ఆ యువతుల వలలో పడ్డారో.. ఇక అంతే | Sakshi
Sakshi News home page

ఆ యువతుల వలలో పడ్డారో.. ఇక అంతే

Published Wed, Dec 7 2016 12:17 PM

ఆ యువతుల వలలో పడ్డారో.. ఇక అంతే - Sakshi

తియ్యటి మాటలతో కవ్విస్తారు  
ఆపై మీ సొమ్మును ఖాళీ చేయిస్తారు
గుర్తుతెలియని ఎస్‌ఎంఎస్‌లతో జాగ్రత్త  
వలలో పడ్డారో.. జీవితం సర్వనాశనం
 
ముచ్చటగా మిస్డ్‌ కాల్‌ ఇస్తారు. ఆ పై కొందరు యువతులు తియ్యని మాటలతో ముగ్గులోకి దింపుతారు. మనసు దోచుకునేలా కబురులు
చెబుతారు. మీ దగ్గర ఉన్న సొమ్మునంతా ఖాళీ చేయిస్తారు. ఆపై చెప్పాపెట్టకుండా హుడాయిస్తారు.. ఆ వలలో పడ్డారో.. ఇక అంతే.. జీవితం సర్వనాశనం.. గుర్తుతెలియని ఎస్‌ఎంఎస్‌లతోనూ జాగ్రత్త సుమా..!
 
తిరుపతి తుడా:  ఇటీవల యువత సామాజిక మాధ్యమాలపై మోజు పెంచుకుంటోంది. యువతీ, యువకులు ఫేస్‌బుక్, వాట్సాప్‌ ఇతర సోషల్‌ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుంటున్నారు. వాటి యావలోనే బతుకు వెళ్లదీస్తున్నారు. అవికాస్త వికటించడంతో ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తిరుపతి నగరంతోపాటు జిల్లాలోనూ   పెచ్చుమీరుతున్నారు.
 
తిరుపతిలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న యువకుడికి పది రోజుల క్రితం మిస్డ్‌ కాల్‌ వచ్చింది. మొదట పట్టించుకోలేదు. మరుసటి రోజు మళ్లీ అదే నంబర్‌ నుంచి మిస్డ్‌ కాల్‌ రావడంతో తెలిసిన వాళ్లెవరైనా ఉంటారేమోనని తిరిగి కాల్‌ చేశాడు. అటుపక్క నుంచి ఓ యువతి హలో.. పవనే కదా.. అంటూ మాటలు కలిపింది. ఆపై ఇద్దరూ రోజూ చాటింగ్‌లో హాయ్‌.. బాయ్‌లు చెప్పడం మొదలు పెట్టారు. వారం తర్వాత సార్‌ ఏమీ అనుకోవద్దు.. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను.. డబ్బులు అవసరం ..ఏడుపొస్తోంది.. అనగానే కరిగిపోయిన అతను ఎంత అవసరమని అడిగాడు. రూ.10 వేలు.. సాయంత్రం కల్లా ఇవ్వకుంటే పెద్ద సమస్య వచ్చి పడుతుందని చెప్పడంతో అతను నమ్మి ఆ మొత్తాన్ని ఆ యువతి చేతిలో పెట్టాడు. ఆపై మాటలు కట్‌.. నంబర్‌ స్విచ్చాప్‌.. ఖంగుతిన్న ఆ యువకుడు డబ్బుల కోసమే ఇదంతా జరిగిందని తెలుసుకుని బాధపడ్డాడు. 
 
తిరుపతి రాయల్‌ నగర్‌కు చెందిన ఓ యువకుడికి నాలుగు రోజుల క్రితం వాట్సాప్‌కు హయ్‌ అని ఓ మెస్సేజ్‌ వచ్చింది. రాత్రి 9 దాటితే అలా ప్రతిరోజూ హాయ్‌.. హలో అంటూ మెసేజ్‌లు రావడంతో తిరిగి హౌ ఆర్‌ యూ అని మెసేజ్‌ పెట్టాడు. ట్రూ కాలర్‌ ద్వారా అప్పటికే అతని పేరు తెలుసుకున్న ఓ యువతి మీరు నాకు తెలుసు.. నేను ఎవరినో కనుక్కోండి చూద్దాం అంది. అర్థంగాక అతను జుట్టు పీక్కున్నాడు. మీరు ఎవరు అని అడగడం మొదలు పెట్టాడు. ఆ యువతి బాలాజీ కాలనీలోని ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటానని చెప్పింది. నేను ఇంత చెప్పాను మరి మీ గురించి చెప్పవచ్చు కదా.. అంటూ అతని డేటా లాగుతూ రోజూ తియ్యని మాటలు చెప్పడం మొదలు పెట్టింది. రెండు రోజుల క్రితం కాల్‌ చేసి.. నా ఫ్రెండ్‌ను ఆస్పత్రిలో చేర్పించాము.. అర్జెంట్‌గా రూ.18 వేలు కట్టమంటున్నారు.. హాస్టల్‌లో ఎవరి దగ్గరా అంత డబ్బు లేదు.. వాళ్ల అమ్మానాన్మలు రావడానికి ఒక రోజు పడుతుంది. మనీ అడ్జస్ట్ చెయ్యి.. వాళ్లు రాగానే తీసి ఇస్తాను అని చెప్పడంతో  అతను నిజమే అని నమ్మాడు. తన వద్ద రూ.12,000 ఉందని చెప్పడంతో చాల్లే మిగతా నా దగ్గర ఉంది అని చెప్పి ఆ యువతి స్కూటీలో మాస్క్‌తో వచ్చి తీసుకెళ్లింది. ఆపై ఆ యువతి అడ్రస్‌ మాయమయ్యింది. ఇప్పటికీ అడ్రస్‌ లేదు.

Advertisement
Advertisement