పెరిగింది. పంట నష్టపోయినా బీమా రూపంలో కనీసం పెట్టుబడి అయినా తిరిగివస్తుందనే ధీమాతో అధికంగా మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు రైతులు.

 జిల్లాలో  మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 35729 హెక్టార్లు ఉండగా ఈ ఏడాది ఆలస్యంగా వర్షాలు నమోదు కావడంతో కేవలం ఆరు వేల హెక్టార్లలో మాత్రమే ఇప్పటివరకు సాగు చేపట్టారు. కందుకూరు, షాబాద్, ధారూరు, వికారాబాద్, మహేశ్వరం, చేవెళ్ల, షామీర్‌పేట తదితర మండలాల్లో అధికంగా మొక్కజొన్న పైరును సాగు చేస్తున్నారు. ఎకరాకు పెద్ద రైతుల నుంచి రూ.229, చిన్న, సన్నకారు రైతుల నుంచి రూ.206 వరకు ప్రీమియంగా వసూలుచేసేవారు వ్యవసాయాధికారులు.

ఈ మొత్తాన్ని జులై 31లోపు  కట్టించుకునేవారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రభుత్వ యంత్రాంగం వైపు నుంచి స్పందన లేదు. దీంతో రోజూ రైతులు వ్యవసాయాధికారులను బీమా విషయమై సంప్రదిస్తూనే ఉన్నారు. జూన్ నెలలో సాగు చేసిన రైతులు ఆ నెలలోనే బీమా చెల్లించాలి, ప్రస్తుతం జూలై నెల కూడా మరో వారంలో ముగియనుండటంతో ఈ ఏడాది బీమా అసలు అమలు చేస్తారా లేదా అనే సంశయం రైతుల్ని పట్టిపీడిస్తుంది.

ఆలస్యంగానైనా బీమా అమలు చేస్తే ముందుగా సాగు చేసిన పంటల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారా  లేదా అనే సందేహాలతో సతమతమవుతున్నారు. వ్యవసాయాధికారుల్ని ఈ విషయమై వివరణ కోరగా.. ఇప్పటివరకు ఎలాంటి విధివిధానాలు తమకు అందలేదని చెబుతున్నారు.

Advertisement
Advertisement