బీజేపీలోకి రీటా బహుగుణ | Sakshi
Sakshi News home page

బీజేపీలోకి రీటా బహుగుణ

Published Fri, Oct 21 2016 1:29 AM

బీజేపీలోకి రీటా బహుగుణ - Sakshi

బీజేపీ చీఫ్ అమిత్‌షా సమక్షంలో చేరిక.. యూపీలో కాంగ్రెస్‌కు షాక్
న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, యూపీసీసీ మాజీ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో 67 ఏళ్ల బహుగుణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా ఆమె రాజీనామా చేశారు. బీజేపీలో చేరిన అనంతరం కాంగ్రెస్‌ను రాహుల్ గాంధీ నడిపిస్తున్న విధానంపై ఆమె విమర్శలు గుప్పించారు. దేశం రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించే స్థితిలో లేదని, ఆయన తీరుతో చాలా మంది సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు.

యూపీలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలా దీక్షిత్ పేరును ప్రకటించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. సర్జికల్ దాడులకు సంబంధించి ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. సర్జికల్ దాడులకు సంబంధించి భారత్ వాదనను మొత్తం ప్రపంచం అంగీకరించిందన్నారు. ప్రధాని మోదీకి, బీజేపీకి ప్రత్యామ్నాయం లేదన్నారు. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, సీనియర్ నాయకులను పక్కన పెడుతున్నారని, వారు ఏం మాట్లాడాలి.. ఎంత మాట్లాడాలనే విషయం కూడా ఆయనే చెబుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసమే తాను బీజేపీలో చేరినట్టు బహుగుణ చెప్పారు. రీటా నమ్మకద్రోహి అని కాంగ్రెస్ మండిపడింది.

బ్రాహ్మణ ఓట్లపై ప్రభావం!
రీటా బహుగుణ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. స్వాతంత్య్ర సమరయోధుడు, యూపీ మాజీ సీఎం హేమ్‌వతి నందన్ బహుగుణ కుమార్తె. రాహుల్, షీలాదీక్షిత్ మాదిరిగానే రాజకీయ వారసత్వంతో వచ్చిన రీటా 24 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉన్నారు. బ్రాహ్మణ ఓటర్లను ప్రభావితం చేసే సామర్థ్యం ఉన్న రీటా చేరిక బీజేపీకి మేలు చేసేదే. అసలే ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే అంశమే. మరోవైపు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీజేపీలో చేరిన రీటా ఆ పార్టీలో ఎలా సర్దుకుపోతారనేది కూడా ఆసక్తికరంగా ఉంది.

Advertisement
Advertisement