రేషన్‌కార్డులో మార్పుచేర్పులిలా.. | Sakshi
Sakshi News home page

రేషన్‌కార్డులో మార్పుచేర్పులిలా..

Published Tue, Jul 22 2014 12:25 AM

రేషన్‌కార్డులో మార్పుచేర్పులిలా..

 మీ రేషన్ కార్డు తప్పుల తడకగా ఉందా? చేర్పులు, మార్పులు  కావాలా? చింతించాల్సిన పనిలేదు. సులువుగానే సరిచేసుకోవచ్చు. పేర్లలో తప్పులు దొర్లినా, పుట్టిన తేదీ సక్రమంగా లేకపోయినా.. చిరునామా మారినా.. అసలు కార్డు చేజారినా...తిరిగి పొందవచ్చు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఇల్లు... మారినా.. కార్డును బదిలీ చేసుకోవచ్చు. సంబంధిత పౌరసరఫరా కార్యాలయానికివెళ్లకుండానే ‘ఏపీ ఆన్‌లైన్ కేంద్రం’ ఈ-సేవ, మీ-సేవ కేంద్రాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు.                   
 - నల్లగొండ
 
 చిరునామా మార్పిడి ఇలా..
 చిరునామా మార్పు కోసం కొత్త నివాసం చిరునామా తెలిప్తే అడ్రస్ ప్రూఫ్ (కరెంటు బిల్లు, బ్యాంక్ పాస్‌బుక్, బీఎస్‌ఎన్‌ఎల్ ఫోన్ బిల్లు తదితరాలు)గా అందజేసి చిరునామాను మార్చుకోవచ్చు. ఇవేవి లేకుంటే రూ.10 స్టాంప్ పేపర్‌పై న్యాయవాదితో నోటరీ చేయించి అడ్రస్ ప్రూఫ్‌గా సమర్పించవచ్చు.
 
 తప్పుల సవరణ..
 రేషన్ కార్డులో ఒక పేరుకు బదులు మరో పేరు ప్రింట్ కావడం, ఇంటి పేరు తప్పుగా అచ్చవడం, పేరులో అక్షర దోషాలుంటే పదో తరగతి విద్యార్హత సర్టిఫికెట్, పాన్ , ఓటరు, ఆధార్ కార్డు వీటిల్లో ఏదైనా ఒక దాని నకలు కాపీని సమర్పించి తప్పులను సవరించుకోవచ్చు. ఇవేవి లేనివారు రూ.10 స్టాంప్ కాగితంపై న్యాయవాది చేత నోటరీ చేయించి అందజేయాలి.
 
 పుట్టిన తేదీ సవరణ..
 పుట్టిన తేదీని మార్పించుకోవాలంటే జనన ధ్రువీకరణ పత్రం లేదా పాన్, ఆధార్, ఓటరు కార్డు, టెన్‌‌త మార్కుల జాబితా ఏదో ఒకదాని నకలును సమర్పించాలి.
 
  రక్తసంబంధంలో...
 రక్తసంబంధీకులకు సంబంధించి ఏవైనా తప్పులు దొర్లితే మాత్రం మార్కుల జాబితాలు, లేదా సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ వంటి వివరాలు ఏదో ఒకటి సరిపోతుంది.
 
 ధ్రువీకరణ ఇలా..
 రేషన్ కార్డులో చేర్పులు, మార్పులు, సవరణను తగిన ఆధారాలతో మీ-సేవ ద్వారా ఆన్‌లైన్‌లో నివేదించిన అనంతరం సంబంధిత సర్కిల్ అసిస్టెంట్ పౌరసరఫరా అధికారి పరిశీలించి ధ్రువీకరిస్తారు. అనంతరం సవరించిన కార్డును మీ- సేవ ద్వారా జారీ చేస్తారు.

Advertisement
Advertisement