'అమరావతి కాదు.. భ్రమరావతి' | Sakshi
Sakshi News home page

'అమరావతి కాదు.. భ్రమరావతి'

Published Sun, Aug 28 2016 4:00 AM

'అమరావతి కాదు.. భ్రమరావతి' - Sakshi

* రాజధాని ముసుగులో జరుగుతున్న అక్రమాలపై  విచారణకు సిద్ధమా?
* సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి సవాల్

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నట్లుగా రాజధాని అమరావతి కాదని.. భ్రమరావతి అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అభివర్ణించారు. రాజధాని నిర్మాణం ముసుగులో సాగుతోన్న అక్రమాలు, అవినీతిపై ‘భ్రమరావతి’ పేరుతో రచించిన పుస్తకాన్ని ఆయన శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సింగపూర్ దేశాన్ని భూతల స్వర్గంగా, అవినీతి రహిత దేశంగా సీఎం చంద్రబాబు చెప్పడంలో వాస్తవం లేదన్నారు.

వివిధ దేశాల్లో దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి మాత్రమే సింగపూర్ స్వర్గధామమని చెప్పారు. యూని బ్యాంక్‌ను దోచేసిన సుకాన్‌టో టనాటోకూ అనే వ్యక్తితో పాటు పలువురికి సింగపూర్ ఆశ్రయమిచ్చిందని తెలిపారు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ సింగపూర్ సంస్థలకు మంచి పేరు లేదని చెప్పారు. బ్రెజిల్ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిన ‘పెట్రోబార్స్ కుంభకోణం’లో సింగపూర్‌కు చెందిన సెంబ్ కార్ప్ పాత్రధారి అని ఆ దేశ విచారణ సంస్థలు తేల్చాయన్నారు. ఇప్పుడు ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధికి స్విస్ చాలెంజ్ పద్ధతిలో ప్రతిపాదనలిచ్చిన కన్సార్టియంలో సెంబ్ కార్ప్ కూడా ఉందన్నారు.

సింగపూర్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశించిన స్విస్ ఛాలెంజ్‌ను అమలు చేసేందుకు సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను కూడా చంద్రబాబు తుంగలో తొక్కారని విమర్శించారు. సీబీఐ విచారణ జరిపితే రాజధాని ముసుగులో జరుగుతున్న అక్రమాలు వెలుగులోకి వస్తాయన్నారు. అక్రమాలను ప్రశ్నించినా, కోర్టులకు వెళ్లిన వారిని అభివృద్ధి నిరోధకులుగా చిత్రీకరించడం చంద్రబాబు శైలి అని విమర్శించారు. రాజధాని ముసుగులో సాగుతోన్న అక్రమాలపై చర్చకు సిద్ధమా అని సీఎం చంద్రబాబుకు ఉండవల్లి సవాల్ విసిరారు.

Advertisement
Advertisement